పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హాజరయ్యేందుకు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ ట్రాక్టర్‌పై వచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో గత కొన్ని నెలలుగా రైతన్నలు ఉద్యమం సాగిస్తున్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా రాహుల్ నేడు స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ పార్లమెంట్‌కు చేరుకున్నారు. కొత్త సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ నెల 19న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే వీటికి ఒకరోజు ముందే పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్ అంటూ సంచలన కథనం ప్రకంపనలు సృష్టించింది. దీంతో ఈ వ్యవహారం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేసింది. గతవారం ఐదు రోజుల పాటు సమావేశాలు సాగగా.. ప్రతిపక్షాల ఆందోళనలతో ఎలాంటి చర్చలకు వీలుపడలేదు. పెగాసస్‌తో పాటు సాగు చట్టాలు, కరోనా అంశాలపై విపక్షాలు సభల్లో నిరసన చేపట్టాయి.
ఆగని ఉద్యమం..
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత కొద్ది నెలలుగా దేశ రాజధాని సరిహద్దుల్లో ప్రశాంతంగా ఆందోళన సాగిస్తున్న రైతన్నలు ప్రస్తుతం దిల్లీ నడిబొడ్డున ఉన్న జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నారు. కిసాన్ సంసద్ పేరుతో నిర్వహించే ఈ నిరసన కార్యక్రమానికి సరిహద్దుల నుంచి అన్నదాతలు బస్సుల్లో ర్యాలీగా వెళ్తున్నారు.
జంతర్ మంతర్ వద్ద కిసాన్ సంసద్ నిర్వహించుకునేందుకు దిల్లీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది.
అయితే, ఈ జంతర్‌మంత్ పార్లమెంట్‌కు కొద్ది మీటర్ల దూరంలోనే ఉంటుంది. ప్రస్తుతం పార్లమెంట్‌లో వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జంతర్‌మంతర్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రతా సిబ్బంది భారీగా మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. అటు సరిహద్దుల్లోనూ భద్రతను పెంచారు. టిక్రి సరిహద్దుల్లో ఆందోళనకు అనుమతినివ్వకపోవడంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.
వర్షాకాల సమావేశాలయ్యేంత వరకు
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తామని ఇప్పటికే రైతులు స్పష్టం చేశారు. ఇప్పుడు విపక్షాలు కూడా వారి ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నాయి.