Free Travelling Facility In Festival Season In Telangana :తెలంగాణ(Telangana)లో అమలు అవుతున్న మహిలక్ష్మి పథకం(Mahalakshmi) రోజుకో వార్త ప్రచారంలోకి వస్తోంది. ఈ పథకం కింద మహిళలకు కల్పించే ఉచిత ప్రయాణం(Free Travelling) పండగ రద్దీలో ఎలా ఉంటుందనే అనుమానం చాలా మందిలో ఉంది. ఇప్పటికే ఆర్టీసీ(RTC) బస్‌లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. మఖ్యంగా మహిళా ప్రయాణికులతో మరింత రద్దీగా మారుతున్నాయి. ఇప్పుడు పండగ సీజన్‌లో పరిస్థితి ఏంటనే పరిస్థితి అందరిలో వ్యక్తమవుతుంది. 


రాబోయేది రద్దీ కాలం 


ఓవైపు సంక్రాంతి సీజన్(Sankranti Season ) మొదలు కానుంది. మరోవైపు మేడారం జాతర(Medaram ) కూడా ప్రారంభంకానుంది. తర్వాత వేసవి రద్దీ ఉండనే ఉంటుంది. అందుకే ఇలాంటి సందర్భాల్లో ఉచిత ప్రయాణ సౌకర్యంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. అసలు రద్దీకి తగ్గటు ఆర్టీసీ చేపట్టే చర్యలు ఏంటన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. 


స్పెషల్‌ బస్సులు 


ప్రత్యేక సందర్భాల్లో రద్దీని తట్టుకునేందుకు ఆర్టీసీ స్పషల్ బస్‌లు నడపడం సహజంగానే జరుగుతుంది. అప్పటి వరకు మూలన పడిన బస్సులన్నింటినీ రోడ్డుపైకి తీసుకొస్తుంది. ప్రత్యేక ఛార్జీలు కూడా పెట్టి ఆదాయాన్ని పెంచుకుంటుంది. అయితే ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉన్నందున ఈసారి కొత్త ఎత్తుగడతో ఆర్టీసీ బస్సులు నడపనుంది అనే ప్రచారం జరుగుతోంది. 


తగ్గుతున్న ఆదాయం 


మహాలక్ష్మి పథకం పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లకు మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన బస్సుల్లో ముందుగానే వసూలు చేసినట్టు ఛార్జీలు వసూలు చేయనున్నారు. అందుకే పండగలు, జాతర్లు లాంటి సందర్భాల్లో వేసే బస్సులను ఈ రెండు కేటగిరీలు కాకుండా వేరే కేటగిరీలు కింద తీసుకొస్తే ఛార్జీల భారం తగ్గుతుందని ఆర్టీసీ అధికారుల ఆలోచన అని టాక్. ఇప్పటికే ఉచిత ప్రయాణం కారణంగా ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగినప్పటికీ ఆదాయం మాత్రం దారుణంగా పడిపోయింది. 


భారం తగ్గించుకునే ప్రయత్నాలు 


ప్రత్యేక సందర్భాల్లో ఇదే ఉచిత ప్రయాణం కొనసాగితే ఈ నష్టాలు మరింత పీక్స్‌కు చేరే ఛాన్స్ ఉంది. అందుకే విరుగుడుగా ఆర్టీసీ అధికారులు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులను తగ్గించే ఆలోచన ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది. ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ ఎదుర్కొంటున్న నష్టాలను ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అది తిరిగి చెల్లించే వరకు ఆ ఆర్థిక భారాన్ని ఆర్టీసీ భరించాలి. అందుకే ఇలా ప్లాన్ చేస్తున్నారని టాక్. 


ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సులపై ఆంక్షలు 


మరోవైపు సంక్రాంతి లాంటి సీజన్‌లో తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని బస్సులు తిరుగుతాయో అదే స్థాయిలో పొరుగు రాష్ట్రాలకి కూడా బస్సులను తిప్పుతుంటారు. ఉచిత ప్రయాణం ఉన్నందున పొరుగు రాష్ట్రాల బస్సులను తగ్గించే ఆలోచన కూడా ఉన్నట్టు సమాచారం. దీని కారణంగా ఇక్కడ ధ్రువీకరణ పత్రాలు ఉన్న వాళ్లు తెలంగాణ సరిహద్దులు దాటే వరకు ఉచితంగా ప్రయాణం చేసి అక్కడి నుంచి టికెట్ తీసుకునే ఛాన్స్ ఉంది. అందుకే ఇతర్రాష్ట్రాలకు బస్సులను తగ్గిస్తే వాళ్లంతా ప్రత్యామ్నాయ ఏర్పాటు చూసుకుంటారని దీని వల్ల కూడా భారం తగ్గుతుందని అంటున్నారు. 


ఇలా వస్తున్న ప్రచారంపై ప్రభుత్వం నుంచి కానీ, ఆర్టీసీ నుంచి కానీ ఎలాంటి ప్రకటన రాలేదు. అసలు పండగ సందర్భంగా ప్రయాణాలపై తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వం సమీక్షించినట్టు కూడా సమాచారం రాలేదు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారానికి ఎలాంటి ఆధారాలు లేవని ప్రభుత్వ వర్గాలు కొట్టి పారేస్తున్నాయి. ఏదైనా ఉంటే ఆర్టీసీ ఎండీ కానీ, రోడ్డు రవాణా మంత్రి కానీ ప్రకటన చేస్తారని చెబుతున్నారు. 


Also Read: రెండు నెలల ముందుగానే మేడారం జాతర సందడి, ముందస్తు మొక్కులకు కారణం ఏంటంటే!


Also Read: ప్రయాణికులకు గుడ్ న్యూస్, సంక్రాంతికి మరిన్ని స్పెషల్ ట్రైన్స్: రైల్వే కీలక ప్రకటన