శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులకు మరోసారి కోపం వచ్చింది. వంశ పారంపర్య అర్చకులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించారంటూ ఆయన టీటీడీ ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వంశపార్యపర అర్చక వ్యవస్థను పరిరక్షించాలన్న ఏపీ ప్రభుత్వ ఆదేశాలను ఉన్నతాధికారి ఉల్లంఘించారని రమణదీక్షితులు మండిపడ్డారు. ఇక తరువాయి కోర్టును ఆశ్రయించడమేనా...? అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేసిన రమణ దీక్షితులు... దీనిపై సలహా ఇవ్వండంటూ సుబ్రహ్మణ్య స్వామిని ట్యాగ్ చేశారు. సుబ్రహ్మణ్యస్వామి సలహాలతోనే రమణదీక్షితులు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి ద్వారానే పలు వివాదాలపై ఆయన కోర్టుల్లో పిటిషన్లు వేశారు.
వంశపారంపర్య అర్చకులు జీవితాంతకం సేవల్లో ఉంటారు. వారికి రిటైర్మెంట్ ఉండదు. అయితే ఇప్పుడు రమణదీక్షితులు చెప్పినట్లుగా వారిని పర్మినెంట్ ఎంప్లాయీస్‌గా గుర్తించినట్లయితే.. వారికి రిటైర్మెంట్ ఉంటుంది. నిజానికి గత ప్రభుత్వంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం కారణంగానే రమణ దీక్షితులు రిటైర్ అయ్యారు. ఆయన కుమారుడికి ప్రధాన అర్చకుడి పదవి లభించింది. అయితే ఇలా చేయడం కరెక్ట్ కాదని ఆయన అప్పుడే న్యాయపోరాటం చేశారు. అదే సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌ను కలిసి .. తమ సమస్యను విన్నవించుకున్నారు. తాము గెలిస్ేత మళ్లీ వంశపారంపర్య అర్చకుల వ్యవస్థను కొనసాగిస్తామని రమణదీక్షితులను మళ్లీ ప్రధాన అర్చకుడిగా నియమిస్తామని జగన్ హామీ ఇచ్చారు.
Also Read: కొంచెం తీపి.. ఏంతో చేదు ! 2021లో ఆంధ్రప్రదేశ్ మైలు రాళ్లేంటి ? మర్చిపోవాల్సినవి ఏంటి ?
వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రమణదీక్షితులు మళ్లీ ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు చేపట్టానికి చాలా ప్రయత్నాలు చేశారు. మొదట్లో ఆయనకు నిరాదరణ ఎదురయింది. తర్వాత ఆయనకు ఆగమ సలహాదారు పదవి ఇచ్చారు. ఆ తర్వాత గౌరవ ప్రధాన అర్చకుల పదవి ఇచ్చారు. ఇటీవల తిరుపతి ఉపఎన్నికల సమయంలో ఆయనకు మళ్లీ ప్రధాన అర్చకుల పదవి ఇచ్చారు. అయితే ఆయనకు ఆలయ కైంకర్యాల విషయంలో ఎలాంటి అధికారం లేదు. విధులకు హాజరయ్యే విషయంలోనూ ఆయనకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదు. ఊరకే పేరుకు మాత్రమే ఆయనకు ప్రధాన అర్చక పదవి ఉంది. దీంతో ఆయన అసంతృప్తికి గురవుతూ ఉంటారు. తరచూ ట్వీట్ల ద్వారా తన అసంతృప్తి తెలియచేస్తూనే ఉంటారు.
అయితే ప్రభుత్వం ఆయన సంతృప్తి కోసం ఆదేశాలు ఇస్తుంది కానీ తాము పట్టిచుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా టీటీడీ అధికారులు వ్యవహరిస్తూ ఉంటారు. ఆయనను లెక్కలోకి తీసుకోవడంలేదు. తాజాగా వంశపారంపర్య అర్చకులను కూడా శాశ్వత ఉద్యోగులుగా నిర్ణయించడం ద్వారా ఇక రమణదీక్షితులు చేసిన పోరాటానికి అర్థం లేకుండా పోయింది. ఈ కారణంగానే మళ్లీ ఆయన కోర్టుకు వెళ్లాలా అని సుబ్రహ్మణ్యం స్వామికి సలహా అడిగారు. రమణదీక్షితులు వ్యవహారం ఇప్పుడు శ్రీవారి భక్తుల్లో హాట్ టాపిక్ అయింది.
Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి