ధోనీ దగ్గర నుంచి కోహ్లీ వరకు అందరూ క్రికెట్ గాడ్ సచిన్‌ను ఆరాధిస్తూ పెరిగిన వాళ్లే. ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నా.. ఎన్నో చారిత్రక ఘటనలకు సాక్ష్యంగా నిలిచినా అది ఒక్క సచిన్‌కే చెల్లింది. ప్రపంచంలో శత శతకాలు సాధించి సచిన్ ఔరా అనిపించాడు. సచిన్ భారత్ తరఫున 200 టెస్టు మ్యాచ్‌లు, 463 వన్డేలు, ఒక టీ20 ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు (100) , పరుగులు 34,357 చేశాడు. ఏప్రిల్ 24,1973లో ముంబైలో జన్మించిన సచిన్, 1989లో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. టెస్ట్, వన్డే, టీ20 లో మొత్తం 664 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. బ్రియాన్ లారా కూడా అంతే 90ల్లో క్రికెట్‌ను శాసించిన దిగ్గజ క్రికెటర్లలో లారా ఒకడు. సచిన్ భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తే.. లారా విండీస్ తరఫున రికార్డులు సృష్టించాడు. వీరిద్దరిలో ఎవరు ఉత్తమం అంటే.. అందరూ సచిన్ పేరే చెబుతారు. కానీ, ఆసీస్ ఆటగాళ్లు, అభిమానులు మాత్రం బ్రియాన్ లారా బెస్ట్ అని అంటారు. ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అనే అంశంపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, దిగ్గజం అలీ బచర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సచిన్ వేరే గ్రహం నుంచి వచ్చి బ్యాటింగ్ చేశాడా అనిపిస్తుందని బచర్ అన్నాడు. అతడు ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ప్రత్యక్షంగా చూసిన తర్వాత అతను వేరే ప్లానెట్ నుంచి వచ్చి ఉంటాడని అనుకున్నట్లు వ్యాఖ్యానించాడు. వ్యక్తిగతంగానూ సచినే ఉత్తమమని... మైదానంలో ఎప్పుడైనా సచిన్ ఎవరితోనైనా గొడవ పడడం చూశారా అని బచర్ ప్రశ్నించాడు. ఆస్ట్రేలియా అభిమానులు సచిన్ కంటే లారా ఉత్తమమని భావిస్తుంటారు కానీ తన వరకు అవన్నీ చెత్తమాటలని ఏకిపారేశాడు. లారా కేవలం 40 లక్షల మంది ముందు మాత్రమే మ్యాచ్‌లు ఆడాడు. కానీ, సచిన్ 140 కోట్ల మంది అభిమానుల కోసం భారత్ తరఫున బరిలోకి దిగాడని ప్రశంసల జల్లు కురిపించాడు. ఇలాంటి సమయంలో ఒత్తిడి ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందో ఊహించగలరా? అందుకే, సచిన్ కంటే లారా ఉత్తమమని తనకు చెప్పొద్దని బచర్ తెలిపాడు.
సచిన్ విగ్రహమే నిదర్శనం
ఇటీవలే అశేష అభిమానులను సంపాదించుకున్న క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. కోట్లాదిమంది క్రికెట్ అభిమానులకు దేవుడైన సచిన్ నిలువెత్తు విగ్రహం ఆవిష్కృతమైంది. సచిన్ చివరి మ్యాచ్ ఆడిన ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహావిష్కరణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఇప్పటికే స్టేడియంలో సచిన్ పేరిట ఉన్న స్టాండ్ పక్కనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సచిన్ స్ట్రెయిట్ డ్రైవ్ షాట్ కొడుతున్న పోజులో ఉన్న ఈ విగ్రహం ఆకట్టుకుంటోంది. సచిన్ సమక్షంలోనే ఈ విగ్రహావిష్కరణ జరిగింది. యువ క్రికెటర్లకు స్ఫూర్తి నింపేందుకు... నాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చేందుకు... సచిన్ నిలువెత్తు విగ్రహం కొలువుదీరింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానం పొందిన సచిన్ విగ్రహావిష్కరణతో మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. సచిన్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‍నాథ్ షిండే, ఎన్‍సీపీ చీఫ్, ఐసీసీ మాజీ ఆధ్యక్షుడు శరద్ పవార్, బీసీసీఐ సెక్రటరీ జైషా, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, ఎంసీఏ అధ్యక్షుడు అమోల్ కాలే పాల్గొన్నారు. సచిన్ టెండూల్కర్ భార్య అంజలి, కూతురు సారా కూడా ఈ ప్రత్యేక కార్యక్రమానికి వచ్చారు.