ఇంగ్లాండ్ గడ్డపై తొలి టెస్టులో సాధించలేని విజయాన్ని రెండో టెస్టులో సుసాధ్యం చేసుకుంది భారత క్రికెట్ జట్టు. విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా లార్డ్స్ టెస్టులో విజయంతో 5 టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే భారత ఆటగాళ్లతో పాటు, రిజర్వ్ ఆటగాళ్ల ప్రవర్తనపై ఇంగ్లాండ్‌లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


క్రికెట్ మక్కాగా పిలుచుకునే లార్డ్స్ టెస్టులో చివరిరోజు భారత బౌలర్లు అద్భుతం చేశారు. దాంతో 151 పరుగుల తేడాతో రెండో టెస్టులో టీమిండియా విజయాన్ని అందుకుంది. సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. భారత జట్టు విజయాన్ని జీర్ణించుకోలేని ఇంగ్లీష్ క్రికెటర్లతో పాటు ఆ దేశ కొన్ని పత్రికలు, మీడియా భారత ఆటగాళ్లపై విమర్శలు ఎక్కుపెట్టింది. లార్డ్స్ టెస్టులో భారత క్రికెటర్ల ప్రవర్తన సరిగా లేదంటూ సంచలన ఆరోపణలు చేసింది. ముఖ్యంగా రెండో టెస్టు అయిదో రోజు భారత ఆటగాళ్లు, రిజర్వ్ ప్లేయర్ల ప్రవర్తన సరిగా లేదన్నది ఆ వార్త సారాంశం.
Also Read: చెన్నై సూపర్ కింగ్స్‌ క్వారంటైన్ ముగిసింది... బ్యాట్‌లతో ఫీల్డ్‌లోకి దిగిపోయారు..


ఇంగ్లాండ్ జట్టు 7 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసిన సమయంలో భారత ఆటగాళ్లు హద్దుమీరి ప్రవర్తించారని రిపోర్ట్ చేసింది. ఏడు వికెట్లు కోల్పోయిన సమయంలో ఇంగ్లాండ్ పేసర్ ఓలీ రాబిన్‌సన్ బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి అడుగుపెడుతున్నాడు. ఆ సమయంలో భారత ఆటగాళ్లకు డ్రింక్స్ ఇచ్చి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న రిజర్వ్ బెంచ్ ప్లేయర్లు అమర్యాదగా నడుచుకున్నారని పేర్కొంది. బ్యాటింగ్‌కు వెళ్తున్న రాబిన్‌సన్‌కు భారత రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లు దారి ఇవ్వకుండా అమర్యాదగా ప్రవర్తించారని, అంతటితో ఆగకుండా రాబిన్‌సన్‌ను దురుసుగా తాకుతూ డ్రెస్సింగ్ రూముకు తిరిగొచ్చారని ది గార్డియన్ తన కథనంలో రాసుకొచ్చింది. 
Also Read: IND vs ENG : సూర్యకుమార్‌, పృథ్వీ షా... వాట్ ఏ కామెడీ టైమింగ్


భారత రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లు వెళ్లేవరకు ఆగి, ఆ తరువాత రాబిన్‌సన్ క్రీజులోకి అడుగు పెట్టాడని ఇంగ్లీష్ మీడియా తమ ఆటగాళ్లకు నైతిక మద్దతు తెలుపుతూ కథనం రాసుకొచ్చింది. ఇదివరకే లార్డ్స్ టెస్టులో మూడో రోజు భారత పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఓ షార్ట్ పిచ్ బంతితో ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్‌ను కవ్వించాడు. అక్కడ మొదలైన వివాదం కోహ్లీ వర్సెస్ అండర్సన్ గా మారడం తెలిసిందే. ఏది ఏమైతేనేం రెండో టెస్టులో పట్టు వదలకుండా భారత్ పోరాడటంతో సొంత గడ్డపై ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికలో ఇంగ్లాండ్ జట్టు 151 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఆగస్టు 25న మూడో టెస్టు ప్రారంభం కానుంది. తమ జట్టు ఓటమి చెందడంతో బ్రిటీషు మీడియా భారత ఆటగాళ్ల ప్రవర్తనను తప్పుపడుతూ కథనాలు రాసుకొచ్చిందని భారత అభిమానులు, మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
Also Read: 18 స్థానాలు ఎగబాకిన సిరాజ్... కోహ్లీ, రోహిత్ శర్మ ర్యాంక్ స్థిరంగా