ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్ల ఓనర్లకు కాస్త ఊరట కల్పించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మొత్తం రాష్ట్రంలోని 9 జిల్లాల పరిధిలో సీజ్‌ చేసిన 83 థియేటర్లను తెరుచుకునేందుకు ఓ అవకాశాన్ని కల్పించింది. ఇందుకోసం ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్‌‌లకు థియేటర్ల ఓనర్లు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పేర్ని నాని సూచించారు. ఈ విషయాన్ని మచిలీపట్నంలో ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. థియేటర్లపై దాడుల సందర్భంగా ప్రభుత్వ అధికారులు గుర్తించిన లోపాలను ఓనర్లు కచ్చితంగా సరిదిద్దుకోవాలని పేర్ని నాని సూచించారు. సీజ్ చేసిన థియేటర్లకు అన్ని వసతులు కల్పించిన తర్వాత నెల రోజుల్లో జేసీకి దరఖాస్తు చేసుకుంటే తిరిగి అనుమతిస్తారని వివరించారు.


ఇటీవల ఆంధ్రాలో రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లపై అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. నిబంధనలు పాటించని, తినుబండారాల కౌంటర్లలో అధిక ధరలకు విక్రయిస్తున్న థియేటర్లపై కొరడా ఝుళిపించారు. సినిమా ప్రదర్శనలో నిబంధనలు ఉల్లంఘించిన పలు థియేటర్లను కూడా అధికారులు సీజ్‌ చేశారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ టిక్కెట్ల ధరలు, ఫుడ్‌ స్టాల్స్‌లో ధరలపై అధికారులు ఆరా తీసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక వసూలు చేస్తున్నట్లు గుర్తించి.. పెద్ద ఎత్తున థియేటర్లను సీజ్ చేశారు.


రాబోయే సీజన్ సంక్రాంతి. చిన్న, పెద్ద సినిమాలు వరసగా రిలీజ్ అవుతుంటాయి. అసలే కరోనాతో కష్టాల్లో ఉన్న సమయంలో ఇప్పుడు థియేటర్స్‌ను సీజ్ చేయడం సరికాదని సినీ ప్రముఖులు, డిస్ట్రిబ్యూటర్లు ప్రభుత్వానికి విన్నవించారు. తాజాగా గురువారం నారాయణ మూర్తి డిస్ట్రిబ్యూటర్లతో మంత్రి పేర్ని నానిని మచిలీపట్నంలో కలిశారు. థియేటర్లు మూసివేత, టికెట్‌ రేట్లపై ఆయనతో చర్చించారు.


టికెట్ రేట్లపై జీవో 35 అమలులో ఉన్నా.. రేట్ల నిర్దారణ కోసం ఓ కమిటీనీ వేశామని, ఆ రిపోర్ట్ ఆధారంగా మార్పులు చేర్పులు ఉంటాయని గతంలో మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సీల్ వేసిన థియేటర్లకు ఊరటనిచ్చారు. ఫైన్లు కట్టి థియేటర్లు తెరుచుకోవచ్చని సూచించారు. కానీ సిబ్బంది గమనించిన లోపాలను నెలరోజుల్లో సరిచేసుకోవాలని ఆదేశించారు.


Also Read: KTR: కొంప ముంచుతున్న సోము వీర్రాజు వ్యాఖ్యలు.. దేశమంతా వైరల్, కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్


Also Read: Nizamabad: హైవేపై కుప్పలుతెప్పలుగా కొత్త కరెన్సీ నోట్లు కలకలం.. అవాక్కయిన స్థానికులు, ఏం జరిగిందంటే..


Also Read: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటున్నారా ? ఇదిగో ఈ రూల్స్ అన్నింటినీ గుర్తు పెట్టుకోండి..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి