ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జన ఆగ్రహ సభలో మంగళవారం (డిసెంబరు 29) చేసిన వ్యాఖ్యలు దేశమంతా వైరల్ అవుతున్నాయి. ఏపీలో బీజేపీని గెలిపిస్తే చీప్ లిక్కర్‌ను రూ.70లకే ఇస్తామని ఆయన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రెవెన్యూ బాగుంటే రూ.50 కే చీప్ లిక్కర్ ఇస్తామంటూ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో దేశమంతా వైరల్ అవుతోంది. వివిధ భాషల్లోకి ట్రాన్స్‌లేషన్స్ అయ్యి మరీ మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో వ్యాపిస్తోంది. మరోవైపు, సోము వీర్రాజు చేసిన ఈ వ్యాఖ్యలు విపక్షాలకు అవకాశం ఇచ్చినట్లయింది. తెలంగాణలో మంత్రి కేటీఆర్ సోము వీర్రాజు వ్యాఖ్యలను ఉటంకిస్తూ బీజేపీకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు.


మంత్రి కేటీఆర్ సోము వీర్రాజు వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘వాహ్.. ఏం స్కీమ్ ఇది. ఎంత అవమానకరమైంది! బీజేపీ జాతీయ విధానాన్ని ఏపీ బీజేపీ ఎంత దిగజార్చిందో చూడండి. చీప్ లిక్కర్‌ను రూ.50కే ఇస్తారట. బీజేపీకి వ్యతిరేకత అధికంగా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ ఇవ్వాలా?’’ అంటూ కేటీఆర్ కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు. 






ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంలో, రాష్ట్రంలోని బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ పార్టీకి కలిసివచ్చినట్లయింది.


సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలివీ..
‘‘వైసీపీ ప్రభుత్వం రూ.3 మద్యాన్ని రూ.25 రూపాయలకు కొని రూ.250కి అమ్ముతోంది. బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ పేరుతో చెత్త బ్రాండ్లను తీసుకొచ్చి అమ్మేస్తున్నారు. బీజేపీకి ఓటు వేస్తే రూ.70కే చీప్ లిక్కర్ ఇస్తాం. ఆదాయం కనుక బాగుంటే రూ.50కే ఇస్తాం. ప్రస్తుత ప్రభుత్వం మద్యం రూపంలో ప్రజలకు దోచి మళ్లీ వారికే ఇస్తోంది. ప్రజల కోరికను తీర్చే సత్తా బీజేపీకే ఉంది.’’ అని సోము వీర్రాజు విజయవాడలోని జనాగ్రహ సభలో వ్యాఖ్యలు చేశారు.


Also Read: బీజేపీ అధికారంలోకి వస్తే.. 70 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తాం.. అన్ని కుదిరితే 50కే..


Also Read: బ్రాహ్మణులే అర్చకత్వానికి అర్హులా..? తిరుపతిలో సుబ్రహ్మణ్య స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి