కర్ణాటక ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన యడ్యూరప్ప తెలుగు రాష్ట్ట్రాల్లో ఒక దానికి గవర్నర్‌గా నియమితులయ్యే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల్లో విస్తృతమైన ప్రచారం జరుగుతోది. అందుకే యడ్యూరప్ప కూడా గవర్నర్ పదవి అంశంపై స్పందించారు. తనకు గవర్నర్ పదవిపై ఎలాంటి ఆశలు లేవని చెప్పుకొచ్చారు. అయితే బీజేపీ హైకమాండ్ మాత్రం..ఆయనకు సముచితమైన గౌరవం ఇవ్వాలని భావిస్తోంది. ఆయన రాజకీయంగా శక్తివంతమైన లింగాయత్ సామాజికవర్గానికి చెందిన వారు. ఇప్పుడు కొత్తగా మళ్లీ ఆయన వర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదు. ఈ సారి కర్ణాటక బ్రాహ్మణ సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇస్తారని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో యడ్యూరప్పకు గౌరవం ఇవ్వాల్సి ఉందని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
సీఎం బాధ్యతలు హైకమాండ్ అప్పగించిన వారసుడికి అప్పగించిన తర్వాత ఇప్పుడు.. కర్ణాటక రాజకీయాల్లోనూ చురుగ్గా ఉండే అవకాశం లేదు. బీజేపీ లెక్కల ప్రకారం... 75 ఏళ్లు నిండిన వారికి.. రిటైర్మెంట్ లేకపోతే గవర్నర్ లాంటి పదవులు ఇస్తారు. తాను ఇంకా పది.. పదిహేనేళ్ల పాటు కర్ణాటక రాజకీయాలల్లో ఉంటానని పార్టీని బలోపేతం చేస్తానని చెబుతున్నారు. కానీ బీజేపీ హైకమాండ్ ప్రత్యక్షంగా యడ్యూరప్పను రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం ఉండకపోవచ్చంటున్నారు. ఇప్పటి వరకూ కేంద్ర మంత్రి పదవుల్లో తొలగించిన వారికి.. సీఎంలుగా తొలగించిన వారికి ఎక్కువ మందికి బీజేపీ హైకమాండ్ ప్రత్యామ్నాయ పదవులు ఇచ్చింది. దత్తాత్రేయను కేంద్రమంత్రిగా తొలగించిన తర్వాత గవర్నర్ పదవి ఇచ్చారు. ఈ కోణంలో.. యడ్యూరప్పకు కూడా ఏదో పదవి ఇవ్వడానికే ఎక్కువ అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో గవర్నర్ పోస్టులు ఖాళీ లేవు. గవర్నర్లుగా వారి పదవీ కాలం ముగిసిపోలేదు. తెలంగాణ గవర్నర్ తమిళిసై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమెను పుదుచ్చేరికే పరిమితం చేస్తారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. యడ్యూరప్పను పుదుర్చేరి లాంటి అతి చిన్న రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమిస్తే.. అది ఆయన స్థాయికి ఇచ్చిన గౌరవంగా అనిపించదు. అదే సమయంలో.. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వయసు 86 ఏళ్లు దాటిపోయింది. ఇటీవలి కాలంలో ఆయనను కూడా మారుస్తారని రాజకీయవర్గాల్లో చర్చలు జరిగాయి. దీంతో నిప్పు లేనిదే పొగరాదన్నట్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక దానికి యడ్యూరప్ప గవర్నర్ అవడానికే ఎక్కువ అవకాశం ఉందని బీజేపీలో ఎక్కువ మంది నమ్ముతున్నారు. తమిళనాడు గవర్నర్ ను ఇటీవలే నియమించారు కాబట్టి మార్చే అవకాశం లేదు. దక్షిణాది నేతల్ని ఈశాన్యరాష్ట్రాలకు గవర్నర్లుగా వేస్తారు కానీ..ఉత్తరాది రాష్ట్రాలకు ఎప్పుడూ వేయలేదు. దీంతో యడ్యూరప్పను..దక్షిణాది రాష్ట్రాల్లోనే గవర్నర్‌గా నియమించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.