కారులో ఎక్కించే టీఆర్ఎస్‌కి ఓటేద్దామా? కారుతో తొక్కించే బీజేపీకి ఓటేద్దామా? అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. ధరలు పెంచే పార్టీ బీజేపీకి ఓటు వేద్దామా? పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేద్దామా? అని అడిగారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ మీద కొట్లాడే శక్తి లేక కాంగ్రెస్ బీజేపీతో కలిసిపోయిందని విమర్శించారు. ఆ రెండు పార్టీలు అంతర్గత మద్దతుతో హుజూరాబాద్‌లో ఏకమై పోటీ చేస్తున్నాయని ఆరోపించారు. సోమవారం హుజూరాబాద్ మండలం కన్నుక గిద్దే, జోపాకలో మంత్రి హరీశ్‌ రావ్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరపున ప్రచారం నిర్వహించారు. 


ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ.. ‘‘రెండున్నర సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరో రెండున్నరేళ్లు ఉంటుంది. మేం ఈ నియోజకవర్గంలో ఏం చేస్తామో చెప్తున్నాం. బీజేపీ కూడా గెలిస్తే ఏం చేస్తారో చెప్పాలి. ఎవరో ఏడ్చారని, తిట్టారని, సెంటిమెంట్ మాటలకు పడిపోవద్దు. ఈటల రాజేందర్ రాజీనామా ఎందుకు చేశారు. హుజూరాబాద్‌కు మెడికల్ కాలేజి కావాలని, జిల్లా కావాలని కోరుతూ రాజీనామా చేసి ఉంటే ఓకే. కానీ, ఆయన సొంత లాభం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస్ గెలిస్తే హూజూరాబాద్ ప్రజలకు బాగా లాభం ఉంటుంది. 


Also Read: KCR: కేసీఆర్ మాటలకు అర్థాలే వేరా ? తెలంగాణలో ముందస్తు ఖాయమేనా ?


అదే ఈటల గెలిస్తే బీజేపీకి మాత్రమే లాభం. దేశంలో 18 బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. ప్రధాని సొంత రాష్ట్రం అయిన గుజరాత్‌లో ఎక్కడైనా రూ.2 వేలు పెన్షన్ ఇస్తున్నారా?. కేవలం రూ.600 పెన్షన్ మాత్రమే అక్కడ అందుతోంది. పేదింటి ఆడపిల్లకు రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తున్న సీఎం కూడా కేసీఆరే.. బీజేపీ రాష్ట్రాల్లో ఎక్కడా ఆడపిల్ల పెళ్లికి వస్తే పైసా కూడా ఇవ్వట్లేదు. కళ్యాణ లక్ష్మి కావాలా వద్దా..? కావాలనుకునే వాళ్లు రాజేందర్‌ను చిత్తు చిత్తుగా ఓడించండి.’’ అని హరీశ్ రావు మాట్లాడారు.


Also Read: నా బుల్లెట్టు బండెక్కి వెళ్దాం.. వస్తావా? మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్


అందరికీ ఇళ్లు కట్టించి ఇస్తా.. 
‘‘మంత్రిగా ఉన్నప్పుడు ఈటల ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. వచ్చే ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్‌ను గెలిపిస్తే మీకున్న స్థలంలోనే మీకు ఇళ్లు కట్టించి ఇస్తా. సీఎంగా కేసీఆరే ఉంటారు. నేను ఆర్థిక మంత్రిగా ఉంటా. మీకు మొత్తం చేసేది మేమే. పని చేసేది టీఆర్ఎస్ ప్రభుత్వమే. మంత్రిగా ఏ పని చేయని ఈటల రాజేందర్, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చేస్తారా?’’ అని ప్రశ్నించారు.


Also Read: Akkiraju Haragopal: అక్కిరాజు హరగోపాల్.. ‘అర్కే’గా ఎలా..? దీని వెనక అసలు కథేంటంటే..


హరీశ్ రావు దత్తత గ్రామంలో దిష్ఠిబొమ్మ దహనం
మరోవైపు, హరీశ్ రావు దత్తత గ్రామంలో ఆయనకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన చేశారు. రోడ్డుపై బైఠాయించి, ఆయన దిష్టిబొమ్మ దహనం చేశారు. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కోల్గురు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కోల్గురు గ్రామాన్ని ఆర్థిక మంత్రి హరీశ్ రావు దత్తత తీసుకున్నారు. సకల హంగులతో గ్రామాన్ని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అయితే, రెండున్నరేళ్లు దాటినా ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపిస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు దిష్టి బొమ్మను దహనం చేశారు.


Also Read: ఈటల ఒంటరి పోరాటం ! రాష్ట్ర బీజేపీ నేతలూ పట్టించుకోవడం లేదేంటి ?


Also Read: కేటీఆర్‌ను ఇరుకున పెట్టేలా రేవంత్ రెడ్డి ట్వీట్.. ఈసారి మంత్రి ఎలా స్పందిస్తారో..!