Motkupalli Narasimhulu Join TRS: ఉమ్మడి నల్గొండకు చెందిన కీలక నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్.. మోత్కుపల్లి నర్సింహులుకు టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గత కొన్ని రోజులుగా ఊహించినట్లుగానే మోత్కుపల్లి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. తనకు పార్టీలో చేరుకున్న సీఎం కేసీఆర్‌కు మోత్కుపల్లి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి జగదీశ్ రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆయన దారి చెప్పకనే చెప్పారు..
ఇటీవల దళితబంధు పథకంపై ప్రశంసలు కురిపించిన మోత్కుపల్లి త్వరలోనే గులాబీ కండువా కప్పుకుంటాడని ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ పార్టీలో మోత్కుపల్లి చేరికపై ఇటీవల క్లారిటీ వచ్చింది. అనుకున్న ప్రకారంగానే తెలంగాణ భవన్‌లో సోమవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర విభజనకు ముందు టీడీపీలో కీలకంగా వ్యవహరించిన నేతలలో మోత్కుపల్లి ఒకరు. ఆయన ఇటీవల బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన దారెటు అని ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలో పరోక్షంగా తన వ్యాఖ్యలతో గులాబీ గూటికి చేరనున్నట్లు చెప్పకనే చెప్పారు మోత్కుపల్లి.
Also Read: KCR: కేసీఆర్ మాటలకు అర్థాలే వేరా ? తెలంగాణలో ముందస్తు ఖాయమేనా ?
చేరికకు ముందే కేసీఆర్‌పై ప్రశంసల వర్షం..
టీఆర్ఎస్‌లో చేరకముందు నేటి ఉదయం సీఎం కేసీఆర్‌పై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర ప్రజలను, పేదలను ఆదుకునే నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ లో చేరిక సందర్భంగా నగరంలోని ట్యాంక్‌బండ్ పై ఉన్న రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి, బషీర్‌బాగ్‌లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూల మాలలు వేశారు. గన్‌పార్కులో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్.. ప్రతి వర్గానికి అండగా ఉంటున్నారని ప్రశంసించారు. రైతులను రాజుకు చేసేందుకు రైతు బంధు లాంటి పథకాలు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్ సొంతమని మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు.
Also Read: ఈటలను చిత్తు చేయండి.. హరీశ్ రావు వ్యాఖ్యలు, సొంత ఇలాకాలో మంత్రికి షాక్
దళితవాదంతో టీఆర్ఎస్ గూటికి..?
హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ దళితబంధు అస్త్రాన్ని ప్రయోగించారు. దళిత కుటుంబాలకు రూ.10 లక్షల మేర ఆర్థిక ప్రయోజనం అందించి వారి జీవితాలను మార్చాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో మోత్కుపల్లి నర్సిహులును టీఆర్ఎస్‌లో చేర్చుకుని ఆ పథకానికి సంబందించిన కీలక బాధ్యతలు మోత్కుపల్లికి అప్పగించనున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నిక అనంతరం తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. శాసనసభ్యుల కోటా నుంచి ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం జూన్ 3న ముగిసింది. తమ పార్టీలో చేరనున్న మోత్కుపల్లికి ఎమ్మెల్సీగా బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: బీజేపీకి భారీ షాక్, పార్టీకి మాజీ మంత్రి రాజీనామా