స్వాతంత్య్ర దినోత్సవం రోజున మల్కాజ్‌గిరిలో జెండా వందనం సందర్భంగా టీఆర్ఎస్-బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ ఇప్పుడు మరింత వేడి రాజేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మల్కాజ్ గిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నువ్వెంతంటే నువ్వెంతని ఒకరినొకరు ఏకంగా బూతులు తిట్టుకునే స్థాయికి వ్యవహారం వెళ్లింది. ఆదివారం ఏకంగా ఇరువురు నేతలు వేర్వేరుగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ మీడియా ముందే అసభ్య పదజాలంతో బూతులు మాట్లాడేశారు.
వివాదానికి మూలం ఏంటంటే..
స్వాతంత్య్ర దినోత్సవం రోజున మల్కాజ్ గిరి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్-బీజేపీ నాయకుల మధ్య బాహాబాహీ చోటుచేసుకుంది. మల్కాజ్ గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి సమక్షంలోనే కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. దీంతో కార్పొరేటర్ శ్రవణ్ కాలుకు తీవ్రగాయమైంది. వెంటనే ఆస్పత్రిలో ఆయన్ను చేర్పించగా.. అక్కడికి బండి సంజయ్, విజయశాంతి వెళ్లి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మైనంపల్లిపై తీవ్ర విమర్శలు చేశారు.
ఎమ్మెల్యే మైనంపల్లిపై బండి సంజయ్ వ్యాఖ్యలివీ..
కార్పొరేటర్ శ్రవణ్‌పై స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అనుచరులు బీర్ బాటిళ్లతో దాడి చేశారని బండి సంజయ్ ఆరోపించారు. ఎమ్మెల్యే మైనంపల్లి గుండాయిజం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక నుంచి ఎమ్మెల్యే మైనంపల్లి కబ్జా కథలన్నీ బయటకు తీయిస్తానని బండి సంజయ్ హెచ్చరించారు. అతను ఇలాంటి వ్యక్తి అని తెలిసే.. బీజేపీలో చేరతామని వచ్చినా పార్టీలో చేర్చుకోలేదని అన్నారు. గతంలో మైనంపల్లి తన చుట్టూ తిరిగారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. పోలీసుల ముందు దాడి చేస్తుంటే వారు ఎవరికి కొమ్ము కాస్తున్నారని, మహిళలపై దాడి చేసినా పోలీసులు పట్టించుకోలేదని నిలదీశారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు ఎమ్మెల్యేకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేటర్ శ్రావణ్‌పై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read: Banjara Hills: ఇంట్లో నుంచి వెళ్లిపో.. లేదంటే రేప్ చేయిస్తా..! కూతురుకి కన్న తండ్రి బెదిరింపులు..
‘గుండూ..’ అంటూ మైనంపల్లి వ్యక్తిగత విమర్శలు
దీంతో బండి సంజయ్ వ్యాఖ్యలపై మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అదే స్థాయిలో ఘాటు కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్.. నువ్వు బచ్చా.. అంటూ మైనంపల్లి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ‘‘కొడకా.. గుండు..’’ అనే పదాలు వాడుతూ బూతులు మాట్లాడారు. తన సామాజిక సేవ ముందు బండి సంజయ్ బతుకెంత అంటూ ఎద్దేవా చేశారు. ఇంకోసారి మల్కాజ్‌గిరిలో అడుగుపెడితే బండి గుండు పగులుతుందంటూ హెచ్చరించారు. ఆ గుండుకి దమ్ముంటే తన ముందుకొచ్చి మాట్లాడాలని సవాలు విసిరారు. అంతేకాక, బండికికి మాట కూడా సరిగ్గా రాదంటూ మైనంపల్లి వ్యక్తిగత విమర్శలు చేశారు. త్వరలోనే బండి సంజయ్ రాసలీలలు బయటపెడతానంటూ మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: Wanaparthy News: గేదెపై వ్యక్తి అత్యాచారం.. నగ్నంగా అక్కడిక్కడే మృతి, అసలేం జరిగిందంటే..
టీఆర్‌ఎస్ కార్యకర్తలు మల్కాజ్ గిరి కార్పొరేటర్ శ్రవణ్‌పై దాడి చేయలేదని, నిజాలు గుర్తించి మాట్లాడాలని హితవు పలికారు. బండి సంజయ్ స్థాయి కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎంపీకి తక్కువ అంటూ మైనంపల్లి హనుమంతరావు ఎద్దేవా చేశారు. ఆయన గతంలో కౌన్సిలర్‌గా ఓడిపోయారంటూ గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి తన గురించి మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. బండి సంజయ్, మైనంపల్లి మధ్య మొదలైన ఈ వాగ్యుద్ధంతో టీఆర్ఎస్, బీజేపీకి చెందిన ఇతర నాయకులు కూడా గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు.
Watch: జెండా ఎగరేస్తుండగా కొట్టుకున్న టీఆర్ఎస్-బీజేపీ నేతలు.. ఆస్పత్రి పాలైన బీజేపీ నేత