హుజురాబాద్‌లో టీఆర్ఎస్ చతురంగ బలాలను రంగంలోకి దింపి పోరాడుతూంటే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ నాయకత్వం పట్టించుకోవడం లేదు. ప్రచారం కోసం హైకమాండ్ ముఖ్య నేతలు ఎవరైనా వస్తారో లేదో క్లారిటీ లేదు. తెలంగాణ పార్టీ తరపున ఇంచార్జులుగా ప్రకటించిన వారు పండుగ పేరుతో నియోజకవర్గాన్ని వీడారు. మళ్లీ ఎప్పటికి వస్తారో స్పష్టత లేదు. దీంతో ఈటలను బీజేపీ ఒంటరిగా వదిలేసిందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
Also Read : కేటీఆర్‌ను ఇరుకున పెట్టేలా రేవంత్ రెడ్డి ట్వీట్.. ఈసారి మంత్రి ఎలా స్పందిస్తారో..!
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత ఈటల రాజేందర్ నేరుగా హుజురాబాద్‌కే వెళ్లి ఉనికి లేని బీజేపీకి తన అనుచరులతో ఓ అస్థిత్వం తెచ్చే ప్రయత్నం చేశారు. అప్పట్నుంచి ఆయన కిందా మీదా పడి ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు. పాదయాత్ర చేస్తూ.. మధ్యలో మోకాలి ఆపరేషన్ కూడా చేయించుకోవాల్సి వచ్చింది. అయితే బీజేపీ అగ్రనేతలు మాత్రం ఆయనను ఎప్పుడూ పట్టించుకోలేదు. ఉపఎన్నిక వస్తుందని తెలిసినా బండి సంజయ్ పాదయాత్ర చేశారు. షెడ్యూల్ వచ్చిన తర్వాత పాదయాత్రకు విరామం ఇచ్చారు. నామినేషన్ కార్యక్రమంలో కిషన్ రెడ్డితో పాటు బండిసంజయ్ కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత బండి సంజయ్ హైదరాబాద్‌కే పరిమితమయ్యారు.
Also Read: KCR: కేసీఆర్ మాటలకు అర్థాలే వేరా ? తెలంగాణలో ముందస్తు ఖాయమేనా ?
దుర్గా దీక్ష తీసుకున్న బండి సంజయ్ నవరాత్రులు ప్రత్యేక పూజల్లో ఉండిపోయారు. ఇప్పుడు ఆయన ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. హుజురాబాద్‌లో పరిస్థితుల్ని కేంద్ర పెద్దలకు వివరిస్తానని ఆయన పార్టీ నేతలకు చెబుతున్నారు. మళ్లీ ఇరవయ్యో తారీఖు తర్వాత వచ్చి హుజురాబాద్‌లో ప్రచారం చేస్తారని అంటున్నారు. అయితే ఇప్పటికే ప్రచారం ఊపందుకుంది. ప్రచార గడువు పట్టుమని పది రోజులు కూడా లేదు. ఈ సమయంలో ప్రచారం జోరు పెంచాల్సింది పోయి బండి సంజయ్ కూడా ఢిల్లీ వెళ్లడం ఈటల వర్గీయుల్ని నిరాశ పరుస్తోంది.
Also Read: Akkiraju Haragopal: అక్కిరాజు హరగోపాల్.. ‘అర్కే’గా ఎలా..? దీని వెనక అసలు కథేంటంటే..
బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొనేందుకు ముఖ్యమైన నేతలందరూ తరలి వచ్చారు. ఢిల్లీ నేతలు కూడా వచ్చారు. కానీ ఈటల విషయంలో మాత్రం ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో ఈటల ఒంటరి పోరాటం చేస్తున్నారన్న భావన పెరిగిపోతోంది. చివరి వారం రోజులు అయినా బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలంతా కలిసి తమ నేత గెలుపు కోసం ప్రయత్నిస్తారని ఈటల వర్గీయులు ఆశతో ఉన్నారు.
Also Read : ఆపరేషన్ రివర్స్ ఆకర్ష్ ! పార్టీ మారిన ఎమ్మెల్యేలపై రేవంత్ గురి !