Numaish Begins From January 1st: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నుమాయిస్ 2024ను ప్రారంభించారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (Nampally Exhibition Grounds) లో ప్రతి ఏడాది జనవరి 1 న ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (Numaish 2024) ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 15 వరకు 46 రోజులపాటు కొనసాగుతుంది. ఈ ఏడాది 83వ నుమాయిష్ ఈవెంట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రతి ఏడాది నుమాయిష్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల ఉత్పత్తులతో పాటు తెలంగాణ, ఏపీలకు చెందిన పలు ఉత్పత్తులు, ప్రభుత్వాల స్టాళ్లు మొత్తం 2,400 వరకు ఏర్పాటు కానున్నాయి.


టికెట్ ధర ఎంతంటే.? 
ఎగ్జిబిషన్ ను సందర్శించే వారి కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎగ్జిబిషన్ సొసైటీ సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తోంది. ఎగ్జిబిషన్ కు వచ్చే వారిని గోషామహల్, అజంతా గేట్, గాంధీభవన్ గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తారు. టికెట్ ధర రూ.40గా నిర్ధారించారు. వినోదాత్మకమైన పలు విభాగాలు అందుబాటులో ఉంటాయి. ఎగ్జిబిషన్ కు వచ్చే సందర్శకుల కోసం ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఆహ్లాదకర వాతావరణంలో అందరూ మెచ్చేలా 'నుమాయిష్' సాగుతుందని ఎగ్జిబిషన్ సొసైటీ కోశాధికారి ఏనుగుల రాజేందర్ కుమార్ తెలిపారు. 33 సబ్ కమిటీల ద్వారా ఎగ్జిబిషన్ విజయవంతంగా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సబ్ కమిటీల ప్రతినిధులు తగిన చర్యలు తీసుకుంటారని సొసైటీ ఉపాధ్యక్షుడు వనం సత్యేందర్ చెప్పారు.


ఇదీ చరిత్ర.. 
1938వ సంవత్సరంలో ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ నేతృత్వంలో ప్రారంభమైన ఈ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన అప్పట్లో నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించేవారు. ఆ తర్వాత 1946లో నాంపల్లిలోనూ ఎగ్జిబిషన్ మైదానంలోని 26 ఎకరాల సువిశాల స్థలంలో నిర్వహిస్తూ వస్తున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా నిర్వహిస్తున్న 'నుమాయిష్' కార్యక్రమం దేశ, విదేశాల్లో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు తయారు చేసిన ఉత్పత్తులకు విస్తృత ప్రచారం లభించడం సహా, వాటి విక్రయాలకు సైతం ఈ ఈవెంట్ కేంద్రంగా నిలుస్తోంది. ప్రతి ఏడాది దాదాపు 25 లక్షల మంది సందర్శకులు ఎగ్జిబిషన్ ను సందర్శిస్తారు. ఎగ్జిబిషన్ ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో  విద్యా రంగ వ్యాప్తికి కృషి చేస్తున్నామని ఎగ్జిబిషన్ కార్యదర్శి బి.హన్మంతరావు చెప్పారు. ముఖ్యంగా మహిళా కళాశాలలు, పాలిటెక్నిక్, ఫార్మసీ, ఇంజినీరింగ్, డిగ్రీ, ఐటీఐ కళాశాలలను స్థాపించి విద్యా వ్యాప్తికి నిరంతరం పాటు పడుతున్నామని పేర్కొన్నారు. 


స్టాల్స్ విషయంలో జాగ్రత్తలు


ఎగ్జిబిషన్ లో స్టాల్స్ విషయంలో సొసైటీ జాగ్రత్తలు తీసుకుంటుందని, ఫైర్, హెల్త్, అంబులెన్స్ విషయంలో చర్యలు చేపట్టినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నుమాయిష్ ప్రదర్శనతో వచ్చే ఆదాయంతో 20కి పైగా విద్యా సంస్థలు నడుస్తున్నాయని, 30 వేల మంది మహిళలకు విద్య అందుతుందన్నారు. సందర్శకులకు సౌలభ్యం కలిగేలా మెట్రో రైలు కోసం స్పెషల్ టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు.


Also Read: Revanth Reddy: తక్కువ దూరంతోనే ఎయిర్ పోర్టుకు మెట్రో, కొత్త రూట్స్ చెప్పిన రేవంత్ రెడ్డి