బ్రాహ్మణులు మాత్రమే అర్చకత్వం చేయాలా ? అని తిరుపతిలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ప్రశ్నించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో విజ్ఞప్తి మేరకు ఓ పత్రికపై పరువు నష్టం దావా వేసిన ఆయన.. ఆ పని మీద తిరుపతికి వచ్చారు. ఈ సందర్భంగా అర్చకత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు బ్రాహ్మణులు మాత్రమే అర్చకత్వం చేయాలా అని ప్రశ్నించారు. బ్రాహ్మణులే వంశపారపర్యంగా అర్చకత్వానికి అర్హులు అనడం సరికాదన్నారు. అంతే కాదు అనువంశిక అర్చకత్వానికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. పురాణాల్లో విశ్వామిత్రుడు, వాల్మీకీలు బ్రాహ్మణులు కాకపోయినా ఆధ్యాత్మిక ప్రచారం చేశారని గుర్తు చేశారు.
Also Read: స్వామీ.. కోర్టుకెళ్లి తేల్చుకుందామా ? టీటీడీపై మళ్లీ ట్వీటెత్తిన రమణదీక్షితులు !
శ్రీవారి గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఇటీవల సుబ్రహ్మణ్యస్వామి ఓ ట్వీట్ చేశారు. శ్రీవారి ఆలయంలో విధుల్లో ఉన్న వంశపారంపర్య అర్చకుల్లో కొందరిని టీటీడీ అధికారులు శాశ్వతఉద్యోగులుగా మార్చారని ఈ అంశంపై న్యాయపరమైన పోరాటం చేద్దామా అని ఆయనను సలహా అడిగారు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్య స్వామి స్పందన అనూహ్యంగా ఉంది. అనువంశిక అర్చకత్వానికి తాను వ్యతిరేకం అని స్పష్టం చేయడమే కాకుండా అసలు బ్రాహ్మణులే అర్చకత్వం చేయాలా అన్న ఓ చర్చను కూడా లేవనెత్తారు. అంతే కాదు.. తనకు రోజు కొన్ని వేల సంఖ్యలో ట్విట్ లు వస్తుంటాయని.. రమణ దీక్షితులు చేసిన ట్వీట్ లు తాను గమనించలేదని తెలిపారు.
Also Read: ఆ అర్చకులకు సంభావన ఇవ్వడంలేదు... గర్భగుడిలో పూజలు చేయనీయడంలేదు... సీఎం జగన్ ను టాగ్ చేస్తూ రమణ దీక్షితులు ట్వీట్
టీటీడీ వెబ్‌సైట్‌లో అన్యమత ప్రచారం జరుగుతోందంటూ గతంలో ఓ పత్రికలో వార్త వచ్చిందని.. ఆ విషయంలో టీటీడీ విజ్ఞప్తి మేరకు తాను రూ. వంద కోట్లకు పరువు నష్టం దావా వేశానన్నారు. హిందూ దేవాలయాలపై ఎక్కడ అసత్య ప్రచారం చేసినా ముందుంటానని స్పష్టం చేశారు. దేశంలోని హిందూ దేవాలయాలు ఎక్కడ ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదని ఆయన ఆకాంక్షించారు. భారత దేశంలో 80 శాతం మంది హిందువులు ఉన్నారని అన్నారు.
Also Read: కల నెరవేరదూ.. ట్వీట్లు ఆగవు.. మళ్లీ లైమ్ లైట్ లోకి రమణ దీక్షితులు
దేశంలోని నాలుగు లక్షల హిందూ దేవాలయాలపై అసత్య ఆరోపణలు చేస్తే సహించను, న్యాయపోరాటం చేస్తా.. అసత్య వార్తలు రాసిన తెలుగు దినపత్రిక క్షమాపణ చెప్పాలి లేకపోతే 100 కోట్లు జరిమాన చెల్లించాలని డిమాండ్ చేశారు.
Also Read: వ్రతం చెడినా ఫలితం దక్కని రమణ దీక్షితులు ! పదవి కోసం ఇంకెన్ని ట్వీట్లు..?