దళిత బంధు ప్రపంచవ్యాప్తంగా చరిత్ర సృష్టించే ఒక పథకమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తొలుత హుజూరాబాద్ నియోజకవర్గంలో మొదలుపెడుతున్న ఈ పథకం విజయం సాధిస్తే.. ఇది దేశవ్యాప్తంగా ఆదర్శమైన పథకం అవుతుందని వ్యాఖ్యానించారు. కాబట్టి దళిత బంధు డబ్బు రూ.10 లక్షలను లబ్ధిదారులు ఆలోచించి తగిన విధంగా పెట్టుబడి పెట్టాలని రాబోయే ఏడాదిలో వాటిని రూ.20 లక్షలు చేయాలని నిర్దేశించారు. సోమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి అనే గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. అధికారులు ఎంపిక చేసిన 15 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల దళిత బంధు డబ్బుకు సంబంధించిన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా దళిత బంధు పథకం ముఖ్య ఉద్దేశం వివరించారు.
ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న దళితులకు కూడా పథకం వర్తింపు
‘‘దళిత బంధు పథకం ఆ సామాజిక వర్గానికి చెందిన దళిత ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా వర్తిస్తుంది. కాకపోతే ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులంతా చివరి విడతలో దళిత బంధు తీసుకోవాలి. ముందుగా తొలి విడతల్లో నిరుపేదలు, కష్టజీవులు మాత్రమే దళిత బంధు తీసుకోవాల్సి ఉంటుంది. మధ్య తరగతి వారు, ఎగువ మధ్యతరగతి వారు ఆ తర్వాతి దశల్లో దళిత బంధు వర్తింపజేసుకోవాలి. హుజూరాబాద్ లాగనే ఇంకా 118 నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలి. రాష్ట్రంలో 17 లక్షల పైచిలుకు దళిత కుటుంబాలు ఉన్నాయి. రైతు బంధు తరహాలోనే దళిత బంధు కూడా అన్ని దళిత కుటుంబాలకు వస్తది. గవర్నమెంట్ ఉద్యోగులుగా ఉన్న దళితులకు కూడా దళిత బంధు వర్తిస్తుంది.’’
Also Read: Banjara Hills: ఇంట్లో నుంచి వెళ్లిపో.. లేదంటే రేప్ చేయిస్తా..! కూతురుకి కన్న తండ్రి బెదిరింపులు..
అన్ని ప్రభుత్వ పథకాలన్నీ కొనసాగుతయ్
దళిత బంధు వచ్చిన లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు, నెల నెలా బియ్యం, పింఛన్లు, మీకొచ్చే ప్రభుత్వ పథకాలన్నీ అంతే కొనసాగుతయ్. మీరు డబ్బులు బాగా సంపాదించి గొప్పవాళ్లు అయ్యేదాక ఆ పథకాలన్నీ అంతే కొనసాగుతయ్. ఈ శాలపల్లి వేదికగానే నేను రైతు బంధు ప్రవేశపెట్టాను. అది విజయవంతంగా కొనసాగుతోంది. కొత్త చరిత్ర సృష్టించే పథకానికి శ్రీకారం చుట్టాను. ఈ కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్ర సాధనలో సెంటిమెంట్‌గా ఉంది. తెలంగాణ ప్రజలకు విజయం చేకూరుస్తున్న జిల్లాగా కరీంనగర్ ఉంది. అందుకే దళిత బంధు కూడా ఇక్కడి నుంచే శ్రీకారం చుడుతున్నాం. దళిత బంధు అనేది కచ్చితంగా విజయవంతం అయి తీరుతుంది. అలా ఈ పథకాన్ని రూపొందించాం.’’
రూ.1.7 లక్షల కోట్లు ఒక లెక్కనే కాదు
‘‘రాష్ట్రమంతా ఈ దళిత బంధు అమలుకు రూ.1.5 లక్షల కోట్లో.. రూ.1.70 లక్షల కోట్లో ఖర్చు అవుతది. అది ఒక లెక్కనే కాదు.. ఏడాదికి రూ.30 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లు ఖర్చు పెడితే నాలుగైదేళ్లలో దళితులందరి కల నెరవేరతది. హుజూరాబాద్ కాడ కొంత మంది లడాయి చేసిన్రని తెలిసింది నాకు.. లడాయి చేస్తే పైసలు వస్తయా.. అవసరం అయితే నేనే ఇంకో 20 రోజులకు మళ్లీ హుజూరాబాద్ వస్తా. 20 మండలాలు తిరుగుతా. మీతోపాటు దినమంతా గడిపి.. ఏమన్న సమస్య ఉంటే అక్కడే పరిష్కారం చేసుకుందం.’’
ప్రత్యేక కార్డు ద్వారా పర్యవేక్షణ ఉంటుంది
‘‘ఈ పథకం కింద లబ్ధిదారుల కుటుంబాలకు డబ్బులు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులిపేసుకోదు. మీకు ప్రత్యేకమైన కార్డు ఇస్తాం. మీకున్న పాత బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వేస్తే బ్యాంకుల వారు పాత బాకీలు పట్టుకుంటారు. అంతేకాక, ఏడాదికి నగదు విత్ డ్రాపై భారత ప్రభుత్వ నిబంధన కూడా ఉంది. వాటిని అధిగమించి మీరు పెట్టుబడి పెట్టుకొనే వీలు కలగాలంటే.. మీరంతా కొత్త బ్యాంకు ఖాతాలు తెరవాలి. దానికి తెలంగాణ ‘దళిత బంధు ఖాతా’ అనే పేరు పెడదాం. మేం ఇచ్చే ప్రత్యేక కార్డులో ఉండే ఎలక్ట్రానిక్ చిప్ ద్వారా మీరు ఎక్కడెక్కడ ఏం పెట్టుబడి పెట్టారనేది జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుంటరు.’’
ఆగం ఆగం ఖర్చు పెట్టొద్దు.. మీకు తెల్వకపోతే కలెక్టర్ చెప్తడు: సీఎం
దళిత బంధు డబ్బులతో మీరు పెట్టే పెట్టుబడులపై దీని విజయం ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీపై పెద్ద బాధ్యత ఉంది. ఇక్కడ దళిత బంధు విజయవంతమైతే దేశ వ్యాప్తంగా ఇలాంటి పథకం అమలయ్యేందుకు హుజూరాబాదే పునాదిలా అవుతుంది. కాబట్టి ప్రణాళిక ప్రకారం రూ.10 లక్షలు ఖర్చు పెట్టాలి. వీటితో మీకు వచ్చిన పని.. మీకు నచ్చిన పని.. ఎందులోనైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఏ నిబంధనలు లేవు. ఉదాహరణకు నువ్వు ట్రాక్టర్ డ్రైవర్ అయితే నువ్వే ట్రాక్టర్ పెట్టుకోవచ్చు. షాప్‌లో పని చేస్తుంటే.. ఏకంగా దుకాణమే పెట్టుకోవచ్చు. ఇలా ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. మీకు మంచి ఆలోచన ఉంటే మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు. మీకు ఏం డబ్బుతో ఏం చేయాలో తెలియకపోతే కలెక్టర్ దగ్గరికి వస్తే ఆయన సలహా ఇస్తారు.’’
అన్నింటా రిజర్వేషన్లు
‘‘గోరెటి వెంకన్న రాసిన పాటలో.. ‘మట్టిలోంచి సిరులు తీసే మహిమ నీకు ఉన్నది.. పెట్టుబడే నిన్ను వరిస్తే నీకు ఎదురేమున్నది.’ అని ఉంటది. ఇంకో కవి రాసినట్లు.. ‘చుక్కల ముగ్గు వేసినట్లు చెల్లెలా.. నువ్వు సక్కంగ కూడబెట్టు చెల్లెలా..’ అన్నట్లుగా మీరు చక్కగా డబ్బులు కూడబెట్టాలి. మన ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి.. దీన్ని మీరు విజయవంతం చేయాలి. అన్ని ప్రభుత్వ పనుల్లోనూ గవర్నమెంట్‌లో జరిగే కాంట్రాక్టు పనుల్లోనూ రిజర్వేషన్లు పెట్టిస్తం. ఉదాహరణకి మీరు కరెంటు స్తంభాలు తయారు చేసి ప్రభుత్వానికి అమ్మొచ్చు. దళిత సోదరులందరికీ మేం మద్దతు ఇస్తం.’’
దళిత రక్షణ నిధి మిమ్మల్ని కాపాడుతుంది
‘‘అంతేకాక, దళితుల కోసం రక్షణ నిధి ఏర్పాటు చేస్తున్నం. మీకిచ్చే రూ.10 లక్షల్లో నుంచి మేం ఒక రూ.10 వేలు తీసి పక్కన పెడతం. దానికి ప్రభుత్వం కూడా అంతే కలిపి ఆ డబ్బును రక్షణ నిధి కింద ఉంచుతం. అలా ఒక్క హుజురాబాద్ నుంచే ఆ నిధి దాదాపు రూ.50 కోట్ల అవుతుంది. ఎవరికి ఏదైనా ఆపద వచ్చి మళ్లీ సంక్షోభం వస్తే ఆ నిధి మిమ్మల్ని కాపాడుతుంది.’’
వీళ్లందరి పర్యవేక్షణలోనే దళిత బంధు
‘‘ఈ దళిత బంధు ఆషామాషీ కాదు.. ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ప్రజా ప్రతినిధులతో పాటు దళిత సమాజంలోని పెద్దలు కూడా పర్యవేక్షణ చేస్తుంటరు. దళిత సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ ఛైర్మన్‌లు వంటి 23 నుంచి 25 వేల మంది దళిత ప్రజాప్రతినిధులు తెలంగాణలో ఉన్నారు. వీరు కాక దళిత బంధు కమిటీలు కూడా వేస్తున్నాం. ప్రతి ఊరికి ఆరుగురు, మండలానికి 15 మంది, నియోజకవర్గానికి 24 మంది, జిల్లాకు 24 మంది మొత్తం కలిపి మొత్తం లక్షకు పైగా కమిటీ మెంబర్లు అవుతరు. ఆ 25 వేల దళిత ప్రజా ప్రతినిధులు, ఈ లక్ష పైచిలుకు కమిటీ మెంబర్లు మొత్తం లక్షా 25 వేల మంది కలిసి ఈ పథకాన్ని పర్యవేక్షణ చేస్తారు. వీరి కనుసన్నల్లోనే ఈ దళిత రక్షణ నిధి కూడా ఏర్పాటవుతుంది. అంటే కొన్ని వేల కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా దళితుల రక్షణ కోసం బ్యాంకుల్లో ఉంటయ్. దేశంలో ఇంతటి గొప్ప పథకం తొలిసారి జరుగుతుంది. కాబట్టి మీరు మళ్లీ పేదరికంలోకి వచ్చే సమస్య లేనే లేదు.’’
Also Read: Gold Rate: పసిడి ధర పరుగులు.. పుత్తడి రేటు జిగేల్.. ఇవన్నీ సరే.. ఇంతకీ బంగారం ధర ఎవరు నిర్ణయిస్తారు?
సర్కార్ చెయ్యగూసున్నంక.. సీఎం ఇయ్యగూసున్నంక ఏదైనా ఆగుతదా?
సమగ్ర కుటుంబ సర్వేలో హుజూరాబాద్ నియోజకవర్గంలో 21 వేల దళిత కుటుంబాలు ఉన్నట్లు లెక్క తేలింది. ఈ ఆరేళ్లలో ఇంకేమైనా పెళ్లిళ్లు జరిగుంటే ఇంకో వెయ్యి కుటుంబాలు పెరిగి ఉండొచ్చు. సర్కార్ చెయ్య గూసున్నంక.. సీఎం ఇయ్య గూసున్నంక ఏదైనా ఆగుతదా? రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవ ఉంటదా? హుజూరాబాద్ నియోజవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి రాబోయే రెండు నెలల్లోనే దళిత బంధు డబ్బులు ఇస్తాం. ప్రతి ఒక్కరికి దళిత బంధు డబ్బులు అందుతాయి. ఈ పథకం రాష్ట్రం మొత్తం అమలు చేస్తాం.’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
నేను దళిత బంధు ప్రకటించగానే.. పక్కన బాంబులు పడుతున్నయ్
‘‘ఈ దేశంలో ఒక ప్రధాని గానీ, ముఖ్యమంత్రి గానీ, ఏదైనా నాయకుడు గానీ ఎవరైనా దళితుల గురించి మాట్లాడలేదు. దళితులకు రూ.10 లక్షలు ఇవ్వాలని ఎవరి మదిలోకైనా వచ్చిందా? కనీసం ఆలోచన కూడా రాలే.. నేను అన్నీ పథకాలు చక్కబెట్టుకుంటూ వస్తున్నా. ప్రజల్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా అన్ని తీర్చుకుంటూ వస్తున్నా. ఈ దళిత బంధు పథకం పోయిన ఏడాదే మొదలు కావాల్సింది. కరోనా వల్ల వాయిదా పడ్డది. ఇక నేను దళిత బంధు ప్రకటించగానే నాపైన విపక్షాల వాళ్లు అందరూ అరుస్తున్నారు. అంత ఇవ్వాలే.. ఇంత ఇవ్వాలే రూ.50 లక్షలు ఇవ్వాలి అనుకుంటా మాట్లాడుతున్నారు. మరి ఇన్ని రోజులూ దళితులకి ఒక్క పైసా కూడా ఇవ్వాలని అడగనోళ్లు.. నేను పథకం ప్రకటించగానే ఇప్పుడెందుకు అంటున్నరు. దళిత బంధు పథకంతో ఒక్కొక్కళ్ల పక్కన బాంబులు పడుతున్నయ్’’ అని కేసీఆర్ అన్నారు.
ఈసారి వస్తే నాకు చాయ్ వోత్తవా మరి..: కేసీఆర్
కనుకల గిద్ద గ్రామం నుంచి లబ్దిదారులుగా ఎంపికైన కొత్తూరి రాధ-కొత్తూరి మొగిలి అనే కుటుంబానికి సీఎం కేసీఆర్ తొలి దళిత బంధు చెక్కును అందించారు. ఈ సందర్భంగా కొత్తూరి రాధను.. ఈ డబ్బుతో ఏం చేస్తారని సీఎం కేసీఆర్ అడగ్గా.. డెయిరీ ఫాం పెట్టుకుంటానని మహిళ చెప్పింది. దీంతో ఈసారి నేనొస్తే నాకు చాయ్ వోత్తవా మరి.. అని కేసీఆర్ తమాషాగా మాట్లాడారు. ఆ తర్వాత మొత్తం 15 మందికి కేసీఆర్ దళిత బంధు చెక్కులను అందజేశారు.