మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 317 జీవోకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. బదిలీ కావడంతో మనస్తాపంతో మరణించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జైత్రం నాయక్ కుటుంబ సభ్యులను శనివారం రేవంత్ రెడ్డి పరామర్శించారు. జైత్రం నాయక్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి...రాష్టంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. జైత్రం నాయక్ మరణానికి కారణం ప్రభుత్వం తీసుకువచ్చిన 317 జీవో అని ఆరోపించారు. జైత్రం నాయక్ అంత్యక్రియలు కుటుంబ సభ్యులు కడచూపునకు కూడా నోచుకోకుండా పోలీసుల పహారాలో నిర్వహించారన్నారు. ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే ప్రభుత్వం తరపున కనీసం పరామర్శ లేదని విమర్శించారు.
రాజకీయ లబ్ది కోసం బీజేపీ ఆరాటం
రాష్ట్రంలో మానవత్వం లేని రాక్షస పాలన కొనసాగుతోందని రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 317 జీవోలోని తప్పులను పార్లమెంట్ లో ప్రస్తావిస్తానని ఆయన స్పష్ట చేశారు. 317 జీవో తెచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు స్థానికత లేకుండా చేసిందని ఆరోపించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 317 జీవోను రద్దు చేసే అవకాశం ఉన్నా రాజకీయ లబ్ది కోసం ఆరాటపడుతుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ జైత్రం నాయక్ కుటుంబానికి అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు.
బాధిత కుటుంబాలకు భరోసా
రాష్ట్రంలో 317 జీవోతో ఉపాధ్యాయులు, నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు, ఆకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. వారిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్న ఆయన... బాధిత కుటుంబాలకు భరోసా కల్పించేదుకు మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న మిర్చి రైతుల కుటుంబాలను, 317 జీవో కారణంగా చనిపోయిన ఉపాధ్యాయుడి కుటుంబాన్ని, ఉద్యోగం రాలేదని మనస్థాపంతో సూసైడ్ చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను రేవంత్ రెడ్డి కలుస్తున్నారు. బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇస్తున్నారు. 317 జీవో కారణంగా మనస్తాపానికి గురై చనిపోయిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జైత్రం నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన ఆయన.. రాష్ట్రంలో మానవత్వం లేని రాక్షస పాలన నడుస్తోందని ఘాటుగా విమర్శించారు. 317 జీవోను రద్దు చేయాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీ రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతున్నాయని ఆరోపించారు. చనిపోయిన ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి కూడా సహాయం అందించాలని రేవంత్ డిమాండ్ చేశారు.
Also Read: టోనీ ఎవరెవరి జాతకాలు బయట పెట్టనున్నాడు? ఆ బడాబాబులకు చిక్కులు తప్పవా ?