సఫారీ గడ్డపై తొలి టెస్టు(First Test)లో ఘోర పరాజయం పాలైన టీమిండియా(Team India) మూడో తేదీ నుంచి రెండో టెస్టుకు సిద్ధమవుతోంది. తొలి టెస్టులో విరాట్‌ కోహ్లీ(Virat Kohli), రాహుల్‌(Rahul) మినహా మిగిలిన భారత బ్యాటర్లందరూ ఘోరంగా విఫలం కావడంపై సర్వత్రా విమర్శల జల్లు కురుస్తోంది. శుభ్‌మన్‌ గిల్‌(Subhman gill) తొలి టెస్టు రెండు ఇన్నింగ్సుల్లోనూ తక్కువ స్కోరుకే అవుట్‌ కావడం టీమిండియాను ఆందోళన పరుస్తోంది. దక్షిణాఫ్రికా(South Africa)తో మొదటి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లు 2 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 26 పరుగులకే గిల్‌ వెనుదిరిగాడు. గిల్‌ వైఫల్యంపై టీమిండియా మాజీ క్రికెటర్‌ సునీల్ గవాస్కర్‌(Sunil Gavaskar ) స్పందించాడు. టెస్టు క్రికెట్లో(Test Cricket) బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు భారత ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ తన దూకుడు తగ్గించుకోవాలని దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ సూచించాడు.
  

 

టెస్ట్‌ క్రికెట్‌ భిన్నం

టెస్టు క్రికెట్లో గిల్‌ చాలా దూకుడుగా ఆడుతున్నాడని... టీ20, వన్డేలతో పోల్చుకుంటే టెస్టు క్రికెట్‌ కాస్త భిన్నమైందని గవాస్కర్‌ అన్నాడు. ఫార్మాట్ల మధ్య తేడా బంతిలోనే ఉంటుందని... గాలిలో, పిచ్‌పై పడిన తర్వాత తెలుపు రంగు బంతి కంటే ఎరుపు బాల్‌లో కదలిక ఎక్కువగా ఉంటుందని... అధికంగా బౌన్స్‌ అవుతుందని.. ఈ విషయాలను గిల్‌ గుర్తుంచుకోవాలని గవాస్కర్‌ అన్నాడు. తన కెరీర్‌ను గిల్‌ చాలా బాగా ప్రారంభించాడన్న లిటిల్‌ మాస్టర్‌... అతని షాట్‌లను మెచ్చుకున్నామని..  గిల్‌ తిరిగి ఫామ్‌లోకి రావాలని ఆశిస్తున్నానని... భవిష్యత్తులో బాగా కష్టపడి రాణిస్తాడని ఆశిస్తున్నా’’ అని గావస్కర్‌ తెలిపాడు. 

 

రెండో టెస్ట్‌కు ముందు ప్రొటీస్‌కు ఎదురుదెబ్బ

సెంచూరియన్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఘన విజయం సాధించి మంచి ఊపు మీదున్న దక్షిణాఫ్రికాకు ఎదురు దెబ్బ తగిలింది. కీలకమైన రెండో టెస్టుకు ముందు ఆ జట్టు కీలక ఆటగాడు గెరాల్డ్‌ కొట్జీ దూరమయ్యాడు. తొలి టెస్టు సందర్భంగా గాయపడిన గెరాల్డ్‌ కొట్జీ జనవరి 3 నుంచి జరిగే ఆఖరి టెస్టుకు అందుబాటులో ఉండడం లేదని క్రికెట్‌ దక్షిణాఫ్రికా తెలిపింది. అతడి స్థానంలో పేసర్లు ఎంగిడి, ముల్డర్‌లతో పాటు స్పిన్నర్‌ కేశవ్‌ తుది జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కెప్టెన్‌ బవుమా రెండో టెస్ట్‌కు దూరమయ్యాడు. తొలి టెస్టు తొలి రోజే ఫీల్డింగ్‌లో తొడ కండరాలు పట్టేయడంతో బవుమా మైదానం వీడాడు. రెండో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్న ఎల్గర్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. ఈ సిరీస్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌కు ఎల్గర్ వీడ్కోలు పలకనున్నాడు. ఇప్పటికే ప్రొటీస్‌ కెప్టెన్‌ బవుమా గాయం కారణంగా రెండో టెస్ట్‌కు దూరం కావడంతో.. అతని స్థానంలో ఎల్గర్‌ దక్షిణాఫ్రికా కెప్టెన్‌ (South Africa Captain Dean Elgar)గా వ్యవహరించనున్నాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్‌ డీన్‌ ఎల్గర్‌కు తన కెరీర్‌ ఆఖరి టెస్టులో కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. కెప్టెన్‌ తెంబా బవుమా గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో క్రికెట్‌ దక్షిణాఫ్రికా.. సారథ్య బాధ్యతలను ఎల్గర్‌కు అప్పగించింది.