తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లాలో భూ కంపం వచ్చింది. జిల్లాలోని అచ్చంపేట, లింగాల పరిసర గ్రామాలు, అమ్రాబాద్, ఉప్పునూత మండలాల్లో సోమవారం ఉదయం 5 గంటలకు రెండు సెకన్ల పాటు భూమి కంపించింది.
దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సీఎస్) వెల్లడించింది.
హైదరాబాద్‌కు దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయని పేర్కొన్నది. భూ ప్రకంపనలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాధమిక నిర్థారణ. తక్కువ తీవ్రతతో రావడం వల్ల ఆస్తి నష్టం కూడా పెద్దగా జరిగి ఉండకపోవచ్చంటున్నారు అధికారులు.
రెండు రోజుల క్రితం చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో అర్థరాత్రి భూకంపం రావడంతో జనం భయంతో ఇళ్లనుంచి పరుగులు తీశారు. స్థానిక ఈడిగపల్లె, చిలకవారిపల్లి, షికారిపాళ్యం, కోటగడ్డలో 6 సెకన్ల పాటు భూమి కంపించింది. పెద్ద పెద్ద శబ్దాలు రావడం, మంచాలు, సామాన్లు కదలడంతో ఏం జరుగుతోందో అర్థంకాక కొద్దిసేపు భయాందోళనకు గురయ్యారు.
గతం వారంలో రాజస్థాన్ రాష్ట్రంలో పలు చోట్ల భారీ భూకంపం సంభవించింది. బికానెర్‌తో పాటు. రెండు రోజుల వ్యవధిలో బికానెర్ ప్రాంతంలో భూప్రకంపనలు రావడంతో వణికిపోతున్నారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. పెద్ద శబ్దాలతో భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇలా వరుసగా రెండుసార్లు ప్రకంపనలు రావడంతో వణికిపోతున్నారు.
ఢిల్లీ, పంజాబ్ లోనూ ఈ మధ్య భూప్రకంపనలు వచ్చాయి. అయితే ఇతర దేశాల్లో వచ్చే భూకంపాలతో పెద్ద ఎత్తున నష్టం ఉండగా, మన దేశంలో సంభవించే భూకంపాల వల్ల ప్రాణ, ఆస్తినష్టం ఉండటం లేదు. అయినా వరుస భూకంపాలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే నమోదైన భూకంపాల వల్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.
ఎంత ధైర్యం చెప్పుకున్నప్పటికీ….భూకంపం వచ్చిందంటే చాలు వణికాల్సిందే. ప్రకృతి కన్ను తెరిచి విలయతాండవం చేస్తుంది. భూకంప ధాటికి క్షణాల్లోనే అల్లకల్లోలం అయిపోతుంది. భూకంపాలు రావడానికి శాస్త్రపరమైన కారణాలే కాక పర్యావరణానికి జరుగుతున్న అపార నష్టం కూడా చాలా కారణాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పెద్ద రిజర్వాయర్లలో నిల్వ ఉంచిన నీటి వల్ల, అపారమైన భూగర్భ జలాన్ని ఎక్కువ దుర్వినియోగం చేయడం ద్వారా, చెట్లను నరకడం వంటివి జరుగుతుండటంతో భూకంపాలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు.