YSRCP And Jagan Politics In 2024: 2024లోకి వచ్చేశాం. 2023లో మిగిల్చిన ఎన్నో మెమొరీస్‌ను గుర్తు చేసుకొన్ని కొత్త ఆశలతో మరింత మంచి జరగాలన్న ఆకాంక్షతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ సంవత్సరం ఎన్నో విజయాలు సాధించాలని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోట్ల మంది ఆశిస్తున్నారు. సామాన్యులకు ఎన్ని ఆశలు ఆశయాలు ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలకు మాత్రం 2024 మరిచిపోలేని సంవత్సరంగా మిగిలిపోనుంది. 


ఏపీ రాజకీయాలు పీక్స్‌


2024 తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలకు పెద్ద పరీక్ష పెట్టబోతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇది మరింత టెన్షన్ పెట్టనుంది. రాబోయే ఎన్నికలు అన్ని పార్టీలకు లిట్మస్‌ టెస్టుగానే చెప్పువచ్చు. జరగబోయే ఎన్నికలు అన్ని పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారుతున్నాయి. అందుకే వ్యూహా ప్రతివ్యూహాలతో ఇప్పటికే రాజకీయాన్ని పీక్స్‌కు తీసుకెళ్లారు. 


జగన్ లిట్మస్ టెస్ట్


అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌సీపీకి 2024 ఎప్పటికీ మర్చిపోలేని ఏడాదిగా మారిపోనుంది. ప్రస్తుతం అధికారంలో ఉంటూ సంక్షేమ జపం చేస్తున్న ఆ పార్టీ రెండోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించాలని చూస్తోంది. 2023లోనే ఎన్నికల వ్యూహాన్ని అమలు చేసిన జగన్... దాన్ని మరింత స్పీడ్‌గా తీసుకెళ్లనున్నారు. ఇవాళ్టి నుంచి మూడువేల రూపాయల పింఛన్ ఇస్తున్నారు. మాట తప్పడం లేదు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం... ఇంతకంటే సంక్షేమ పాలన ఎవరు ఇస్తారంటూ ప్రచారం షురూ చేసిందా పార్టీ. 


క్లీన్ స్వీప్ చేయాలని ప్లాన్


2019 ఎన్నికల్లో 151 సీట్లలో విజయం సాధించిన వైఎస్‌ఆర్‌సీపీ ఈసారి 175కి 175 సీట్లలో విజయం సాధించి దేశ చరిత్రలోనే కొత్త చరిత్రను రాయాలని ప్లాన్స్ వేస్తోంది. క్షేత్రస్థాయిలో ఉన్న బలాబలాలను ఎప్పటికప్పుడు సర్వేల రూపంలో తెప్పించుకుంటున్న జగన్‌.. అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వారిని మొహమాటం లేకుండా తప్పిస్తున్నారు. సీటు ఇవ్వలేమని చెప్పేస్తున్నారు. అధికారంలోకి వస్తే వేరే పదవులు ఇస్తామంటూ బుజ్జగిస్తున్నారు. 


సీట్ల మార్పుతో అసంతృప్తి
ప్రస్తుతానికి గుంటూరు జిల్లాలో 11 మందిని మార్చి మొదటి విడత సంస్కరణకు శ్రీకారం చుట్టారు జగన్. ఇప్పుడు మరికొన్ని జిల్లాలపైవిస్తృతంగా కసరత్తు చేస్తున్నారు. 11 సీట్ల మార్పుతో వచ్చిన అసంతృప్తిని ఇంత వరకు పార్టీ పరిష్కరించలేదు. ఇప్పుడు మరికొందర్ని మార్చేస్తున్నారంటూ వస్తున్న ప్రచారంతో రోజురోజుకు అసంతృప్తులు పెరిగిపోతున్నారు. ఇది పార్టీకి పెద్ద తలనొప్పిగా మారుతోంది. దీన్ని ఎలా ఎదుర్కొని అభ్యర్థులను గెలిపించుకుంటుందో పార్టీకి పెద్ద సవాల్. 


ఉద్యోగుల డిమాండ్లు


సంక్షేమమే ప్రధాన అజెండా అంటూ పాలిస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని అభివృద్ధి సంగతి, ఉద్యోగాలు, పరిశ్రమలు ఎక్కడా అంటూ ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. ఒకటో తేదీకి జీతాలు వేయండి మహాప్రభో అంటూ ప్రభుత్వ ఉద్యోగులు వేడుకుంటున్నారు. కొన్ని నెలల నుంచి జీతాలు రావడం లేదని కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, ఇతర ఉద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. రోడ్లు సరిగా లేవని  ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల టైంలో సమస్యలన్నీ చుట్టుముడుతున్నాయి. వీటిని పరిష్కరించుకొని ఎన్నికల నాటికి క్లియర్ చేసుకొని వెళ్లడం జగన్ ముందున్న మరో సవాల్. 


కూటమి వ్యూహాల సవాళ్లు


కూటమితో అతి పెద్ద సవాల్‌ కూడా ఎదుర్కుంటున్నారు జగన్. టీడీపీ జనసేన కూటమిగా ఏర్పడిన తర్వాత ఏపీలో రాజకీయం మరింత హాట్‌హాట్‌గా మారింది. ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా ప్రజల ముందుకు వెళ్తున్నాయి. మొన్న వైజాగ్‌లో బహిరంగ సభ తప్ప వేరే కార్యక్రమం చేయలేదు. ఈ వారం నుంచి చంద్రబాబు, లోకేష్‌, పవన్ వేరువేరుగా ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఉమ్మడి సమావేశాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అక్కడి నుంచి వచ్చే ప్రశ్నలు, రాజకీయ ఎత్తుగడలను ఎదుర్కొని ఎన్నికల పద్మవ్యూహాన్ని ఛేదించడం జగన్‌కు ఉన్న మరో ఫజిల్. 


బాణం నుంచి ప్రమాదం


అన్నింటి కంటే ఇంకో పెద్ద సమస్య జగన్‌ను వెంటాడనుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. షర్మిల కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఏపీ పీసీసీ చీఫ్‌ అయితే మాత్రం జగన్‌ మరింత ఇరకాటంలో పడతారని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇది ప్రచారమే అయినా ఒకట్రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ రాబోతోంది. సొంత సోదరి ప్రత్యర్థి పార్టీలో ఉంటూ విమర్శలు చేస్తుంటే జగన్ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తారనే ఆసక్తి అందరిలో ఉంది.