CM Jagan District Tour: కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టామో లేదో రాజకీయం కాక రేపుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో పొలిటికల్‌ మైలేజీ పెంచుకునే పనిలో పడ్డారు. అధికార వైఎస్‌ఆర్‌సీపీ ఒక వైపు, టీడీపీ జనసేన కూటమి మరోవైపు జనం బాట పడుతున్నారు. 


అభ్యర్థుల ఎంపికను ఒకవైపు ఖరారు చేస్తూనే పార్టీ విజయం కోసం రాష్ట్రపర్యటన చేసేందుకు సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నారు. జనవరి 21 నుంచి ఎన్నికల నోటిఫికేషన్ పడే వరకు జనంలో ఉండేందుకు భారీ స్కెచ్ వేస్తున్నారు. దీని కోసం ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు దీని విధివిధానాలపై ఎలాంటి సమాచారం లేకపోయినా పర్యటన ఉంటుందట. 


సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీలోని ముఖ్యులు పర్యవేక్షిస్తున్నారు. దీన్ని ఎక్కడ ప్రారంభించి ఎక్కడ ఎండ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దీని పేరుపై కూడా కసరత్తు విస్తృతంగా జరుగుతోంది. మరో వారం పది రోజుల్లో ఈ సీఎం టూర్‌పై క్లారిటీ రానుంది. 


వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్ ప్రజలతో మమేకమైంది చాలా తక్కువ. ఏదైనా పథకం నిధుల విడుదల కోసం బటన్ నొక్కడానికి జిల్లాలకు వెళ్లినప్పుడు కొంతమందితో నేరుగా కలిశారు. ఆ టూర్‌ కూడా భారీ బందోబస్తుతో సాగేది. 
ప్రజలకేంటీ పార్టీ నేతలకి కూడా కలవడం లేదనే అపవాదు కూడా జగన్‌పై ఉంది. నియోజకవర్గాల అభ్యర్థులను మారుస్తున్నటైంలో కొందరు నేతలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఏదైనా జిల్లా పర్యటనకు వస్తే కానీ తమకు జగన్ దర్శన భాగ్యం ఉండటం లేదని చెవుళ్లు కొరుక్కుంటున్నారు. ప్రతిపక్షాలు కూడా ఆయన పర్యటనలన్నీ పరదాల మాటున జరుగుతున్నాయని సెలెక్టెడ్‌ పీపుల‌్‌ను మాత్రమే కలిసేలా ప్లాన్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 


అందుకే ఈ ఆరోపణలు, అపవాదులు తొలగించి ఇప్పుడు నేరుగా జగన్ జిల్లా పర్యటనకు సిద్ధమవుతున్నారు. జనవరి 21 నుంచి నిత్యం జనాల్లో ఉండేలా టూర్ ప్లాన్ చేస్తున్నారు. ఆ సమయంలో సామాన్య ప్రజలకు, పార్టీ లీడర్లకు సమయం ఇచ్చి వారి ఇబ్బందులు తెలుసుకోనున్నారు. కొన్ని సమస్యలు స్పాట్‌లోనే పరిష్కరించబోతున్నారు. కొన్నింటిని లీస్ట్ చేసుకొని తర్వాత పరిష్కరిస్తామనే భరోసాను పార్టీ కేడర్‌కు, ప్రజలకు కలిగించనున్నారు.