తాడేపల్లి గ్యాంగ్ రేప్, గుంటూరులో బీటెక్ యువతి దారుణ హత్య ఘటనలు మరవక ముందే మరో ఘోరం జరిగింది. దళిత బాలికపై ఇద్దరు మృగాళ్లు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికను లాక్కెళ్లి ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా రాజుపాలెం మండల పరిధిలో పులిచింతల ప్రాజెక్టు పునరావాస కేంద్రంలో ఈ ఘోరమైన ఘటన జరిగింది.
నోట్లో గుడ్డలు కుక్కి...
మానసిక దివ్యాంగురాలైన బాలికపై మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. నోట్లో గుడ్డలు కుక్కి, 4 గంటలు చిత్రవధ చేశారు. ఈ ఘటనపై గురువారం కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమ్మిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుంటూరులోని నల్లకుంటకు చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ఇద్దరు కుమార్తెలను రాజుపాలెంలోని ఆర్ఆర్ పాలెం పులిచింతల పునరావస కేంద్రం సెంటర్ లో ఉంటున్న నాయనమ్మ వద్ద ఉంచారు. ఇటీవల నాయనమ్మ మృతి చెందడంతో అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు రాజుపాలెం వచ్చారు.
Also Read: Afghanistan Funds : బ్యాంకుల్లోని ఆఫ్గాన్ డబ్బులకు వారసులెవరు..?
మద్యం మత్తులో..
ఇంట్లో ఒంటరిగా ఉన్న మానసిక దివ్యాంగురాలైన బాలికపై మద్యం మత్తులో ఇద్దరు యువకులు అత్యంత పాశవికంగా చిత్రవధకు గురిచేసి అత్యాచారం చేశారు. బాలికపై ఇద్దరు సామూహిక అత్యాచారం చేశారని బాధితురాలి మేనమామ రాజుపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు గల్లా లాబు, మేరుగు సంజీవ్‌లుగా గుర్తించారు. వీరిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Also Read: Hyderabad: ఇంట్లోకి చొరబడి దొంగతనం.. కానీ మంచోడట! అవాక్కైన బాధితుడు.. ఎలాగంటే..
గుంటూరు జిల్లాలో వరుస ఘటనలు
నాలుగు రోజుల క్రితం గుంటూరు నగరంలో పట్టపగలు నడిరోడ్డుపై బీటెక్ విద్యార్థిని రమ్యని ఓ సైకో దారుణంగా పొడిచి హత్యచేశాడు. ప్రేమించానని వేధించి విచక్షణా రహితంగా కత్తితో పొడవడంతో రమ్య ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రమ్య హత్య జరిగిన రోజుల వ్యవధిలోనే గుంటూరు జిల్లాలో ఈ ఘోరం వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది.
లోకేశ్ ట్వీట్
ఈ ఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. రమ్య ఘటన మరవకముందే గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటుచేసుకోవడం బాధాకరమని ట్వీట్ చేశారు. రాజుపాలెంలో దళిత బాలిక పై సామూహిక అత్యాచార ఘటన రాష్ట్రంలో ఉన్న ఘోరమైన పరిస్థితులకు అద్దంపడుతుందని ఆరోపించారు. ఆడబిడ్డలకు భద్రత కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. బాధితురాలి తండ్రితో ఫోన్ లో మాట్లాడిన లోకేశ్.. న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Also Read: Avanthi Srinivas Audio Tape: మంత్రి ఆడియో టేప్ హల్‌చల్.. మహిళతో ఆ మాటలు, స్పందించిన అవంతి శ్రీనివాస్