మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో వాడీవేడీ వాతావరణం నెలకొంది. ఊహించినట్లే మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానల్ మధ్య పోలింగ్ కేంద్రం వద్ద వార్ జరుగుతోంది. పరిస్థితి కొరుక్కొనే వరకు వచ్చింది. దీంతో ‘మా’ ఎన్నికల్లో ఎన్నడూ కనిపించనంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంతేకాదు.. గతంలో ‘మా’ పోలింగ్‌కు దూరంగా ఉన్న పలువురు నటీ నటులు కూడా విమానాల్లో తరలివచ్చి మరీ ఓటేస్తున్నారు.


ఆదివారం ఉదయం మొదలైన పోలింగ్‌లో నటి జెనీలియా ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చి మరీ ఓటేశారు. అలనాటి నటి జయప్రద సైతం ఢిల్లీ నుంచి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు ఆమెకు ఎదురెళ్లి పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లారు. ఫైట్ టికెట్లు చేయిస్తామని చెప్పినా.. జయప్రద విష్ణు బాబు కోసం నేను రాలేనా? అంటూ తన సొంత డబ్బులతో హైదరాబాద్ వచ్చారని మోహన్ బాబు ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. అలాగే, జెనీలియా స్పందిస్తూ.. ఈ సారి ‘సూపర్ ప్రెసిడెంట్’ అధికారంలోకి వస్తాడని తెలిపింది. వీరి మాటలను బట్టి చూస్తుంటే మంచు విష్ణు స్వయంగా వారిని పోలింగ్‌కు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే, మోహన్ బాబుకు, జయప్రదకు మంచి స్నేహం ఉంది. ఆయన కుమారుడు మంచు విష్ణు అధ్యక్షుడిగా బరిలో దిగిన నేపథ్యంలో ఆమె స్వయంగా ఓటేయాడానికి వచ్చినట్లు తెలుస్తోంది. 


Also Read: ‘మా’లో రచ్చ.. శివబాలాజీ చేయి కొరికిన హేమా.. ప్రకాష్ రాజ్‌తో మంచు ఫైట్


జెనీలియా, మంచు విష్ణు ‘ఢి’ సినిమా నుంచి మంచి స్నేహితులు. ఆ తర్వాత ఇద్దరు కలిసి సినిమాలు చేయకపోయినా.. వారి మధ్య స్నేహం అలానే ఉంది. దీంతో విష్ణు పిలవగానే ఓటేసేందుకు ముంబై నుంచి హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. ‘మా’ సభ్యత్వం కలిగిన మరికొందరు కళాకారులు కూడా చెన్నై నుంచి ఇక్కడికి వచ్చినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని మరికొందరు సభ్యులు, వయస్సు మీద పడి నటీనటులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు. దీన్ని కూడా విష్ణు తనకు అనుకూలంగా మలుచుకున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట పోస్టల్ బ్యాలెట్ కోసం పలువురు సభ్యుల రుసుమును విష్ణు చెల్లించడం వివాదాస్పదమైంది. సుమారు రూ.28 వేలు పోస్టల్ బ్యాలెట్ సభ్యుల కోసం చెల్లించినట్లు ప్రకాష్ రాజ్ ఆరోపించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు వివిధ రాష్టాల నుంచి స్వయంగా ఓటేయడానికి వస్తున్న నటీనటులకు ఏ ప్యానల్ సభ్యులు వసతి కల్పిస్తున్నారనేది టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది. ఓట్ల కోసం విష్ణు ప్యానల్ ఈ ప్లాన్ వేసిందనే సందేహాలున్నాయి. ఇది ఓటర్లను ప్రలోభ పెట్టినట్లు కాదా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఓటర్లను హైదరాబాద్ కు తీసుకురావడం కోసం ఇరు ప్యానల్ ప్రెసిడెంట్ అభ్యర్థులు ప్రత్యేకంగా విమాన టికెట్లు కొనుగోలు చేసి ఇచ్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల కోసం ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేశారు. అందుకే దీనిపై ఎవరూ రచ్చ చేయడం లేదని తెలిసింది. షూటింగులో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు కూడా పోస్టల్ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసినట్లు తెలిసింది.  


Also Read: ‘మా’ ఎన్నికలు.. మోహన్ బాబు కాళ్లు మొక్కబోయిన ప్రకాష్ రాజ్, విష్ణుకు హగ్!


Also Read: మోనార్క్ Vs మంచు: ‘మా’ పోరుపై ఉత్కంఠ.. విజయావకాశాలు అతడికే ఎక్కువట!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి