హైదారాబాద్ గల్లీలో మిలియన్ మార్చ్ కాదు.. దమ్ముంటే దిల్లీలో బిలియన్ మార్చ్ పెట్టాలని బీజేపీకి మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. అప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు తరలి వచ్చి పోరాటం చేస్తారన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన మెడికల్, నర్సింగ్ కాలేజీల నిర్మాణ పనులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావులతో కలిసి మంత్రి హరీశ్ రావు శనివారం పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో బీజీపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఉద్యోగాలు.. ఉద్యోగాలు అని బీజేపీ నేత‌లు దొంగ జ‌పం చేస్తున్నారన్నారు. దొంగే దొంగ అన్నట్లు బీజేపీ తీరు ఉందని ఎద్దేవా చేశారు.  


గల్లీలో కాదు దిల్లీలో చేయి మార్చ్ 


'అస‌లు ఉద్యోగాలు ఇచ్చింది ఎవ‌రు...? ఇవ్వంది ఎవరు..?. నోటిఫికేష‌న్లు ఇచ్చింది ఎవ‌రు.. నోటిఫికేష‌న్లు ఇవ్వనిది ఎవ‌రు? రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువ ఉందా.. దేశంలో నిరుద్యోగం ఎక్కువ ఉందా?. బండి సంజ‌య్ అండ్ బ్యాచ్ ద‌మ్ముంటే స‌మాధానం చెప్పాలి. గాలి మాట‌లు కాదు ఉద్యోగాలు ఇస్తే గ‌ణాంకాలు చెప్పాలి. బీజేపీ హయాంలో దేశంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలి. 
నోటికి వ‌చ్చిన‌ట్లు, ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడి త‌ప్పుడు ప్రచారం చేస్తే ఉద్యోగాలు ఇచ్చిన‌ట్లు అవుతుందా? నోటిఫికేష‌న్లు ఇచ్చిన‌ట్లు అవుతుందా? బీజేపీ పాల‌న‌లో దేశంలో నిరుద్యోగం ఎంత పెరిగిందో.. నిరుద్యోగ యువత ఎంత బాధ ప‌డుతుందో బండి సంజ‌య్ తెలుసుకోవాలి. హైదారాబాద్ గల్లీలో మిలియన్ మార్చ్ చేయడం కాదు బండి సంజయ్...ఢిల్లీలో బిలియన్ మార్చ్ చేయి దమ్ముంటే' అని మంత్రి హారీశ్ రావు వ్యాఖ్యానించారు. 


ఇప్పటి వరకూ 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ 


తెలంగాణ ఏర్పాటు త‌ర్వాత నియామ‌కాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. టీఎస్‌పీఎస్సీ, పోలీసు, సింగ‌రేణి, గురుకులాలు, విద్యుత్‌, మెడిక‌ల్ హెల్త్ త‌దిత‌ర విభాగాల్లో మొత్తం 1,32,899 ఉద్యోగాల‌ు భ‌ర్తీ చేసిందన్నారు. ఒక్క టీఎస్‌పీఎస్సీ ద్వారానే 30,594 పోస్టుల‌ను ప్రభుత్వం భ‌ర్తీ చేసిందన్నారు.  తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 31,972 పోస్టులు, జూనియ‌ర్ పంచాయ‌తీ సెక్రెట‌రీలు 9,355, సింగ‌రేణి కాల‌రీస్ కంపెనీ లిమిటెడ్ 12,500, విద్యుత్ సంస్థల ద్వారా 6,648 పోస్టులు, డీసీసీబీలు 1571, టీఆర్‌టీ ద్వారా 8792, గురుకులాల్లో 11,500 టీచ‌ర్ పోస్టుల‌ు భ‌ర్తీ చేశామన్నారు. మొత్తంగా ఇప్పటి వ‌ర‌కు 1,32,899 ఉద్యోగాల‌ను ప్రభుత్వం భ‌ర్తీ చేసిందని మంత్రి ప్రకటించారు. మ‌రో 50 నుంచి 60వేల పోస్టుల‌ భ‌ర్తీకి క‌స‌రత్తు చేస్తున్నామన్నారు. ఉమ్మడి ఏపీలో అమ‌ల్లో ఉన్నప్పటి నాన్ లోక‌ల్ విధానాన్ని ర‌ద్దు చేసి తెలంగాణ ప్రజ‌ల‌కే వంద శాతం ఉద్యోగాలు ద‌క్కేలా చ‌ర్యలు చేప‌ట్టమన్నారు.  95 శాతం ఉద్యోగాలు స్థానికుల‌కు ల‌భించేలా కొత్త జోన‌ల్ విధానాన్ని తీసుకువచ్చామని పేర్కొన్నారు. అందుకోసం 317 జీవోను విడుదల చేశామని మంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కొత్త ఖాళీలు గుర్తించి నోటిఫికేష‌న్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక‌తో వేస్తుందన్నారు. 


రాష్ట్రపతి ఉత్తర్వులపై విమర్శలా...


తెలంగాణ స్థానిక యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాలు ద‌క్కకుండా బీజేపీ కుట్ర చేస్తుందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు జీవో నెంబర్ 317 వచ్చిందన్నారు. అలాంటి దానిపై బీజేపీ నేతలు వ్యతిరేకంగా మాట్లాడటం అంటే.. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతిపై  విమర్శలు చేయడమేనన్నారు. తెలంగాణలో ఒక్క ఖాళీ లేకుండా ఉండాలని అన్ని జిల్లాల యువత ఉద్యోగ అవకాశాలు లభించాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని మంత్రి హరీశ్ అన్నారు. దీనిని అడ్డుకునేందుకే బీజేపీ చిన్న విషయాన్ని భూతద్దంలో చూపెట్టి  ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య చిచ్చుపెట్టి ఆ మంటలో చలి కాచుకుంటున్నదని విమర్శించారు. బీజేపీ నాయకులకు తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు, నోటిఫికేషన్ల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.  


నిరుద్యోగ భారత్... సీఎంఐఈ నివేదికే రుజువు


బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని, నిరుద్యోగ భారత్ గా మారుస్తుందని మంత్రి హరీశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ విశ్లేషణ సంస్థలు వెల్లడిస్తున్నాయన్నారు. జనవరి 20న సీఎంఐఈ వెల్లడించిన గణాంకాలే ఇందుకు నిదర్శనం అన్నారు. దేశంలో గత డిసెంబర్‌ నాటికి 5.3 కోట్ల మందికి ఉద్యోగం, ఉపాధి లేదని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) తెలిపిందన్నారు. ప్రపంచ ఉపాధి రేటు ప్రమాణాలను భారత్‌ అందుకోవాలంటే అదనంగా 18.75 కోట్ల మందికి ఉద్యోగాలను కల్పించాల్సి ఉంటుందని సీఎంఐఈ స్పష్టం చేసిందని గుర్తుచేశారు. 'దేశంలో, తెలంగాణలో నిరుద్యోగం ఎంత ఉందో కూడా వివరించింది. జాతీయ నిరుద్యోగ శాతం కంటే తెలంగాణలో నిరుద్యోగ శాతం మూడు రెట్లు తక్కువ అని ఇది స్పష్టం చేసింది. దేశంలో నిరుద్యోగం శాత 7.91% ఉంటే తెలంగాణలో 2.2% మాత్రమే ఉందని వెల్లడించింది. నిరుద్యోగ రేటు తక్కువగా ఉన్న 5 రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది' అని మంత్రి హరీశ్ అన్నారు.


Also Read: ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ రీఓపెన్..... తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం