ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు మొదలైంది. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గాల్లో తమ సత్తాను చాటుకుని సీటు సాదించాలనే వ్యూహంతో కొందరు నేతలు పరితపిస్తున్నారు. ప్రధానంగా కొత్తగూడెం నియోజకవర్గంపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఇటీవల వనమా రాఘవ ఉదంతం నేపథ్యంలో కొత్తగూడెం సీటు సాధిస్తే తమ గెలుపు సునాయసమని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అక్కడే పాగా వేయడంతో నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. ప్రస్తుతం నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న వనమా వెంకటేశ్వరరావు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాదించారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. గతంలో సైతం కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గం కంచుకోటగా ఉండేది. ఎలాగైనా కొత్తగూడెం సీటు సాదించాలనే ఉద్దేశంతో కొంత మంది కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు నియోజకవర్గంపై పోకస్ చేస్తుండటంతో స్థానికంగా ఉన్న నేతల మద్య వర్గ విభేదాలు నెలకొంటున్నాయి.
మాజీ ఎమ్మెల్సీ పోట్ల ప్రయత్నాలు..
టీడీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికైన పోట్ల నాగేశ్వరరావు 2018కి ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ రాలేదు. ఇటీవల కాలంలో తరుచూ కొత్తగూడెం నియోజకవర్గంలో పర్యటించడంతోపాటు ఇక్కడ కార్యకలాపాలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. దీంతోపాటు 2018లో కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడ్డ ఎడవల్లి కృష్ణ ఆ ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్ నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత వనమా వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్ పార్టీలో చేరడంతో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితోపాటు 2018 ఎన్నికల్లో టిక్కెట్ ఆశించిన నాగా సీతారాములు కొత్తగూడెం సీటును ఆశిస్తున్నారు.
భట్టిని ప్రసన్నం చేసుకునేందుకు..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క ఆశీస్సులు ఉంటేనే జిల్లాలో టిక్కెట్ లభిస్తుందనే నేపథ్యంలో భట్టిని ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు తంటాలు పడుతున్నారు. టిక్కెట్ల కేటాయింపుల్లో భట్టి విక్రమార్క చెప్పిన వారికి టిక్కెట్ లభిస్తుందని భావించి మాజీ ఎమ్మెల్సీ పోట్ల సైతం భట్టి వెంటే నడవడం గమనార్హం. కాగా భట్టి మొదటిసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన 2015 ఎన్నికల్లో ఆయనకు ప్రత్యర్థిగా పోట్ల నాగేశ్వరరావు ఉండటం గమనార్హం. పోట్ల నాగేశ్వరరావు టీడీపీలో కీలక నేతగా ఉండటంతో వీరి మధ్య 2018 వరకు రాజకీయ వైరం ఉండేది. ప్రస్తుతం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు భట్టి వెన్నంటి పోట్ల ఉంటున్నారు.
ఆది నుంచి ఉన్న వారిలో అసంతృప్తి..
కాంగ్రెస్ పార్టీలో ఆది నుంచి ఉన్న వారికి ప్రస్తుత పరిణామాలు రుచించడం లేదు. వలస వచ్చిన నాయకులకు ప్రాధాన్యత లభించడంతోపాటు పార్టీలు మారిన వారు పెత్తనాలు చేయడం, పార్టీలో గ్రూపులు పెంచుతుండటంతో ఎన్ని అవాంతరాలు వచ్చినా పార్టీలోనే ఉన్న నాయకులు ఇప్పుడు వెనుకంజ వేస్తున్నారు. ఆది నుంచి పార్టీ జెండాను మోసిన నాయకులకు ప్రాధాన్యత కల్పించడం లేదనే భావన స్థానిక నాయకుల్లో నెలకొంది. ఏది ఏమైనా ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి నుంచే టిక్కెట్లను ఆశిస్తున్న నాయకులు పెద్దల ఆశీస్సుల కోసం పాట్లు పడుతున్నారు.