తెలంగాణ హైకోర్టుకు కొత్తగా 12 మంది న్యాయమూర్తుల్ని నియమించాల్సిందిగా సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వీరిలో ఏడుగురు లాయర్ల నుంచి నేరుగా న్యాయమూర్తుగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మరో ఐదుగుర్ని  న్యాయాధికారుల కోటా నుంచి ఎంపిక చేశారు. లాయర్ల కోటాలో కాసోజు సురేందర్ , చాడా విజయ్ భాస్కర్ రెడ్డి , సురేపల్లి నందా, ముమ్మినేని సుధీర్ కుమార్ , జువ్వాది శ్రీదేవి , మీర్జా సైఫుల్లా బేగ్, నచ్చరాజు శ్రవణ్ కుమార్ వెంకట్ లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. వీరంతా ప్రముఖ లాయర్లుగా ఉన్నత న్యాయస్థానాల్లో పేరు ప్రఖ్యాతలు పొందారు. 


 






ఇక న్యాయాధికారుల కోటా నుంచి జి. అనుపమ చక్రవర్తి , ఎం.జి. ప్రియదర్శిని ,సాంబశివరావు నాయుడు , ఎ. సంతోష్ రెడ్డి , డాక్టర్ డి. నాగార్జున్ లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.  రాష్ట్రపతి ఆమోద ముద్ర తర్వాత వీరు బాధ్యతలు చేపట్టనున్నారు.  ఫిబ్రవరి ఒకటో తేదీన జరిగిన కొలీజియం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని సుప్రీంకోర్టు తెలిపింది.


గత సెప్టెంబర్‌లోనే జ్యుడిషియల్‌ సర్వీసెస్‌ నుంచి ఏడుగుర్ని సుప్రీంకోర్టు కొలీజియం న్యాయమూర్తులుగా సిఫార్సు చేసింది. కేంద్రం ఆమోదించడంతో వారు న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టారు. సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచారు. న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఖాళీల భర్తీ చేపడుతూ వస్తున్నారు. గత సెప్టెంబర్‌లో చేపట్టిన నియామకాలతో జడ్జిల సంఖ్య 18కి పెరిగింది. ఇప్పుడు మరో పన్నెండు మందిని సిఫార్సు చేశారు. దీంతోన్యాయమూర్తుల సంఖ్య 30కి పెరగనుంది. 


గత సెప్టెంబర్‌లో హైకోర్టు చరిత్రలో ఒకేసారి ఏడుగురు.. అందులో నలుగురు మహిళలు ప్రమాణం చేశారు. ఈ సారి కేంద్రం కొలీజియం చేసిన సిఫార్సులు ఆమోదిస్తే మరో రికార్డు సృష్టించినట్లవుతుంది. దేశంలోని వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తుల కొరత వల్ల కేసులు పెడింగ్ పడిపోతున్నాయి. ఈ ఇబ్బందిని గుర్తించిన సీజేఐ ఎన్వీ రమణ న్యాయమూర్తుల నియామకంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. న్యాయవ్యవస్థలో మ్యాన్ పవర్ సమస్య లేకుండా ప్రయత్నిస్తున్నారు.