ప్రజా కవి గోరటి వెంకన్నకు 2021గానూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఆయన రాసిన 'వల్లంకి తాళం' కవితాసంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తగుళ్ల గోపాల్ కు సాహిత్య అకాడమీ యువ పురస్కార్ దక్కింది. ఆయన రచించిన.. దండకడియం రచనకు అవార్డుకు ఎంపికయ్యారు. బాల సాహిత్య పురస్కారానికి దేవరాజు మహారాజు ఎంపికయ్యారు. ‘నేను అంటే ఎవరు’ నాటకానికి గానూ ఈ పురస్కారం దక్కింది.
కవితల విభాగంలో మవాడీ గహాయి(బోడో), సంజీవ్ వెరెంకర్(కొంకణి), హృషీకేశ్ మాలిక్(ఒడియా), మీథేశ్ నిర్మొహీ(రాజస్థానీ), బిందేశ్వరీప్రసాద్ మిశ్ర(సంస్కృతం), అర్జున్ చావ్లా(సింధి)లకు పురస్కారాలు దక్కాయి. కథా రచయితలు రాజ్ రాహీ(డోగ్రీ), కిరణ్ గురవ్(మరాఠీ), ఖలీద్ హుసేన్(పంజాబీ), నిరంజన్ హంస్డా (సంతాలీ), అంబాయి(తమిళం)కు సాహిత్య పురస్కారాలు వచ్చాయి. నవలా రచయితలు అనురాధా శర్మ పుజారీ(అస్సామీ), నమితా గోఖలే(ఇంగ్లిష్)కు అవార్డులు వచ్చాయి.
బయోగ్రఫీ దాంట్లో.. కన్నడ రచయిత డీఎస్ నాగభూషణ, స్వీయచరిత్ర విభాగంలో జార్జ్ ఒనక్కూర్(మళయాలం), నాటక విభాగంలో బ్రాత్య బసు( బెంగాలీ), దయా ప్రకాశ్ సిన్హా(హిందీ)కి అవార్డులు వచ్చాయి.
గోరటి వెంకన్నకు చిన్నప్పటి నుంచే పాటలంటే ప్రాణం
గోరటి వెంకన్న 1963 లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా, గౌరారంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచే వెంకన్నకు పాటలంటే మహా ఇష్టం. గోరటి వెంకన్న ప్రజాకవి, గాయకుడు. పల్లె ప్రజలు, ప్రకృతే ఆయన పాటల రూపంలో కనిపిస్తుంటాయి. రైతుల సమస్యలపై పాటలు రాస్తున్న సమయంలో 1984 లో ఆయన రాసిన నీ పాట ఏమాయెరో నీ మాట ఏమాయరో అనే పాట చాలా పేరు తెచ్చిపెట్టింది. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల.. నా తల్లి కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల లాంటి పాటలు ఇప్పటికీ.. ప్రజలు పాడుకుంటూనే ఉంటారు. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పాటలతో.. ఆకట్టుకునేవారు. 2016లో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుండి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నాడు. 2020లో గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు.
Also Read: Hyderabad: మీరు అపార్ట్‌మెంట్లలో ఉంటారా? ఈ సౌకర్యం ఫ్రీగా పొందండి.. ఇంకా రెండు రోజులే ఛాన్స్
Also Read: Khammam Politics 2021: ఒడిదుడుకుల కారు పయనం.. ప్రతిపక్షాలకు చిక్కని ఖమ్మం జిల్లా ప్రజల నాడి