మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్‌లో ఉత్కంఠ నెలకొంది. ఆదివారం జరిగే ఎన్నికలతో సీన్ క్లైమాక్స్ చేరుకోనుంది. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 2 గంటల వరకు జరిగే ఎన్నికల్లో సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 900 మంది సభ్యుల్లో కొందరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయనున్నారు. ప్రస్తుతం ‘మా’ ఎన్నికల్లో ఎన్నడూ లేనంత హడావిడి నెలకొంది. ప్రకాష్ రాజ్ బరిలోకి దిగడం వల్ల ఈ పోరు కాస్తా ‘లోకల్ Vs నాన్-లోకల్‌’గా మారింది. 


చిరు మద్దతు కలిసొస్తుందా?: ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు చిరంజీవి కుటుంబ సభ్యుల మద్దతు ఉన్నట్లు నాగబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రకాష్ రాజ్ విజయం ఖాయమని చాలామంది భావించారు. గత ‘మా’ ఎన్నికల్లో చిరంజీవి కుటుంబం మద్దతు తెలిపిన అభ్యర్థులు విజయం సాధించిన నేపథ్యంలో ప్రకాష్ రాజ్ విజయం దాదాపు ఖారారైనట్లే అని అనుకుంటున్నారు. కానీ, ప్రకాష్ రాజ్ ఇప్పటివరకు ‘మా’ సభ్యులకు ఏం చేస్తామనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయలేదు. కేవలం తనని తాను డిఫెండ్ చేసుకోడానికే ప్రయత్నించారు కానీ.. హామీలతో ఆకట్టుకొనే ప్రయత్నం మాత్రం చేయలేదు. దీనివల్ల ‘మా’ సభ్యులు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. పైగా ప్రకాష్ రాజ్ సిద్ధాంతాలు రాజకీయాలకు సరిపోతాయేమో గానీ.. ‘మా’లాంటి చిన్న అసోసియేషన్‌కు సరిపోవానే భావన కూడా ఉన్నాయి. కళాకారుడికి లోకల్, నాన్-లోకల్ అనే బేధాలు లేవని బయటకు అంతా చెబుతున్నారు. కానీ, చాలామంది మనసులో మాత్రం ప్రకాష్ రాజ్‌ను బయటవాడిగానే చూస్తున్నారు. సినిమాల్లో నటన వరకు ఓకే.. కానీ, పాలన బాధ్యతలు ఆయనకు ఇవ్వడం ఎందుకని అనుకుంటున్నారు. దీంతో ప్రకాష్ రాజ్ విజయావకాశాలు 50-50గా ఉన్నాయి. ప్యానల్ ప్రకటించినప్పుడు కనిపించిన బలం.. ఇప్పుడు కనిపించడం లేదు. 


మంచు చేతుల్లోకి.. ‘మా’?: ప్రకాష్ రాజ్ పోటీ చేస్తానని చెప్పిన తర్వాత ‘లోకల్-నాన్ లోకల్’ వివాదం మాత్రమే ఉండేది. కానీ, ఆ తర్వాత వ్యక్తిగత దూషణలు.. పరుష పదజాలాలతో పోటీ వాడీ వేడిగా మారింది. వీరి మాటల యుద్ధం.. కోటలు దాటి మీడియాకు ఎక్కింది. దీంతో ప్రకాష్ రాజ్.. మంచుకు సవాళ్లు విసరడం.. మంచు ఎదురుదాడి చేయడంతో ‘మా’ ఎన్నికలు రోత పుట్టించేలా తయారయ్యాయి. కొన్ని టీవీ చానెళ్లు కూడా వారిని స్టూడియోలకు పిలిచి అతి చేయడంతో ‘మా’ పరువు మొత్తం రచ్చకెక్కింది. పైగా ప్రకాష్ రాజ్ ‘మా’ పెద్దలతో తనకు సంబంధం లేదని, వారి మద్దతు పొందితే.. అధ్యక్షుడైన తర్వాత వారి వద్ద కూర్చోవాలనే వ్యాఖ్యలు కొందరికి రుచించలేదు. దీంతో ఈ అంశం విష్ణుకు బాగా కలిసొచ్చింది. టాలీవుడ్ సినిమా పెద్దలను కలుస్తూ.. వారి మద్దతును సంపాదించే ప్రయత్నం చేశారు. పోస్టల్ బ్యాలెట్‌ను సైతం విష్ణు తెలివిగా తనవైపు తిప్పుకున్నారు. అలాగే మేనిఫేస్టో ప్రకటించే రోజు కూడా విష్ణు.. ప్రకాష్ రాజ్ మీద ఎలాంటి ఆరోపణలు చేయకుండా కూల్‌గా స్పందించారు. తాను ఇవ్వాలనుకున్న హామీలను స్పష్టంగా వివరించి ‘మా’ సభ్యులను ఆకట్టుకోవడంలో విష్ణు కొంతవరకు సఫలమయ్యారని తెలుస్తోంది. టాలీవుడ్ పెద్దల సూచన మేరకే విష్ణు.. ప్రెస్ మీట్‌లో ప్రకాష్ రాజ్, నాగబాబులపై విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వలేదని తెలుస్తోంది. ఒక వేళ వారిని విమర్శిస్తే మీడియా ఆ వ్యాఖ్యలకే ప్రాధాన్యమిచ్చి.. అసలు విషయాన్ని పక్కన పెట్టేస్తుందని సూచించడంతో విష్ణు ఆచీతూచి మాట్లాడారనిపిస్తోంది. తన ప్యానల్ సభ్యులను కూడా ఆయన.. మీడియాలో మాట్లాడవద్దని చెప్పినట్లు తెలిసింది. ఈ వ్యూహంతో.. మంచుపై కాస్త పాజిటివ్ టాక్ నడుస్తోంది. హామీలు కూడా ఆకట్టుకొనేలా ఉండటంతో సభ్యులు కూడా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. అయితే, చిరు కుటుంబం మద్దతు ప్రకాష్ రాజ్‌కు ఉండటంతో గెలుపు అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. విజయం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. 


మంచు విష్ణు ప్యానల్ ఇదే: ⦿ మంచు విష్ణు - అధ్యక్షుడు
⦿ రఘుబాబు - జనరల్‌ సెక్రటరీ
⦿ బాబు మోహన్‌ - ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌
⦿ మాదాల రవి - వైస్‌ ప్రెసిడెంట్‌
⦿ పృథ్వీరాజ్‌ బాలిరెడ్డి - వైస్‌ ప్రెసిడెంట్‌
⦿ శివబాలాజీ - ట్రెజరర్
⦿ కరాటే కల్యాణి -జాయింట్‌ సెక్రటరీ
⦿ గౌతమ్‌ రాజు-జాయింట్‌ సెక్రటరీ 
ఎగ్జిక్యూటివ్ మెంబర్లు: అర్చన, అశోక్ కుమార్, గీతాసింగ్, హరినాథ్ బాబు, జయవాణి, మలక్ పేట్ శైలజ, మాణిక్, పూజిత, రాజేశ్వరి రెడ్డి, రేఖా, సంపూర్ణేష్ బాబు, శశాంక్, శివనారాయణ, శ్రీలక్ష్మి, శ్రీనివాసులు, స్వర్ణ మాధురి, విష్ణు బొప్పన, వడ్లపట్ల ఎమ్ఆర్సి.


Also Read: ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు!


ప్రకాష్ రాజ్ ప్యానెల్ మెంబర్స్: 
⦿ అధ్యక్షుడు: ప్రకాశ్‌రాజ్‌
⦿ ట్రెజరర్‌ : నాగినీడు
⦿ జాయింట్‌ సెక్రటరీ: అనితా చౌదరి, ఉత్తేజ్‌
⦿ ఉపాధ్యక్షుడు: బెనర్జీ, హేమ
⦿ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌: శ్రీకాంత్‌
⦿ జనరల్‌ సెక్రటరీ: జీవితా రాజశేఖర్‌
ఎగ్జిక్యూటివ్ మెంబర్లు: అనసూయ, అజయ్, భూపాల్, బ్రహ్మాజీ, ప్రభాకర్, గోవింద రావు, ఖయూమ్, కౌశిక్, ప్రగతి, రమణా రెడ్డి, శివా రెడ్డి, సమీర్, సుడిగాలి సుధీర్, సుబ్బరాజు. డి, సురేష్ కొండేటి, తనీష్, టార్జాన్


Also Read: పవన్‌తో విభేదాలు.. ఆయన మార్నింగ్ షో కలెక్షనంత ఉండదు మీ సినిమా: ప్రకాష్ రాజ్


Also Read: మహిళల్ని క్వశ్చన్ చేసినట్టు మగవారిని ఎందుకు ప్రశ్నించరు..సమంత పోస్ట్ వైరల్