ఆఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నారు. అధ్యక్షుడు పరారైపోయారు. ప్రజా ప్రభుత్వం కుప్పకూలింది. తాలిబన్లను ఉగ్రవాదులుగానే ప్రపంచం గుర్తిస్తోంది. వారిని ప్రభుత్వంగా గుర్తించే ఆలోచనే లేదని చెబుతోంది. ఇలాంటి సమయంలో ఆప్గానిస్థాన్‌కు బ్యాంకుల్లో ఉన్న వేల కోట‌్ల నిధులు ఎవరికి చెందుతాయి..? ఆ నిధులను ఎవరు డ్రా చేసుకుంటారు..? ఇప్పుడు ఇదే పెద్ద సమస్య అయింది.
తాలిబన్లు డ్రా చేయకుండా ఆప్గన్ నిధుల్ని ఫ్రీజ్ చేస్తున్న బ్యాంకులు..!
బ్యాంకుల్లో పెద్ద మొత్తం ఉండి.. ఆ నగదుకు చట్టబద్ధమైన వారసులు ఎవరో తేలనప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయి..? నగదును ఫ్రీజ్ చేస్తాయి. ఎవరూ డ్రా చేసుకోకుండా చేస్తాయి. ఇప్పుడు అమెరికా కూడా అదే చేసింది. అమెరికా బ్యాంకుల్లోని అఫ్గన్‌కు సంబంధించిన నిధులను ఫ్రీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. యుఎస్ ట్రెజరీ ఫెడరల్ రిజర్వ్, ఇతర అమెరికా బ్యాంకుల్లోని ఆఫ్గన్‌కు చెందిన 9.5 బిలియన్ డాలర్ల నిధులు ఉన్నాయి. వీటన్నింటినీ ఎవరూ డ్రా చేసుకోకుండా నిషేధం విధించింది. తాలిబన్ల చేతిలో నిధులు దుర్వినియోగం అవుతాయన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా ప్రకటించింది. ఇతర దేశాల్లో ఏమైనా ఆప్గాన్ నిధులు ఉంటే డ్రా చేసుకోవడానికి తాలిబన్లకు చాన్స్ ఇచ్చే అవకాశం లేదు.
అప్పులు, సాయాన్ని ఆపేస్తున్న దేశాలు, ఆర్థిక సంస్థలు..!
అదే సమయంలో ఇప్పటి వరకూ ఆప్గనిస్థాన్ పునర్మిర్మాణం కోసం పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలు సాయం చేస్తున్నాయి. ఆ నిధులను కూడా ఆపేయాలని నిర్ణయించాయి. ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ఇప్పటి వరకూ ఆప్గన్‌కు కల్పించిన రుణ సౌకర్యాలు.. ఇతర నిధుల కల్పనను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. మరో వైపు జర్మనీ కూడా తాము ఇప్పటి వరకూ మంజూరు చేసిన రుణాలు.. ఇతర నిధులను ఇక నిలిపివేస్తున్నామని.. ఇవ్వబోవడం లేదని తెలిపింది. ఇప్పటికే ఆప్గన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ కారణాలతో తాలిబన్లు సున్నా నుంచి పాలన ప్రారంభించాల్సి ఉంది.
చిల్లిగవ్వ కూడా తీసుకెళ్లలేదన్న మాజీ అధ్యక్షుడు ఘనీ..!
మరో వైపు నాలుగు కార్లు, హెలికాఫ్టర్ నిండా డబ్బులతో మాజీ అధ్యక్షుడు ఆష్రాఫ్ ఘనీ ఉడాయించారని ఆరోపణలు వచ్చాయి. కానీ తాను ఒక్క పైసా కూడా తీసుకెళ్లలేదని ఆయన పారిపోయిన తర్వాత తొలి సారి మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. కనీసం నా కాళ్లకున్న చెప్పులు మార్చుకునే అవకాశం కూడా రాలేదుని.. తీవ్రమైన ముప్పు ఉందని నా భద్రతా సిబ్బంది చెప్పడంతో వెంటనే అధ్యక్ష భవనం నుంచి వెళ్లిపోయాను. కట్టుబట్టలతో ఉత్త చేతులతో వచ్చేశాను. కావాలంటే యూఏఈ అధికారులతో ధృవీకరించుకోవచ్చని ప్రకటించారు.