కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం బొల్లవరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రూ.515.90 కోట్ల విలువైన అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన సీఎం జగన్ కడప జిల్లా నన్ను గుండెల్లో పెట్టుకుందన్నారు. 'ప్రొద్దుటూరుకి రావడం నాకు దేవుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. కారణమేమిటంటే నాన్న చనిపోయినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా కడప జిల్లా నన్ను గుండెల్లోనే పెట్టుకుని చూసుకుంది. ప్రతి ఇంట్లోనూ ఒక అన్న, తమ్ముడు, కొడుకుగా ఆశీర్వదించారు. ఈ రోజు మీ బిడ్డ ఈ స్ధానంలో ఉన్నాడన్నా... మీ బిడ్డ ఈ రోజు ఇవన్నీ చేయగలుగుతా ఉన్నాడన్నా కూడా ఇదంతా దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులే.' అని సీఎం జగన్ అన్నారు.

 

ప్రొద్దుటూరులో రూ.515.90 కోట్ల అభివృద్ది పనులకు శ్రీకారం

ప్రొద్దుటూరు నగరానికి కేవలం 30 నెలల కాలంలోనే నవరత్నాల పాలనలో కేవలం డీబీటీ పద్ధతిలో నేరుగా బటన్ నొక్కిన వెంటనే ఎటువంటి రాజకీయ ప్రమేయం, వివక్ష లేకుండా అక్షరాలా రూ.326 కోట్లు బదిలీ చేయగలిగామని సీఎం జగన్ అన్నారు. ప్రొద్దుటూరులో పేదల ఇంటి స్థలాలకు దాదాపుగా 500 ఎకరాలు కావాల్సిన పరిస్థితి ఉందన్నారు. దాదాపుగా 22 వేల మంది ఇంటి స్థలం కావాలని దరఖాస్తు చేసుకున్నారన్నారు. ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోయినా ప్రైవేటు స్థలాన్ని రూ. 200 కోట్లు పెట్టి కొనుగోలు చేశామన్నారు. ప్రొద్దుటూరులో 22,212 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వగలిగామన్నారు. వీరిలో మొదట దఫా గృహనిర్మాణానికి సంబంధించిన లబ్ధిదారులు 10,820 మందికి ఇళ్లు మంజూరు  చేశామన్నారు. మరో పది రోజుల్లో నిర్మాణం కూడా మొదలవుతాయని పేర్కొన్నారు. పులివెందులలో కూడా ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేయబోతున్నామన్నారు. ప్రొద్దుటూరులో రూ.515.90 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని సీఎం జగన్ తెలిపారు. 

Also Read: కొంచెం తీపి.. ఏంతో చేదు ! 2021లో ఆంధ్రప్రదేశ్‌ మైలు రాళ్లేంటి ? మర్చిపోవాల్సినవి ఏంటి ?

మెస్సర్స్ సెంచరీ ప్లైబోర్ట్స్ పరిశ్రమకు శంకుస్థాపన

బద్వేలు రెవెన్యూ డివిజన్‌ నూతన కార్యాలయానికి సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. మెస్సర్స్‌ సెంచరీ ప్లైబోర్డ్స్‌ పరిశ్రమకు కూడా శంకుస్థాపన చేశారు. బద్వేలులో సెంచరీ ప్లైబోర్డ్స్‌ ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందని సీఎం జగన్ అన్నారు. ఈ సంస్థకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు. యూకలిప్టస్‌ రైతులకు ఈ ప్లాంట్‌ ద్వారా ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. దీంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సీఎం పేర్కొన్నారు. సెంచరీ ప్లైబోర్డ్స్‌ చైర్మన్‌ సజ్జన్‌ భజాంకా మాట్లాడుతూ.. చెన్నైలో ప్లాంట్ ఏర్పాటుచేద్దామనున్నామని,  సీఎం జగన్‌ బద్వేలులో ఏర్పాటు చేయమని కోరారని, ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించారని తెలిపారు. ఏపీ పారిశ్రామిక విధానం ఎంతగానో ఆకట్టుకుందన్నారు. ఏపీలో 3 దశల్లో రూ. 2600 కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని తెలిపారు.  

Also Read:  సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తే అవమానం ఎలా అవుతుంది... థియేటర్లపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం లేదు... హీరో నానికు మంత్రి బొత్స కౌంటర్

కొప్పర్తిలో ఇండస్ట్రీయల్ పార్క్ 

కడప జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన కొనసాగుతుంది. సీకే దిన్నెలోని కొప్పర్తి ఇండస్ట్రీయల్‌ పార్క్‌లను సీఎం జగన్‌ ప్రారంభించారు. కొప్పర్తి సెజ్‌లో ఇండస్ట్రియల్‌ పార్క్‌లను ప్రభుత్వం అభివృద్ధి చేసింది.  6914 ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ పార్క్‌, 3164 ఎకరాల్లో వైఎస్‌ఆర్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ పార్క్‌,  801 ఎకరాల్లో వైఎస్సార్‌ ఎలక్ట్రానిక్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌,  104 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్‌లు అభివృద్ధి చేయనుంది. ఎలక్ట్రానిక్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ హబ్‌లో కంపెనీలు రూ. 1052 కోట్లు పెట్టుబడులను పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఎలక్ట్రానిక్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ హబ్‌తో 14,100 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 

Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి