రోజురోజుకీ ఎన్ని సైబర్ నేరాలు జరుగుతున్నా.. మరో కొత్త తరహాలో నేరస్థులు జనాన్ని బురిడీ కొట్టిస్తూనే ఉన్నారు. పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, అవగాహన కల్పించినప్పటికీ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. బహుమతులు, రివార్డులు, జాబ్స్ అంటూ అమాయకులకు ఎర వేస్తూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌ లో ఇలాంటి మరో మోసం వెలుగులోకి వచ్చింది. ఎల్‌ఈడీ బల్బులకు సంబంధించిన యాడ్స్‌పై సామాజిక మాధ్యమాల్లో లైకులు కొడితే డబ్బులొస్తాయని ఓ వ్యక్తిని సైబర్ నేరగాడు నమ్మించాడు. చివరకు అతని నుంచి ఏకంగా రూ.20 లక్షల డబ్బులు కాజేశాడు. హైదరాబాద్‌కి చెందిన ఓ బాధితుడు సైబర్‌ క్రైమ్ పోలీసులకు దీని గురించి ఫిర్యాదు చేశాడు. 


ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఎస్‌ ఆర్‌ నగర్‌లో ఉంటున్న శ్రీను అనే వ్యక్తి సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ ప్రకటన చూశాడు. అతి తక్కువ పెట్టుబడితో నెలనెలా మంచి రాబడి వస్తుండే మార్గం అంటూ ఆ ప్రకటనలో కనిపించింది. దీంతో టెంప్ట్ అయిన బాధితుడు ఆ లింక్‌పై క్లిక్‌ చేసి వివరాలు నింపాడు. ఆ తర్వాత అవతలి వ్యక్తి వాట్సాప్‌ కాల్‌ ద్వారా శ్రీనును సంప్రదించి వివరాలు చెప్పాడు. రూ.10 లక్షలు పెడితే కొన్ని యాడ్స్‌ పంపిస్తామని మొత్తం వివరించాడు. దానికి పెద్దగా పని చేయాల్సిందేం లేదని.. ఆ యాడ్స్‌కు లైకులు కొడితే సరిపోతుందని చెప్పుకొచ్చాడు.


అది నిజమే అనుకొని సైబర్ నేరస్థుడి మాటలను శ్రీను నమ్మాడు. అతను చెప్పిన ఖాతాకు పలు దఫాలుగా రూ.20 లక్షలను పంపాడు. ఆ తర్వాత నమ్మకం కోసం అవతలి నేరగాడు బాధితుడికి యాడ్స్‌ కనిపించేలా చేశాడు. అయితే, వాటికి లైక్‌ కొట్టగా.. రూ.20 లక్షల పెట్టుబడికి రూ.40 లక్షల వరకు లాభం వచ్చినట్లు ప్రత్యేక యాప్‌లో కనిపించింది. కానీ డబ్బులు రావడం లేదని గ్రహించిన శ్రీను మోసపోయానని తెలుసుకొని హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.


Also Read: Medak: అక్కపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన సొంత చెల్లి.. మంటలతోనే గట్టిగా హత్తుకొని.. చివరికి..


Also Read: Siddipet Gun Fire: సిద్ధిపేట కాల్పుల కలకలం... నిందితుల్ని 24 గంటల్లో పట్టుకుంటామని సీపీ శ్వేత ప్రకటన


Also Read:  పబ్బుల్లో డ్రగ్స్ తో పట్టుబడితే మీ వెనకాల ఎవరున్నా ఉపేక్షించం... సౌండ్స్ పరిమితికి లోబడే పెట్టాలి... మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్