కరోనాన కారణంగా ఈ ఏడాది IPL సగంలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా మిగతా సీజన్ గురించి బీసీసీఐ అధికారికంగా ఫ్రాంఛైజీలకు మెయిల్ పంపినట్లు తెలుస్తోంది. 




ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లు యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ప్రారంభంకానుండగా.. ఫస్ట్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొట్టబోతోంది. ఈ మేరకు ఫ్రాంఛైజీలకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా మెయిల్ పంపినట్లు సమాచారం. 

ఐపీఎల్ జట్లలో వరుసగా కరోనా కేసులు నమోదవడంతో ఐపీఎల్ 2021 సీజన్‌ని మధ్యలో బీసీసీఐ నిలిపివేసింది. షెడ్యూల్ ప్రకారం మొత్తం 60 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. అప్పటికి 29 మ్యాచ్‌లు మాత్రమే ముగిశాయి. దాంతో.. మిగిలిన 31 మ్యాచ్‌లను యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకూ నిర్వహించబోతున్నట్లు ఇప్పటికే అధికారింగా బీసీసీఐ ప్రకటించింది. ఆ తర్వాత రెండు రోజులకే యూఏఈ, ఒమన్ వేదికగా టీ20 వరల్డ్‌కప్ ప్రారంభంకానుంది.

సెప్టెంబరు 19న ముంబయి, చెన్నై మధ్య ఫస్ట్ మ్యాచ్ జరగనుండగా.. క్వాలిఫయర్-1 మ్యాచ్ అక్టోబరు 10న, ఎలిమినేటర్ అక్టోబరు 11న, క్వాలిఫయర్-2 అక్టోబరు 13న, ఫైనల్ మ్యాచ్ అక్టోబరు 15న జరగనుంది. త్వరలోనే మ్యాచ్‌ల వారిగా షెడ్యూల్‌ని ఐసీసీ ప్రకటించనుంది.


ఈ ఏడాది ఏప్రిల్‌ 9న మొదలైన 14వ సీజన్‌లో సగం మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి బయోబుడగలో పలువురు ఆటగాళ్లు వైరస్‌ బారిన పడ్డారు. దాంతో మే 4న టోర్నీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌ పర్యటన తర్వాత సెప్టెంబర్‌-అక్టోబర్‌లో యూఏఈలో మిగిలిన మ్యాచ్‌లు పూర్తి చేయాలని బీసీసీఐ, ఐపీఎల్‌ పాలకమండలి కొద్ది రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. 


టోర్నీ వాయిదాపడేసరికి మొత్తం 29 మ్యాచ్‌లు జరగ్గా అందులో దిల్లీ క్యాపిటల్స్‌ టాప్‌లో నిలిచింది. ఆ జట్టు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో అగ్రస్థానం కైవసం చేసుకుంది. మరోవైపు చెన్నై జట్టు 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి 10 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతోనే మూడో స్థానంలో తర్వాత ముంబయి 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో నాలుగో స్థానంలో నిలిచాయి. 


ఇప్పటి వరకు ట్రోఫీ అందుకోని కోహ్లీ జట్టు... ఎలాగైనా టోర్నీ విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోపక్క సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు టోర్నీ మధ్యలో కేన్ విలియమ్సన్‌ను కెప్టెన్ చేసింది. మరి, ఏ జట్టు రాణించి ఈ ఏడాది టోర్నీ విజేతగా నిలుస్తుందో చూడాలంటే... ఇంకా కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే. ట్రోఫీ గెలిచి IPL కెరీర్‌ని ధోనీ గొప్పగా ముగించాలనుకుంటున్నాడు.