భూముల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి.. బంగారం కంటే భూమిపైనే ఇప్పుడు అందరి దృష్టిపడుతుంది.. ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ పాగా వేసేందుకు వెనుకంజ వేయడం లేదు.. పచ్చటి పైరుకు నీరు ఇవ్వడంతోపాటు మంచినీటిని అందిస్తున్న చెరువు శిఖాలు మాయమవుతున్నాయి.. అధికారులు సరైన చర్యలు తీసుకోకపోతుండటంతో ఇప్పుడు ఆక్రమణదారులు శిఖం భూములపై కన్నేశారు. ఖమ్మం జిల్లాలో అత్యంత ప్రాచుర్యం కలిగిన వైరా రిజార్వాయర్‌ భూములు ఇప్పుడు ఆక్రమణ దారుల కబ్జాలోకి వెళ్లాయి.


ఖమ్మం నగరానికి సమీపంలోని వైరా పరిసర ప్రాంతాలు ఉండటం.. మరోవైపు వైరా మున్సిపాలిటీగా ఏర్పడటంతో ఇక్కడ భూముల విలువ గణనీయంగా పెరిగాయి. దీంతో ఆక్రమణదారుల కళ్లు వైరా రిజర్వాయర్‌ శిఖం భూములపై పడ్డాయి. ఇక్కడ ఎకరం కోటి రూపాయల వరకు పలుకుతుండటంతో అదే పనిగా శిఖం భూములను మాయం చేసేందుకు ఆక్రమణదారులు ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఏడాది రిజర్వాయర్‌లో నీటి మట్టం పడిపోవటంతో రిజర్వాయర్‌ను ఆనుకొని ఉన్న రైతులు ఎంచక్కా రోజుకు ఎకరం చొప్పున రిజర్వాయర్‌ శిఖంపై కన్నేశారు. నీళ్ళు లేకపోవటంతో అక్రమార్కుల కళ్ళు వైరా రిజర్వాయర్‌పై పడింది.  వైరా పరిసర ప్రాంతాలపై ఇప్పటికే రియల్టర్లు ఖాళీ స్థలాలలపై బేరసారాలు చేస్తుండగా మరోవైపు ఇదే అదునుగా భావించి శిఖం భూమిపై అధికారుల పర్యవేక్షణ లేకపోవటంతో ఆక్రమణదారులు అదేపనిలో ఉన్నారు.


ఆక్రమణలతో రోజురోజుకు తగ్గుతున్న ప్రాజెక్టు భూమి..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరా రిజర్వాయర్‌ అతి పెద్ద ప్రాజెక్టు. సుమారు 10 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రిజర్వాయర్‌ 17,600 ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా 11 మండలాలకు తాగునీటిని అందిస్తుంది. వైరా రిజర్వాయర్‌ శిఖం భూమి వైరా, కొణిజర్ల, తల్లాడ, ఏన్కూరు మండలాల రెవిన్యూ పరిధిలో ఉంది. 70 శాతం పైగా కొణిజర్ల రెవిన్యూలో ఉండటంతో అటు కొణిజర్ల ఇటు వైరా మండలాల సరిహద్దుల్లో వైరా రిజర్వాయర్‌ విస్తరించి ఉంది. ప్రతి ఏడాది రిజర్వాయర్‌లో ఆశించిన స్థాయిలో నీళ్ళు లేకపోవటంతో రిజర్వాయర్‌ అంతా కూడా ఖాళీగా ఉండటంతో రైతుల అభ్యర్థన మేరకు నీటి పారుదల శాఖాధికారులు రిజర్వాయర్‌లో మట్టిని మాత్రమే సుమారు రెండు అంగుళాల లోతు నుండే మట్టిని తవ్వాలని నిబం«ధనలు ఉన్నాయి. కానీ మట్టి పేరుతో అనుమతులు లేకుండానే జేసీబీల సహాయంతో రాత్రి పగలు తేడా లేకుండా యధేచ్ఛగా మట్టితోలకాలు చేస్తున్నారు. అదే క్రమంలో రిజర్వాయర్‌ శిఖంపై కన్నేసిన కబ్జాదారులు ఎంచక్కా రిజర్వాయర్‌ భూమిని కట్టలు పోసి ఆక్రమణకు పాల్పడుతున్నారు. 


కబ్జా కోరల్లో వందల ఎకరాలు..
అనేకఏళ్ళుగా వైరా రిజర్వాయర్‌ శిఖం భూముల ఆక్రమణల పర్వం కొనసాగుతుంది. తాజాగా కొణిజర్ల మండలం సిద్దిక్‌ నగర్, లాలాపురం, గుండ్రాతి మడుగు, తల్లాడ మండలం కోడవటిమెట్టు, రెడ్డిగూడెం సరిహద్దుల్లో ఉన్న వైరా రిజర్వాయర్‌ లోతుట్టు ప్రాంతంలో మట్టి తోలకం పేరుతో ఏకంగా ఎటువంటి  అనుమతులు లే కుండా మట్టిని తరలించడం ఆనవాయితీగా వస్తుంది. గత ఏడాది కొడవటిమెట్ట రెవెన్యూ పరిధిలో ఏకంగా అధికారపార్టీకి సంబంధించిన ఓ వ్యక్తి సుమారు ఎకరం పైగా ఆక్రమించి చేపల చేరువు సాగు చేసేందుకు శిఖం భూమిని ఆక్రమించగా అధికారులు అడ్డుకున్నారు. కానీ అదే ప్రాంతంలో కొంతమంది శిఖం భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. ఇలా రిజర్వాయర్‌ చుట్టూ సుమారు ఐదు కిలోమీటర్ల మేర శిఖం భూమి ఆక్రమణకు గురవుతుంది. అధికారులు తమకేమి పట్టనట్లే వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.


ఏకంగా వైరా పట్టణానికి ఆనుకొని ఉన్న శిఖం భూమిలో ఫంక్షన్‌ హాల్, చేపల చెరువు ఉండటం గమనార్హం. సుమారు 250 ఎకరాల వరకు వైరా శిఖం భూమి ఆక్రమణకు గురైనట్లు సమాచారం. ఏళ్ళ తరబడి ఆక్రమణకు గురవుతున్న అటు రెవిన్యూ, నీటి పారుదల శాఖాధికారులు కనీసం ఆక్రమణ దారులకు కనీసం నోటీసులు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. దీంతో  గుండ్రాతి మడుగు రెవిన్యూలో కబ్జాదారులు సుబాబుల్, బొప్పాయి, మొక్కజోన్న వేసి సాగుచేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎకరం సుమారు రూ.కోటి వరకు ఉండటంతో శిఖం భూమి ఆక్రమణకు గురవుతుంది. ఇప్పటికైనా అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి ఆక్రమణలను అడ్డుకుని శిఖం భూమిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంపై నీటిపారుదల శాఖ డీఈ శ్రీనివాస్‌ను వివరణ కోరగా రిజర్వాయర్‌ శిఖం భూమి ఆక్రమణకు గురవుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, ప్రస్తుతం రిజర్వాయర్‌లో నీటి మట్టం 16 అడుగులు ఉండటంతో వేసవిలో పూర్తిస్థాయి సర్వే నిర్వహించి శిఖం భూమికి పెన్సింగ్‌ వేస్తామని పేర్కొన్నారు.