తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గం ఉపఎన్నికల నేపథ్యంలో ఏ పార్టీలో ఏం జరగబోతుందో ఆ పార్టీ నేతలు సైతం చెప్పలేకపోతున్నారు. ఇతర పార్టీల విషయం ఎలా ఉన్నా భారతీయ జనతా పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మరో కీలక నేత బీజేపీని వీడటం చర్చనీయాంశంగా మారింది.
సీనియర్ నేత, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి బీజేపీకి భారీ షాకిచ్చారు. బీజేపీకి రాజీనామా చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల మరో సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు సైతం బీజేపీ పార్టీని వీడటం తెలిసిందే. ఈటలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ మోత్కుపల్లి బీజేపీని వీడారు. తాజాగా ఇనుగాల పెద్దిరెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌కు పంపించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్న సమయంలోనూ పెద్దిరెడ్డి బాహాటంగానే వ్యతిరేకించారు. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో తనకు అవకాశం వస్తుందని పెద్దిరెడ్డి భావించారు. బట్ ఈటల బీజేపీలో చేరికతో సీన్ మారిపోయింది.
హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ తనకు సీటు ఇస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు పెద్దిరెడ్డి. కానీ ఆయన్ని బీజేపీ లైట్‌గా తీసుకుంది. ఈటల చేరికపై పెద్దిరెడ్డి అభిప్రాయాన్ని కూడా బీజేపీ తీసుకోలేదని టాక్. ఈటల చేరినప్పటి నుంచి హుజూరాబాద్‌లో స్పీడ్ పెంచారు. ఇప్పుడు ప్రజాదీవెన యాత్ర చేస్తున్నారు. దీనికి పార్టీ అధ్యకుడు బండి సంజయ్ కూడా మద్దతు ఇచ్చారు. దీంతో పెద్దిరెడ్జికి సీన్ అర్థమైపోయింది. అందుకే కొన్నిరోజులుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలమైన నేతగా ఓ వెలుగు వెలిగిన తనకు ఉపఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని బీజేపీ ఇవ్వకపోవడంతో పార్టీకి గుడ్‌బై చెప్పారని ప్రచారం జరుగుతోంది. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి మరో సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు బాటలోనే నడిచారు.
గత కొంతకాలం నుంచి బీజేపీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు పెద్దిరెడ్డి దూరంగా ఉంటున్నారు. పార్టీలో తగినంత గౌరవం దక్కడం లేదని బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వంలో పెద్దిరెడ్డి మంత్రిగా పని చేశారు. బీజేపీలో ఈటల రాజేందర్ చేరిక, తనకు హుజూరాబాద్ నుంచి అవకాశం ఇవ్వకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కు లేఖ పంపారు.
‘బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. గడిచిన రెండేళ్ల నుంచి బీజేపీలో సామాన్య కార్యకర్తగా పనిచేయడానికి అవకాశం కల్పించిన జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి నా ధన్యవాదాలు. మారిన రాజకీయ పరిస్థితుల దృష్టా పార్టీలో కొనసాగడానికి మనసు అంగీకరించడం లేదు. కావున నేను భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నన్ను అభిమానంతో చూసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి రాజీనామా లేఖలో పేర్కొన్నారు.