తెలంగాణలో యాసంగి పంటకు సంబంధించి ధాన్యం కొనేది లేదని, కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్‌పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి వాడిన పదజాలాన్ని తప్పుబట్టారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి దిగజారి మాట్లాడారని విమర్శించారు. సాధారణ బియ్యం కేంద్రం కొంటుందని చెప్పిందని.. కిషన్ రెడ్డి అదే విషయం స్పష్టం చేశారని బండి సంజయ్ గుర్తు చేశారు. మళ్లీ కేంద్రాన్ని కొనేలా చేయాలని డిమాండ్ చేయడం ఏంటని బండి ప్రశ్నించారు. ఢిల్లీలో బండి సంజయ్ విలేకరుల సమావేశం నిర్వహించారు.
‘‘తెలంగాణలో యాసంగి పంటలో కేవలం బాయిల్డ్ రైస్ వస్తుందనేది పూర్తిగా అబద్దం. మన రాష్ట్రంలో రైతులు ఒకే తరహా విత్తనం పండించడం లేదు. ఆరేడు రకాల వరి విత్తనాలను రైతులు వాడుతున్నారు. అలాంటప్పుడు వాటిని ఎందుకు ప్రమోట్ చేయరు. సాధారణ బియ్యాన్ని కొంటామని కేంద్రం చెప్పింది. కొనడం లేదని సీఎం ఎలా అంటారు? తెలంగాణ రైతులు పండించిన పంటలను నువ్వు కొని తీరాలి. ఎట్ల కొనవో చూస్తా బిడ్డా.. కేంద్రం పెత్తనం ఏందన్నవు కదా.. అది ఇప్పుడేమైంది?’’
‘‘నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాల్లో జనాభా మన దేశంలో యూపీ కన్నా తక్కువ. వాటితో మన దేశానికి పోలిక ఏంటి? ఏదో తుప్పాస్ సంస్థ ఇచ్చే నివేదిక పట్టించుకుంటారా? ముందు తెలంగాణ హంగర్ ఇండెక్స్‌లో ఏ స్థానంలో ఉన్నామో చెప్పు? ఈ మధ్య సీఎం పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లను బాగా కలవరిస్తున్నాడు. వాటితో ఏమన్నా సంబంధాలు పెట్టుకుంటుండేమో? వేర్వేరు వాళ్లకి సాయం చేస్తున్నావు. పాకిస్థాన్‌లో ఉండే తీవ్రవాద సంస్థలకు కూడా డబ్బులు ఇస్తున్నవేమో ఎక్వైరీ చేయాలే.. నాకైతే డౌట్ వస్తున్నది. పాకిస్థాన్‌ను సరిగ్గా పాలించలేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వయంగా చెప్పాడు. అలాంటప్పుడు ఆ దేశం హంగర్ ఇండెక్స్‌లో ముందుస్థానంలో ఎలా ఉంటది? ఈ మధ్య నీకు పాక్‌పై ప్రేమ పుడుతున్నది. రహస్య ఒప్పందాలేమైనా చేసుకుంటున్నవా ఏంది? నిఘా సంస్థలు కేసీఆర్‌పై కన్ను పెట్టాలి.’’ అని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.
‘‘బీజేపీ హంతకుల పార్టీ అంటున్నవు. అసలు హంతకుల పార్టీ అంటే.. నీదే. నీకు ఇక్కడి జైళ్లు కూడా సరిపోవు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చావు. ఆర్టీసీ కార్మికులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు, రైతులు ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు.’’ అని బండి సంజయ్ మాట్లాడారు.
Also Read: CM KCR: యాసంగిలో ధాన్యం సేకరణ ఉండదు... వర్షకాలం పంటను ఎంతైనా కొంటాం... సీఎం కేసీఆర్ కీలక ప్రకటన...
Also Read: TS Cabinet : ఒమిక్రాన్‌పై పోరుకు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ . ఆ ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టి !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి