నాలుగు దశాబ్దాలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులతోపాటు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్న కొత్తగూడెం – కొవ్వూరు రైల్వే లైన్ ఏర్పాటుపై ఈ సారైనా బడ్జెట్‌లో నిధులు మంజూరవుతాయా..? అని జిల్లా ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. గతేడాది కాకపోయినా.. ఈ ఏడాది అయినా నిధులు కేటాయిస్తారని అంచనాలు వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు పెడుతుందనగానే జిల్లాలోని ప్రాజెక్టులకు మహర్ధశ వస్తుందని భావించడం ఎక్కడైనా సహజమే.
పాండురంగాపురం నుంచి సారపాక వరకు 12 కిలో మీటర్ల రైల్వే లైను పొడిగించాలని దాదాపు 20 ఏళ్ళుగా డిమాండ్ ఉంది. రైల్వే లైన్ కోసం సర్వేలు చేసి ప్రతిపాదనలు పంపించినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. 1వ తేదీ నుండి 2022–23 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2022–23 ఏడాదికి సంబంధించి బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నది. ఈ సమావేశాల్లో అయినా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఎంపీలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు రైల్వే, ఎత్తిపోతల పథకాలకు నిధులు కేటాయిస్తుందా అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కొవ్వూరుకు నిధులు కేటాయింపు జరిగేనా..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొన్ని రైల్వే ప్రాజెక్టుల కల సాకారం కావడం లేదు. లక్షలాది మందికి ప్రయోజనకరమైన ఈ ప్రాజెక్టులకు కేంద్రం జెండా ఊపడంలేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాల్సిన రైల్వే ప్రాజెక్టుల హామీలు, కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. కొత్తగూడెం (భద్రాచలం రోడ్ )– కొవ్వూరు రైలు మార్గం విస్తరించాలని 40 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. కొత్తగూడెం నుంచి కొవ్వూరు వరకు రైల్వే మార్గం నిర్మిస్తే సుమారు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే రైళ్లకు సుమారు 135 కిలో మీటర్ల దూరం తగ్గనుంది. అయితే గత రెండేళ్ల క్రితమే ఈ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ నిధుల కేటాయింపు జరగడం లేదు. ఇప్పటికే బొగ్గు రవాణా కోసం సింగరేణి సంస్థ కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు ప్రత్యేక రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది. దీనివల్ల సుమారు 40 కిలో మీటర్ల మేర ఈ మార్గం నిర్మాణం జరుగుతుంది. కొత్తగూడెం కొవ్వూరు రైల్వే లైన్ ఏర్పాటు జరిగితే ప్రస్తుతం సత్తుపల్లి నుంచే లైన్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.
గిరిజన పల్లెలకు అందుబాటులోకి రైలు మార్గం..
కొత్తగూడెం – కొవ్వూరు రైల్వే లైన్ ఏర్పాటు చేయడం వల్ల హైదరాబాద్ నుంచి విశాఖ పట్నం వెళ్లే రైళ్లు ఈ మార్గంలో ప్రయాణిస్తే సుమారు 135 కిలో మీటర్ల మేర దూరం తగ్గడంతోపాటు గోదావరి పరివాహక ప్రాంతంలోని అనేక గిరిజన గ్రామాలకు రైలు మార్గం అందుబాటులోకి వస్తుంది. నాలుగు దశాబ్దాలుగా రైలు మార్గం ఏర్పాటు కోసం అనేక మంది ఉద్యమాలు సైతం చేశారు. అయితే ప్రతి ఏటా బడ్జెట్ కేటాయింపుల సందర్భంగా వీటికి నిధులు మాత్రం మంజూరు కావడం లేదు. దీంతో ప్రతి ఏటా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు నిరాశ చెందాల్సి వస్తుంది. ఈ ఏడాదైనా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని జిల్లా ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.