ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ రమణ దీక్షితులు ట్వీట్ చర్చనీయాంశం అయ్యింది. ఏప్రిల్‌లో తిరిగి విధుల్లో చేరిన అర్చకులను సంభావన ఇవ్వడంలేదని ఆయన అన్నారు. తిరుచానూరు పద్మావతి ఆలయంలోని వంశపారపర్య అర్చకులకు సంభావన ఇవ్వలేదన్నారు. టీటీడీ అధికారుల వల్ల 2018 నుంచి కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు చేశామన్నారు. ఇంత కష్టపడినా తమను గర్భగుడిలో పూజా కార్యక్రమాలు చేయనీయకుండా అధికారులు అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రమణ దీక్షితులు ట్వీట్ చేశారు. అర్చకులకు ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ను ట్విటర్ ద్వారా కోరారు.
Also Read: వ్రతం చెడినా ఫలితం దక్కని రమణ దీక్షితులు ! పదవి కోసం ఇంకెన్ని ట్వీట్లు..?
మళ్లీ విధుల్లోకి
మూడేళ్ల క్రితం వయో పరిమితి ముగిసి పదవీ విరమణ చేసిన అర్చకులను టీటీడీ తిరిగి విధుల్లోకి తీసుకుంటుంది. ఈ నిబంధనలతో రమణ దీక్షితులు ప్రధాన అర్చకుడిగా బాధ్యతులు చేపట్టారు. 65 ఏళ్లు దాటిన అర్చకులకు పదవీ విరమణ చేయాలని 2018 మే 16న టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. అప్పట్లో టీటీడీతో పాటు గోవింద రాజస్వామి ఆలయం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో పదవీ విరమణ వయసు నిండిన అర్చకులందరూ తమ విధుల నుంచి తప్పుకున్నారు. వీరిలో రమణ దీక్షితులతో పాటు 10 మంది మిరాశీ వంశీకులు, నాన్‌మిరాశీ అర్చకులు మరో 10 మంది ఉన్నారు.
Also Read: కల నెరవేరదూ.. ట్వీట్లు ఆగవు.. మళ్లీ లైమ్ లైట్ లోకి రమణ దీక్షితులు
ప్రభుత్వంపై విమర్శలు
టీటీడీ నిర్ణయంతో ఎ.వి.రమణ దీక్షితులతో పాటు మరో 14 మంది తిరిగి అర్చకులుగా చేరేందుకు అవకాశం లభించింది. రమణదీక్షితులు వంశపారంపర్య అర్చకులు. ఆయనకు రిటైర్మెంట్ ఉండేది కాదు. గత పాలకమండలి తీర్మానం వలన ఆయన రిటైర్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. టీటీడీ బోర్డు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం రమణదీక్షితులు రాజకీయ విమర్శలు చేయడమే అనే వార్తలు వచ్చాయి. ప్రధాన అర్చుకుడిగా ఉంటూనే 2018 మేలో చెన్నైలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి టీటీడీ అధికారులు, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రమణ దీక్షితులు చేసిన విమర్శలు, ఆరోపణలు టీటీడీ అధికారులు, వేదపండిత, ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపాయి. పోటులో తవ్వకాలు నిర్వహించారని, పింక్ డైమండ్‌ను విదేశాలకు తరలించారని ఇలా అనేకానేక ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల కారణంగా టీటీడీ ఆయనపై రూ. వంద కోట్లకు పరువు నష్టం దావా కూడా వేసింది. ఆ తరవాత రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆయన విధులకు దూరమయ్యారు.