రాష్ట్రంలో ఎంతో కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి రేషన్ కార్డులు మంజూరు చేయానున్నారు. అర్హులైన పేదలకు రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. 3.09 లక్షల మంది లబ్ధిదారులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కార్డులను పంపిణీ చేయనున్నారు.




జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ రేషన్‌కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయా జిల్లాల్లో సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో రేషన్‌ కార్డుల పంపిణీ జరగనుంది.




గత కొంతకాలంగా రాష్ట్రంలో రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ఆగిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు కొత్త రేషన్‌కార్డులు జారీచేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు అధికారులు దరఖాస్తులను ఆహ్వానించారు. వాటిని పరిశీలించిన పౌరసరఫరాలశాఖ అర్హులైన 3,09,083 మందికి కొత్త కార్డులను జారీచేసింది. వీటిద్వారా 8,65,430 మంది లబ్ధిపొందనున్నా రు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు జూలై 26 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ కార్యక్రమం జరుగనుంది. కొత్తకార్డులు పొందినవారికి ఆగస్టు నెల నుంచి రేషన్‌ బియ్యం పం పిణీ చేస్తారు. ఇందుకోసం ఇప్పటికేఉన్న కోటాకు అదనంగా రూ.168 కోట్లతో 5,200 టన్నుల బియ్యం సమకూరుస్తున్నారు.




కొత్తగా జారీచేస్తున్న రేషన్‌కార్డులు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లోనే అధికంగా ఉన్నాయి. కొత్త కార్డుల జారీతో రాష్ట్రంలో రేషన్‌కార్డుల సంఖ్యతోపాటు, లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరుగనున్నది. ఇప్పటివరకు రాష్ట్రంలో 87 లక్షల 41 వేల కార్డులు ఉం డగా 2 కోట్ల 79 లక్షల మంది లబ్ధిదారులున్నారు. కొత్తకార్డుల జారీతో కార్డుల సంఖ్య 90 లక్షల 50 వేలకు చేరనుంది. అదేవిధంగా లబ్ధిదారుల సంఖ్య 2 కోట్ల 88 లక్షలకు పెరుగుతుంది. రేషన్‌ బియ్యం పంపిణీ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా సుమారు రూ.2 వేల 766 కోట్లకుపైగా వెచ్చిస్తోంది. 2 కోట్ల 88 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతినెలా 6 కిలోల చొప్పున 1.72 లక్షల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తోంది.




హైదరాబాద్‌ జిల్లాలో మొత్తం 53,123 మంది అర్హులైన కార్డుదారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ SP రోడ్డులోని జోరాస్టియన్‌ క్లబ్‌లో రేషన్‌ కార్డులను అర్హులకు అందించనున్నారు. అదేవిధంగా మేడ్చల్‌ జిల్లాలోని మేడ్చల్‌, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, ఉప్పల్‌, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాల్లో 30055 మంది లబ్ధిదారులకు రేషన్‌కార్డులను అందించనున్నారు.


రాష్ట్రంలో  పేదలంతా మూడు పూటలా అన్నం తినాలని, ఒక్కరు కూడా పస్తుండకూడదనే విశాల హృదయంతో సీఎం కేసీఆర్‌ పేదలకు రేషన్ కార్డులు ఇస్తున్నారని టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడ్డారు. కరోనా సమయంలో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అందరికి సహాయం చేస్తోందన్నారు. దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్‌కార్డును అందిస్తున్నామన్నారు టీఆర్ఎస్ నేతలు.