ప్రముఖ నటి జయంతి(76) కన్నుమూశారు. గత కొన్నిరోజుల నుంచి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న ఆమె సోమవారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె ఆరోగ్యం క్షీణించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో బెంగుళూరులోని ప్రైవేటు హాస్పిట‌ల్‌లో జాయిన్ చేశారు. చికిత్స పొందుతూ జ‌యంతి క‌న్నుమూశారు. మూడు ద‌శాబ్దాలుగా జ‌యంతి అస్త‌మాతో బాధ‌ప‌డుతున్నారు.   


జయంతి మరణంతో దక్షిణాది చిత్రపరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె మృతి పట్ల తెలుగు, తమిళ, కన్నడ చిత్రపరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. జయంతితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కర్ణాటకలోని బళ్లారికి చెందిన జయంతి అసలు పేరు కమలకుమారి. 1960లో 'యానై పాగన్‌' అనే తమిళ సినిమాతో ఆమె మొదటిసారి బాలనటిగా వెండితెరకు పరిచయమయ్యారు. కన్నడ దర్శకుడు వై.ఆర్‌.స్వామి జయంతికి హీరోయిన్‌గా తొలి అవకాశం ఇచ్చారు. ఆయనే ఆమె పేరును జయంతిగా మార్చారు.  1963లో 'జెనుగూడు' అనే కన్నడ చిత్రంతో నటిగా రంగప్రవేశం చేశారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ, మరాఠీ భాషల్లో సుమారు 500కు పైగా చిత్రాల్లో ఆమె నటించారు.   



సౌత్ ఇండియన్ భాషల్లో 500 లకు పైగా చిత్రాల్లో నటించిన ఆమె.. పలు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు. 1960, 70 దశకాల్లో వెండితెరపై జయంతి హవా నడించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, మరాఠీ, హిందీ భాషా చిత్రాల్లో నటించింది జయంతి. కన్నడ, తెలుగు, మళయాళం భాషల్లో నటించినా సొంతంగానే డైలాగులు చెప్పి ప్రత్యేకత చాటుకుంది జయంతి. 


దర్శకులు కె.వి. రెడ్డి, కె.విశ్వనాథ్‌, కె.బాలచందర్లు ఈమెకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి మంచి వేషాలు ఇప్పించారు. నందమూరి తారకరామారావు, ఎంజీ రామచంద్రన్‌, రజనీకాంత్‌, రాజ్‌కుమార్‌ వంటి అగ్రకథానాయకుల సినిమాల్లో జయంతి కీలకపాత్రలు పోషించారు. 'కొండవీటి సింహం', 'బొబ్బిలి యుద్ధం', 'పెదరాయుడు' వంటి చిత్రాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జయంతి.  


వీటితో 'స్వాతికిరణం', 'శాంతి నివాసం', 'జస్టిస్ చౌదరి', 'రాజా విక్రమార్క', 'అల్లూరి సీతారామరాజు', 'దేవదాసు' వంటి అనేక చిత్రాల్లో ఆమె నటించారు. ఉత్తమ నటి, ఉత్తమ సహాయనటిగా ప్రెసిడెంట్‌ మెడల్‌, రెండు ఫిల్మ్‌ఫేర్‌  అవార్డులను అందుకున్నారు. సినీ పరిశ్రమకు జయంతి చేస్తున్న సేవలను గుర్తించిన కన్నడ చిత్రసీమ ఆమెను ‘అభినయ శారద’ అనే బిరుదుతో సత్కరించింది. 1998 లోక్‌సభ ఎన్నికల్లో లోక్‌శక్తి పార్టీ తరఫున పోటీ చేసి జయంతి ఓటమి పాలయ్యారు. 1999లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమె పరాజయం పొందారు.


జయంతి హఠాన్మరణంతో కన్నడ నాట విషాద ఛాయలు అలుముకున్నాయి. జయంతి మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.