తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. రెండు, మూడు రోజులుగా కేసులు పెరుగుదల కనిపిస్తోందని, ఇంకొద్ది రోజుల్లో కేసు తారా స్థాయికి పెరుగుతాయని అంచనా వేశారు. ఈ కేసుల పెరుగుదల థర్డ్ వేవ్‌కి సంకేతం అని డీహెచ్ అన్నారు. డెల్టా కంటే ఆరు రెట్లు వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తిస్తోందని అన్నారు. ఒమిక్రాన్ బాధితుల్లో 90 శాతం లక్షణాలు కనిపించడం లేదని.. లక్షణాలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కోఠిలోని ఆయన కార్యాలయంలో డీహెచ్ మీడియా సమావేశం నిర్వహించారు.


‘‘నిన్న ఒక్కరోజే అమెరికాలో 4 లక్షల ఒమిక్రాన్ కేసులు, ఫ్రాన్స్‌లో 2 లక్షల కేసులు, యూకేలో 1.8 లక్షలు, స్పెయిన్‌లో లక్షకు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కొత్త వేరియంట్‌కి ఈ దేశాలు కేంద్రంగా మారాయి. ప్రస్తుతం ప్రపంచంలో 135 దేశాల్లో ఒమిక్రాన్ ఉంది. మన దేశంలో దాదాపు 19 శాతం కేసులు పెరుగుతున్నాయి. పది వేల నుంచి 13 వేల కేసులు నిన్న ఒక్కరోజే మన దేశంలో పెరిగాయి. తెలంగాణలోనూ మరింత సంఖ్యలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతాయి. వచ్చే 2 నుంచి 4 వారాలు చాలా కీలకం. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ ఒమిక్రాన్ వేరింయట్ వల్ల విపరీతమైన కేసులు పెరుగుతాయి. అతి కొద్ది రోజుల్లోనే గ్రాఫ్ పైకి ఎగబాకడం చూడబోతున్నాం. విదేశాల్లో కూడా ఇదే పరిస్థితులు చూశాం. ఇది థర్డ్ వేవ్‌కు సూచిక అని చెప్పుకోవచ్చు. 


అయితే, ఈ థర్డ్ వేవ్‌కు భయపడాల్సిన పని లేదు. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాం. ఇప్పటికే అన్ని మౌలిక వసతుల పరంగా సిద్ధంగా ఉన్నాం. అయితే, సుమారు 90 శాతం మందిలో ఒమిక్రాన్ వ్యాధి లక్షణాలు కనిపించడం లేదు. మిగతా 10 శాతం మందిలో వ్యాధి లక్షణాలు ఉంటున్నాయి. వీరు జాగ్రత్తగా ఉండాలి. కరోనా లక్షణాలు కనపడగానే పరీక్షలు చేయించుకొని ఎవరికివారు ఐసోలేషన్‌లోకి వెళ్లిపోవాలి.’’ అని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు అన్నారు.


వ్యాక్సిన్ అందరూ వేయించుకోవాలి
‘‘తెలంగాణలో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వంద శాతం పూర్తి చేశాం. సెకండ్ డోస్ 67 శాతం చేరుకున్నాం. వచ్చే నెల నుంచి పిల్లలకు కూడా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. అంతేకాక, పెద్దవారికి ప్రికాషనరీ డోస్ కింద వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. తెలంగాణలో సరిపడ వ్యాక్సిన్ నిల్వలు ఉన్నాయి. రాష్ట్రంలో ఇంకా వ్యాక్సిన్లు వేయించుకోని వారు కచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. వచ్చే రెండు నుంచి 3 వారాలు కచ్చితంగా మాస్కు ధరించాలి. వచ్చే కాలం వేడుకల కాలం కాబట్టి, అందరూ కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలి’’ అని డీహెచ్ అన్నారు.


Also Read: AP Theaters: సీజ్‌ చేసిన సినిమా థియేటర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. మంత్రి వెల్లడి


Also Read: Nizamabad: హైవేపై కుప్పలుతెప్పలుగా కొత్త కరెన్సీ నోట్లు కలకలం.. అవాక్కయిన స్థానికులు, ఏం జరిగిందంటే..


Also Read: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటున్నారా ? ఇదిగో ఈ రూల్స్ అన్నింటినీ గుర్తు పెట్టుకోండి..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి