రమణ దీక్షితులు మరోసారి ట్వీట్ చేశారు. సీఎం జగన్‌కు ఫిర్యాదు చేశారు. సీఎం జగన్ ప్రధాన అర్చకులుగా నియమిస్తూ ఏప్రిల్‌లో ఆదేశాలు ఇచ్చినా ఇంత వరకూ తనను కైంకర్యాలకు అనుమతించడం లేదని.. ఇందుకు ఓ "అడ్మిన్" అడ్డు పడుతున్నారని ఆ ఫిర్యాదు సారాంశం. ఇంతకూ ఆ ఆడ్మిన్ ఎవరు..? ప్రధాన అర్చకుడిగా నియమించినా రమణదీక్షితులు ఎందుకు విధుల్లో చేరలేకపోతున్నారు..? అసలు రమణదీక్షితులు ఎందుకు ఇలా వరుస ఫిర్యాదులతో తరచూ వార్తల్లోకి వస్తున్నారు...?

  





ప్రధాన అర్చకునిగా ఉంటూ ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేయడంతో బలవంతపు రిటైర్మెంట్ 


ఏప్రిల్‌లో పదవీ విరమణ చేసిన అర్చకులను తిరిగి అదే స్థానంలో విధుల్లోకి తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. ఈ కారణంగా ఎ.వి.రమణదీక్షితులతో పాటు  మరో 14 మంది తిరిగి అర్చకులుగా వచ్చేందుకూ  మార్గం సుగమమైంది. అసలు రమణదీక్షితులు వంశపారంపర్య అర్చకులు. ఆయనకు రిటైర్మెంట్ ఉండేది కాదు. కానీ 65 ఏళ్లు నిండిన అర్చకులకు పదవీ విరమణ ఇస్తూ 2018 మే 16న అప్పటి పాలకమండలి తీర్మానించింది. ఈ కారణంగా రమణదీక్షితులతో పాటు మరో 11 మంది పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. టీటీడీ బోర్డు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం రమణదీక్షితులు రాజకీయ విమర్శలు చేయడం. చెప్రధాన అర్చుకుడిగా ఉంటూనే 2018మేలో  న్నైలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి  టీటీడీ అధికారులు, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రమణ దీక్షితులు చేసిన విమర్శలు, ఆరోపణలు టీటీడీ అధికారులు, వేదపండిత, ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపాయి. పోటులో తవ్వకాలు నిర్వహించారని.. పింక్ డైమండ్‌ను విదేశాలకు తరలించారని ఇలా అనేకానేక ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల కారణంగా టీటీడీ ఆయనపై రూ. వంద కోట్లకు పరువు నష్టం దావా కూడా వేసింది. ఆ తరవాత రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆయన విధులకు దూరమయ్యారు. 


వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ ప్రధాన అర్చకుడి పదవి ఇస్తామని జగన్ హామీ 


గత సాధారణ ఎన్నికలకు ముందు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లోటస్ పాండ్‌లో కలిశారు. ఆ సందర్భంగా  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆయనకు మళ్లీ ప్రధాన అర్చకుని పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. జగన్ సీఎం అయిన తర్వాత రమణదీక్షితులు మళ్లీ తనకు పదవి ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు. అయితే చాలా కాలం పాటు ఆయన కోరుకున్న ఉత్తర్వులు రాలేదు. ఈ సమయంలో కూడా సీఎం జగన్ దృష్టిలో పడేందుకు కొన్ని వివాదాస్పద ట్వీట్లు చేశారు. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా ప్రకటనలు చేశారు. చివరికి 2019 నవంబర్‌లో .. ఆగమ సలహాదారు, గౌరవ ప్రధాన అర్చకులుగా పదవి ప్రకటించారు. మళ్లీ ప్రధాన అర్చకునిగా తీసుకోవడం సాధ్యం కాదని టీటీడీ అధికారులు చెప్పడంతో ప్రభుత్వం ఆగమ సలహాదారు పదవి ప్రకటించింది. ఆ సమయంలో చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను ప్రభుత్వం హఠాత్తుగా అప్రాథాన్య పోస్టుకు బదిలీ చేసింది. ఆ సమయంలో టీటీడీలో అన్యమతస్తుల అంశం వార్తల్లో ఉంది. ఈ కారణంగా రమణదీక్షితులకు పదవి ప్రకటించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఈ పదవి కూడా రమణదీక్షితులకు నచ్చలేదు. తనకు ఆలయంలో పూర్తి స్థాయి బాధ్యతలు దక్కడం లేదని ఆయన మళ్లీ అసంతృప్తి ట్వీట్లు చేయడం ప్రారంభించారు. 




నియామకం ఆలస్యం కావడంతో  "పరోక్ష అసంతృప్తి" ట్వీట్లు


గత ఏడాది జూలైలో అధికారులు చంద్రబాబు మాటలే వింటున్నారని ట్విట్టర్ వేదికగా ఆరోపణలు గుప్పించేశారు. జగన్ చెప్పినా అధికారులు చేయలేదని రమణదీక్షితులు భావిస్తున్నది.. వంశపారపర్య అర్చకులను విధుల్లోకి తీసుకోవడం.   రమణదీక్షితులకు పదవి ఉందనే కానీ.. ఆయన మాట చెల్లుబాటు కాని పరిస్థితి ఉంది. అందుకే.. అప్పుడప్పుడూ.. తన అసంతృప్తిని ఆయన వెళ్లగక్కేవారు. అధికారులపై ఒత్తిడి పెంచేలా.. చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నారని... రాజకీయ నాయకుని తరహాలో ఆరోపణలు చేసేవారు. చివరికి జగన్మోహన్ రెడ్డి కురణించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయనను ప్రధాన అర్చుకునిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ న్యాయపరమైన ప్రతిబంధకాలు వెంటాడుతూనే ఉన్నాయి. 


ఆగమ సలహాదారు, గౌరవ ప్రధాన అర్చకునిగా నియమించిన దక్కని సంతృప్తి..!  


65ఏళ్లు దాటిన వారికి టీటీడీ రిటైర్మెంట్ ఇచ్చేసిన విషయంపై తిరుచానురు అమ్మవారి ఆలయ అర్చకులు హైకోర్టును ఆశ్రయించారు. రమణదీక్షితులు  సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టులో కేసు విచారణ దశలో వుంది. హైకోర్టులో మాత్రం తిరుచానూరు అమ్మవారి ఆలయ అర్చకులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇదే తీర్పును తమకు అమలు చేయాలని తమని విధులో చేర్చుకోవాలని శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు చాలా కాలంగా కోరుతూ వస్తున్నారు. తిరుపతి ఉపఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా సీఎం జగన్ రమణదీక్షితుల కోరికను మన్నించారు.  పదవీ విరమణ చేసే సమయానికి వారు ఏ స్థానంలో ఉన్నారో అక్కడే నియమించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే రమణదీక్షితులుతోపాటు మరో ముగ్గురు పదవీ విరమణ పొందిన తర్వాత వారి స్థానంలో నలుగురు కొత్తవారిని నియమించారు. 




తిరుపతి ఉపఎన్నికలకు ముందు ప్రధాన అర్చక పదవి ఇచ్చిన ప్రభుత్వం..! కోర్టు పిటిషన్లతో చిక్కులు


 పదవీ విరమణ చేసినవారు తిరిగి అదే స్థానంలో చేరితే కొత్తగా బాధ్యతలు తీసుకున్నవారు తమ పాత స్థానాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలా వెళ్లడం ఇష్టం లేని ప్రస్తుత ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు హైకోర్టును ఆశ్రయించారు.  రమణదీక్షితులు రిటైర్మెంట్ తర్వాత వేణుగోపాల దీక్షితులనే ప్రధాన అర్చకునిగా ఉన్నారు.  తనకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు.  గొల్లపల్లి వంశం నుంచి తాను ప్రధాన అర్చకుడిగా కొనసాగుతుండగా.. తమ కుటుంబం నుంచే రమణదీక్షితులను ప్రధాన అర్చకుడిగా నియమించడాన్ని ప్రధానంగా సవాల్ చేశారు.  ప్రతివాదులుగా ప్రభుత్వం, టీటీడీ, రమణదీక్షితులను  పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు  ప్రభుత్వం, టీటీడీ, రమణదీక్షితులకు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉంది. ఈ కారణంగా రమణదీక్షితులకు మళ్లీ ఆలయంలో గత వైభవం రాలేదు. 
 
ఇప్పుడు మరోసారి జగన్‌కు ట్వీట్లతో అసంతృప్తి ...! ఈ సారైనా మనోవాంఛ ఫలిస్తుందా..?


అందుకే రమణదీక్షితులు మళ్లీ సీఎం జగన్‌కు ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే తనను అడ్డుకుంటున్నది ఓ అడ్మిన్ అని ఆయన నమ్ముతున్నారు. సమస్య పై స్పందించి  న్యాయం చేసి...అడ్మిన్ ను సరైన మార్గంలో పెట్టండంటూ సీఎం జగన్ కు ట్విట్టర్ వేదికగా దీక్షితులు ట్వీట్ చేశారు. దీక్షితులు. అడ్మిన్ అని ఎవర్ని అన్నారో ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. తన రాకను ఉన్నతాధికారి వ్యతిరేకిస్తున్నారని ఆయనను ఉద్దేశించే పెట్టి ఉంటారని భావిస్తున్నారు.  రమణదీక్షితుల ట్వీట్‌పై సీఎం స్పందించలేదు.