హుజూరాబాద్ లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన ఈ సీటు కోసం ఉపఎన్నిక జరగనుంది. అయితే రాజీనామాకు ముందు నుంచే.. నేతలు దృష్టి పెట్టారు. అభ్యర్థి ఎవరన్నదానిపై క్లారిటీ లేకున్నా.. పార్టీలు పట్టుసాధించాలని తహతహలాడుతున్నాయి.
హుజూరాబాద్ ఉపఎన్నికపైనే రాజకీయ పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. ఈ ఉప ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని కొన్ని పార్టీలు, తమ పట్టు పెంచుకోవాలని మరికొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. హుజూరాబాద్‌లో కచ్చితంగా గెలవాలని బీజేపీ, టీఆర్ఎస్ ప్లాన్ వేస్తుంటే..మెరుగైన ఫలితాలు ఎలా సాధించాలనే దానిపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది.
ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే.. కేసీఆర్ హుజూరాబాద్ ఉపఎన్నికపై దృష్టి పెట్టారు. హుజూరాబాద్ నుంచే దళిత బంధు పథకం ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఒక్కో దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. ఈ పథకం అమలు చేస్తామని చెప్పడంతో రాజకీయం మరింత హీటెక్కినట్టైంది. ఆల్ రెడీ కేసీఆర్ ఆ నియోజకవర్గానికి చెందిన 400 మందికిపైగా దళితులతో పథకం వర్తింపు అంశంపై సదస్సు ఏర్పాటు చేశారు. కేవలం దళిత బంధు మాత్రమే.. కాదు.. త్వరలోనే గొర్రెల పంపిణీ కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు నియోజకవర్గం మెుత్తం చుట్టేస్తున్నారు. అభ్యర్థి ఎవరన్న దానిపై క్లారిటీ లేకున్నా.. కార్యకర్తలు ఇంటింటీకి వెళ్లి.. కారుకే ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు.
లక్షమందితో దళిత దండోరా నిర్వహించాలని.. టీపీసీసీ నిర్ణయించింది. దళిత బంధు పేరుతో ప్రభుత్వం మోసం చేస్తుందని.. ఆరోపించింది. ఇందులో భాగంగా ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 17 వరకు హుజూరాబాద్ నియోజకవర్గంలో ‘దళిత దండోరా’ చేపట్టాలని నిర్ణయించింది. దళిత, గిరిజన దండోరాల తర్వాత బీసీ దండోరా కార్యక్రమాలు చేపడతామని ప్రకటించింది.
కేసీఆర్ దూకుడుకు కాస్తయినా అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. కోకాపేట భూముల వేలంపై నిరంతరం పోరాటం చేయాలని టీపీసీసీ భావిస్తోంది. ఇందుకు భావసారూప్యం కలిగిన వారితో కలిసి పోరాడాలని అనుకుంటోంది. అయితే కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి.. టీఆర్ఎస్ లోకి జంప్ కావడంతో ఇప్పుడు అక్కడ హస్తం నుంచి ఎవరిని పోటీ చేయిస్తారో తెలియాల్సి ఉంది. అసలు హుజూరాబాద్ ఎన్నికల్లో దళిత బంధు, దళిత దండోరా ఏ మేరకు ఎన్నికల లబ్ధిని అడ్డుకుంటాయో చూడాలి.
మరోవైపు ప్రజా దీవెన యాత్ర పేరిట మాజీ మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. బీజేపీ బలం, సొంత చరిష్మాతో ఎలాగైనా గెలిచి తీరాలని.. ఈటల భావిస్తున్నారు. కచ్చితంగా గెలుస్తాననే నమ్మకంతో ఉన్నారు. కేసీఆర్ పై విమర్శలు చేస్తూ.. ప్రజల వద్దకు ఈటల వెళ్తున్నారు.
Also Read: CM KCR: దళిత బంధు పథకం కాదు.. ఉద్యమం.. గుర్తుంచుకోవాలే: కేసీఆర్