రాయలసీమ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు క్షమాపణలు చెప్పారు. కడప జిల్లా విమానాశ్రయం విషయంలో ఆయన ప్రజలందర్నీ ఉద్దేశించి కించ పరిచే వ్యాఖ్యలు చేశారు. " కడపలో ఎయిర్‌పోర్ట్‌.. ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్‌పోర్ట్‌.. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు.."  అని ప్రజలందరూ హత్యలు చేసే వారన్నట్లుగా మాట్లాడటంతో దుమారం రేగింది. సోము వీర్రాజుపై రాయలసీమకు చెందిన నేతలు మండిపడ్డారు. ప్రజల నుంచి కూడా నిరసన వ్యక్తం కావడంతో శుక్రవారం సాయంత్రం ఆయన వివరణ ఇచ్చారు. కానీ ఉదయమే క్షమాపణలు చెబుతూ మరో ప్రకటన ఇచ్చారు. 


ప్రభుత్వ తీరును విమర్శించే క్రమంలో తాను వాడిన పదాలు రాయలసీమ ప్రజల మనసులను గాయపరిచాయన్నారు. అందుకే తాను కడప జిల్లా గురించి తాను మాట్లాడిన మాటలన్నింటినీ వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. తన వ్యాఖ్యలపై రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. "రాయలసీమ రతనాల సీమ" అనే పదం తన హృదయంలో పదిలంగా ఉంటుందని తెలిపారు. రాయలసీమ ఇంకా అభివృద్ధి చెందాలని తాను అనేక  వేదికలపై ప్రస్తావించానన్నారు. రాయలసీమకు నికర జలాలు, పెండింగ్ ప్రాజెక్టులపై తను పోరాటం చేశానని..   అభివృద్ధి ఇంకా వేగవంతం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. 


సోము వీర్రాజు వ్యాఖ్యలు పార్టీలకు అతీతంగా రాయలసీమ వాసుల్లో ఆగ్రహానికి కారణం అయ్యాయి. ఆయన తాను వివేకానందరెడ్డి హత్య కేసును గురించి అలా మాట్లాడానని వివరణ ఇచ్చినప్పటికీ అలాంటి అర్థం ఎవరికీ స్ఫూరించలేదు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ హైకమాండ్‌కు కూడా కొంత మంది ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. అందుకే  శుక్రవారం రాత్రి కూడా వివరణగా ఓ వీడియో విడుదల చేసిన ఆయన ఉదయమే క్షమాపణలు చెప్పారు. పార్టీ హైకమాండ్ ఆదేశం మేరకే బేషరతు క్షమాపణలు చెప్పినట్లుగా ఏపీ బీజేపీలోని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. సోము వీర్రాజు క్షమాపణ చెప్పడంతో ఈ వివాదానికి తెర పడుతుందని భావిస్తున్నారు.


జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. చీప్ లిక్కర్ గురించి ఆయన చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా ట్రోలింగ్‌కు గురయింది. ఆ తర్వాత కూడా దాన్ని ఆయన సమర్థించుకున్నారు. కమ్యూనిస్టుల గురించి కూడా అనుమచితంగా మాట్లాడారు. ఇప్పుడు రాయలసీమ గురించి అదే తరహాలో మాట్లాడారు. చివరికి క్షమాపణ చెప్పాల్సి ఉంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా మాట్లాడాలని లేకపోతే పార్టీకే ఎక్కువ నష్టం జరుగుతుందని ఏపీ బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.