Revanth Reddy Comments: గత ప్రభుత్వ హాయాంలో చేపట్టిన మెట్రో, ఫార్మా సిటీ ప్రాజెక్టులను తాము రద్దు చేయడం లేదని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే, ఎయిర్ పోర్టు మెట్రో విషయంలో దూరాన్ని తగ్గించే విషయంలో మాత్రం కసరత్తు చేస్తున్నామని అన్నారు. ప్రజాప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని ఎయిర్ పోర్టు మెట్రోలో మార్పులు చేస్తున్నామని అన్నారు. బీహెచ్‌ఈఎల్‌ నుంచి ఎయిర్ పోర్టుకు 32 కిలో మీటర్ల దూరం ఉంటున్నందున.. ఎంజీబీఎస్‌ నుంచి పాతబస్తీ మీదుగా విమానాశ్రయానికి మెట్రో మార్గం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం పేర్కొన్నారు. నేడు (జనవరి 1) ఈ మేరకు సీఎం రేవంత్‌ రెడ్డి  మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. 


నాగోల్ నుంచి ఎల్బీ నగర్, చాంద్రాయణ గుట్ట వద్ద ఎయిర్ పోర్టుకు వెళ్లే మెట్రో లైనుకు అనుసంధానిస్తామని రేవంత్ రెడ్డి వివరించారు. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం (ఆర్‌సీ పురం), ఇటు మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, నానక్ రామ్ గూడ వరకు పొడిగిస్తామని చెప్పారు. తాము కొత్తగా ప్రతిపాదించనున్న మెట్రో కారిడార్లు గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఖర్చుతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతోనే పూర్తవుతాయని రేవంత్ రెడ్డి వివరించారు.


ఈ ఏరియాల్లో స్పెషల్ క్లస్టర్లు


హైదరాబాద్ లో ఫార్మా సిటీ, ఔటర్ రింగ్ రోడ్, రీజినల్‌ రింగ్ రోడ్ మధ్య జీరో పొల్యుషన్ తో ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ప్రత్యేక క్లస్టర్ల దగ్గర పరిశ్రమల్లో పని చేసే వారికి ఇళ్ల నిర్మాణం చేపడతామని వివరించారు. కార్మికులు హైదరాబాద్‌ వరకు రాకుండా అక్కడే అన్ని ఏర్పాట్లు చేస్తామని వివరించారు. యువతకు అవసరమైన స్కిల్స్ పెంపొందించడానికి ప్రత్యేక యూనివర్సిటీలు కూడా ఏర్పాటు చేస్తామని వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన సంస్థలు, ప్రముఖ పారిశ్రామికవేత్తల ద్వారా ట్రైనింగ్ ఇప్పిస్తామని వివరించారు. ఈ స్కిల్స్ కు సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఉంటాయని అన్నారు.