మావోయిస్టు దళ సభ్యుడు మాడవి హిడ్మా లొంగిపోయాడు. ములుగు ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ ఎదుట నేటి ఉదయం లొంగిపోయినట్లు సమాచారం. క్రిస్తారం మండలం తొండమార్క గ్రామానికి చెందిన జూనియర్ హిడ్మా మావోయిస్టు పార్టీలో సభ్యుడిగా పనిచేస్తున్నాడు. నేడు అతడు లొంగిపోగా, హిడ్మా వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.


మాడవి హిడ్మా అంటే అందరూ మోస్ట్ వాంటెడ్ అయిన మావోయిస్టు హిడ్మా అనుకున్నారు. గతంలో ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు నుంచి ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. తీవ్ర అనారోగ్యానికి గురైన హిడ్మా  తెలంగాణలోకి చికిత్స కోసం వచ్చినట్లు ప్రచారం సైతం జరిగింది. ఇటీవల కన్నుమూసిన అగ్ర నేత ఆర్కే మృతిపై ఆరా తీసేందుకూ హిడ్మా వచ్చి ఉండొచ్చునని, వివరాలు సేకరించేందుకు హిడ్మా రాష్ట్రంలోకి వచ్చారని వాదించేవారూ ఉన్నారు. 







మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతిచెందిన సమయంలో హిడ్మాతో పాటు మరికొందరు మావోయిస్ట్ నేతలపై విష ప్రయోగం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. తనపై సైతం విష ప్రయోగం జరిగే అవకాశం ఉందని అనుమానంతో హిడ్మా ఛత్తీస్‌గఢ్‌ను వీడినట్లు ప్రచారం జరిగింది. హిడ్మా బస్తర్‌ ప్రాంతంలో ఉద్యమానికి వెన్నెముకగా మారాడు. దాంతో  పీఎల్‌జీఏ-1 బెటాలియన్‌ కమాండర్‌గా, ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు అప్పగించారు. భద్రతా బలగాలపై మెరుపు దాడులు చేయడంతో సిద్ధహస్తుడిగా హిడ్మాకు పేరుంది. దాంతో తాజాగా లొంగిపోయిన మావోయిస్టు పేరు హిడ్మా కావడంతో కాస్త ఆసక్తి నెలకొంది. అయితే జూనియర్ హిడ్మా లొంగుబాటు అని తెలియడంతో తోటి దళ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.


Also Read: Hyderabad: లైక్‌లు కొడితే భారీ ఇన్‌కం! ఇది నమ్మి నిలువునా మునిగిన హైదరాబాదీ టెకీ


Also Read: TS HighCourt : తెలంగాణ హైకోర్టుకు కొత్తగా 12 మంది న్యాయమూర్తులు.. సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం !