హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి అయిన ఈటల రాజేందర్ అధికార పార్టీపై మాటల దాడి చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. రోజూ ఓ కొత్త అంశం ఎంచుకొని ఇరు పక్షాల వారు ప్రత్యర్థులపై విమర్శల దాడిని పెంచుతున్నారు. ఈ సందర్భంగా తాజాగా కూడా ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధికార పార్టీకి ఏకు మేకు కావడంతోనే తనను ఖతం చేయాలని కుట్ర పన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని కుట్రలు చేసినా తాను భయపడేది లేదనే తేల్చి చెప్పారు.
Also Read: Bank Charges: బ్యాంకు ఛార్జీలతో విసిగిపోయారా! ఇలా చేస్తే తక్కువ రుసుములే పడతాయి
‘ఏకు మేకయ్యానని నన్ను ఖతం చేయాలని కుట్ర పన్నుతున్నరు. ఎన్ని కుట్రలు పన్నినా భయపడేదిలేదు.’’ అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో పథకం రచిస్తే హరీశ్‌రావు హుజూరాబాద్‌లో అమలు చేస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్ మండలం వెంకట్రావ్‌పల్లి, పోతిరెడ్డిపేట, బోర్నపల్లి, ఇప్పల్ నర్సింగాపూర్, కొత్తపల్లి, దమ్మక్కపేటల మీదుగా ఆదివారం ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం సాగింది. కేసీఆర్ తనను ఓడించాలన్న ఆత్రుతలో కొంచమైనా రైతుల కష్టాలపై దృష్టి పెడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు.
Also Read: నా బుల్లెట్టు బండెక్కి వెళ్దాం.. వస్తావా? మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్
మాటల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అంటూ చెప్పుకుంటూ చేతల్లో మాత్రం రైతు వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో వరి ధాన్యం కొనబోమని సీఎం కేసీఆర్ అంటే తానే కొనాలని చెప్పినట్లు గుర్తుచేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్తున్న కేసీఆర్ మహిళా సంఘాలకు వడ్డీ రాయితీని ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు.
తాను గత 18 ఏళ్లుగా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం పని చేసినట్లుగా గుర్తు చేశారు. నియోజకవర్గంలో ఎలాంటి పనులు చేయలేదని ఇతర ప్రాంతాల వారు వచ్చి విమర్శించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పదవులు, ప్రలోభాల కోసం విలువలు అమ్ముకోవడం తనకు ఇష్టం లేదని, ఆ పని తన వల్ల కాదని ఈటల తేల్చి చెప్పారు. అందుకే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో నిలబడుతున్నానని ఈటల తేల్చి చెప్పారు.
Also Read: KCR: కేసీఆర్ మాటలకు అర్థాలే వేరా ? తెలంగాణలో ముందస్తు ఖాయమేనా ?
Also Read: Akkiraju Haragopal: అక్కిరాజు హరగోపాల్.. ‘అర్కే’గా ఎలా..? దీని వెనక అసలు కథేంటంటే..