హైదరాబాద్‌లో ఉచిత మంచినీటి సరఫరా పొందాలనుకొనే అపార్ట్ మెంట్ వాసులు దరఖాస్తు చేసుకొనేందుకు ఇంకా రెండు రోజులే గడువు ఉంది. వీరు ఇంకా ఉచిత తాగునీటి పథకం కోసం నమోదు చేసుకోకపోతే త్వరపడాల్సిన సమయం ఇది. ఒక అపార్ట్‌మెంట్ సముదాయంలోని మొత్తం ఫ్లాట్లలో 50 నుంచి 60 శాతం మంది ఫ్లాట్ ఓనర్లు నమోదు చేసుకున్నా.. ఆ అపార్ట్‌మెంట్‌కు ఫ్రీగా తాగునీటి సౌకర్యం పొందే వెసులుబాటు ఉండనుంది. ఇందుకు దరఖాస్తు చేసుకోని వారు దరఖాస్తు చేసుకొనేందుకు ఈ నెలఖరు వరకూ గడువు ఇచ్చారు. ఆ గడువు డిసెంబరు 31తో ముగియనుంది. అంతేకాక, వెంటనే కుళాయి వినియోగదారుడి సంఖ్య (క్యాన్), ఆధార్ నంబరుతో అనుసంధానం చేసుకోవాలని అధికారులు గతంలో నిబంధన విధించిన సంగతి తెలిసిందే. వివిధ కారణాలతో ఇప్పటికీ అనుసంధానం చేసుకోని ఫ్లాట్ల యజమానులకు ఇది ఒక మంచి అవకాశం అని అధికారులు చెబుతున్నారు.
అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల యజమానులు తమ ఇంటిని అద్దెకు ఇచ్చి అద్దెతోపాటు నీటి ఛార్జీలు విడిగా నెల నెలా వసూలు చేస్తుంటారు. ఇలాంటి విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. యజమానితో సంబంధం లేకుండా అద్దెకు ఉంటున్న వారు తమ ఆధార్ కార్డుతో అనుసంధానమైతే ఆ ఇంటికి ఉచిత నీటిని పొందే వీలు ఉండనుంది. ఆధార్ అనుసంధానం చేసినా ఆ వ్యక్తికి ఇంటిపై హక్కులు ఉండబోవని అధికారులు స్పష్టం చేశారు.
Also Read: KTR: కొంప ముంచుతున్న సోము వీర్రాజు వ్యాఖ్యలు.. దేశమంతా వైరల్, కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్
హైదరాబాద్‌లో ఉచిత మంచి నీటి పథకం కింద లబ్ధిపొందే నల్లాలు 9,84,023 ఉన్నాయి. వీటిలో ఆధార్‌తో అనుసంధానమైనవి 4,91,000. ఇంకా అనుసంధానం కావాల్సినవి.. 4,93,023గా ఉన్నాయని అధికారులు తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఫ్రీ మంచి నీటి సరఫరా అని వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ పథకం గత డిసెంబరులోనే అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గృహ వినియోగదారులకు నెలకు 20 వేల లీటర్ల మంచి నీటిని ఉచితంగా సరఫరా చేస్తున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి