వరుస విజయాలు వస్తున్నప్పటికీ ఖమ్మం టీఆర్‌ఎస్‌లో విభేదాల పర్వం కొనసాగుతుంది. సొంత పార్టీలోనే ప్రత్యర్థులుగా మారి ఆరోపణలతో ముందుకు సాగుతుంది. 2021లో ఖమ్మం జిల్లా రాజకీయాలలో అనేక మార్పులు జరిగాయి. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ వరుస విజయాలతో ముందుకు సాగుతుండగా ప్రతిపక్ష పార్టీలు ప్రజాందోళనలకు పరిమితమయ్యాయి. ఈ ఏడాది జిల్లాలో మూడు ఎన్నికలు జరగ్గా మూడు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించింది. అయితే విభేదాల నేపథ్యంలో పార్టీలో అంతర్గతపోరు మరింత పెరగడం ఈ ఏడాది టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎదురుదెబ్బగానే భావించవచ్చు. మాజీ, తాజాల పోరుతో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రోడ్డెక్కి బాహాబాహీకి దిగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం తమ బలాన్ని పెంచుకునేందుకు ప్రజాపోరులో నిమగ్నమయ్యాయి.
మూడు ఎన్నికలలోనూ గులాభీ హవా..
2021 సంవత్సరంలో జిల్లాలో మూడు ఎన్నికలు జరిగాయి. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించింది. అనంతరం జరిగిన ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించినప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ అనూహ్యంగా పుంజుకోవడం గమనార్హం. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ సీపీఐతో పొత్తు కుదుర్చుకుంది. మొత్తం 57 స్థానాలకు ఎన్నికలు జరగ్గా టీఆర్‌ఎస్‌ పార్టీ 43 స్థానాలు, సీపీఐ రెండు స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ పార్టీ అనూహ్యంగా 10 స్థానాల్లో విజయం సాధించడం గమనార్హం. ఇక బీజేపీ ఈ ఎన్నికల్లో ఒకే స్థానానికి పరిమితమైంది. మరోవైపు ఖమ్మం నగరంలో బలమైన క్యాడర్‌ కలిగిన సీపీఎం రెండు స్థానాలను కైవసం చేసుకుంది. ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికలపై రాష్ట్ర నాయకత్వం గురిపెట్టినప్పటికీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 10 డివిజన్లను గెలుచుకోవడం చర్చానీయాంశంగా మారింది. 
విభేదాలను ఎత్తి చూపిన విజయం..
ఈ ఏడాది చివరలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించినప్పటికీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలతో క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. దీంతో ఎన్నికల్లో విజయం సాదించినప్పటికీ పార్టీ నేతలకు మాత్రం ఇది చేదు అనుభవంగానే మారింది. జిల్లాలో పార్టీకి ఇప్పుడు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అంతా తానై వ్యవహరిస్తుండగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. దీంతో ఇప్పుడు జిల్లాలో పార్టీలో మూడు వర్గాలుగా విడిపోయిందనే విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన క్రాస్‌ ఓటింగ్‌ను పొంగులేటి వైపు మరల్చేందుకు జిల్లాలో ఉన్న నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏడాది చివరగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో ఇప్పటి వరకు ఉన్న విభేదాలను మరింత బహిర్గతం చేశాయనే చెప్పవచ్చు. ఇదిలా ఉండగా టీఆర్‌ఎస్‌ పార్టీలో నియోజకవర్గాల స్థాయిలో మాజీ, తాజా ఎమ్మెల్యేల పోరు మరింత పెరిగిందనే చెప్పవచ్చు. ప్రధానంగా పాలేరు, వైరా, కొత్తగూడెం, మణుగూరులో పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ 2021 చివరలో జరిగిన రాజకీయ సంఘటనలు నూతన సంవత్సరంలో రాజకీయ పార్టీలను ఎటువైపు నడిపిస్తాయో వేచి చూడాల్సిందే. 


Also Read: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటున్నారా ? ఇదిగో ఈ రూల్స్ అన్నింటినీ గుర్తు పెట్టుకోండి..


Also Read: KTR: కొంప ముంచుతున్న సోము వీర్రాజు వ్యాఖ్యలు.. దేశమంతా వైరల్, కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి