రాజకీయ పార్టీలకు ఆయువు పట్టుగా నిలిచే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 2023 సంవత్సరం సంచలనాలకు కేంద్రంగా నిలిచింది. ముఖ్యమంత్రి అనేక సార్లు పర్యటనలు, భారీ బహిరంగ సభలతోపాటు టీడీపీ మహానాడు, మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత భరోసా యాత్ర, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వారాహియాత్ర, టీడీపీ జీతీయ కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర, చంద్రబాబు అరెస్ట్‌, రాజమండ్రి కేంద్రంగా దాదాపు 53 రోజుల పాటు చంద్రబాబు భార్య కోడలు బ్రహ్మణి, బాలకృష్ణ తదితర టీడీపీ హేమాహేమీలు రాజమండ్రిలోనే మకాం వేసిన పరిస్థితి. చంద్రబాబును కలిసేందుకు పవన్‌ కళ్యాణ్‌ రాజమండ్రి రాక, టీడీపీ, జనసేన పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్తాయని ప్రకటించడం ఇలా అనేక అంశాలతో 2023 ఏడాదంతా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఓ యుద్ధ వాతావరణమే కనిపించింది. రాష్ట్ర రాజకీయం అంతా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగా నడిచి అనేక సంచలనాలకు కేరఫ్‌ అడ్రస్‌గా మారింది.


ముఖ్యమంత్రి ఆరుసార్లు పర్యటన..


ఈ ఏడాదిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆరుసార్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన చేపట్టి పలు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ, జనసేన అధినేతలపై విరుచుకుపడ్డారు. వరదల నేపథ్యంలో ముమ్మిడివరం నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పలు వరాలు కురిపించారు. ఆ తరువాత అమలాపురం, కొవ్వూరు, అనపర్తి, జగ్గంపేట, రాజోలు నియోజకవర్గాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి పలు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో అధునాతనంగా నిర్మించిన జగనన్న కాలనీల ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టారు.


మహానాడు సక్సెస్‌తో టీడీపీలో జోష్‌..


తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే టీడీపీ మహానాడు రాజమండ్రి వేమగిరి వేదికగా నిలిచింది. భారీ ఏర్పాట్లు మధ్య మే 27న ప్రారంభమైన మహానాడుకు వేలాదిగా తెలుగు తమ్ముళ్లు తరలివచ్చారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ మహానాడులో టీడీపీ అనేక తీర్మాణాలు చేసి ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. దీంతో రాష్ట్రం ఒక్కసారిగా ఎలక్షన్‌ మూడ్‌లోకి వెళ్లిన పరిస్థితి కనిపించింది. బహిరంగ సభరోజు వాతావరణం అనుకూలించకపోయినా కదలని భారీ జనసందోహం మధ్యలో టీడీపీ మ్యానిఫెస్టో ప్రకటించారు. మొత్తంమీద టీడీపీ మహానాడు విజయవంతంగా ముగియడంతో టీడీపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.. 


ఉత్సాహంగా సాగిన పవన్‌కల్యాన్‌ వారాహియాత్ర..


వారాహి యాత్ర తొలి విడతలో భాగంగా జూన్‌ 14న అన్నవరం నుంచి ప్రారంభించిన పవన్‌ కళ్యాణ్‌ కాకినాడ జిల్లా, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఉత్సాహంగా సాగింది. ఇందులో కాకినాడ, అమలాపురం, మలికిపురం ప్రాంతాల్లో నిర్వహించిన బహిరంగ సభలు హైలెట్‌గా నిలిచాయి.. అన్నవరం నుంచి ప్రారంభమైన వారాహి యాత్ర రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం బహిరంగ సభతో అంబేడ్కర్‌ జిల్లాలో ముగించుకుని నర్సాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించింది.. వారాహి యాత్ర ద్వారా పార్టీ క్యాడర్‌లోనే కాదు జనసైనికులు, వీర మహిళల్లో ఉత్సాహాన్ని నింపింది..  


చంద్రబాబు అరెస్ట్‌..
స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ స్కాం కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నంధ్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు శిబిరం వద్దకు సెప్టెంబర్‌ 9న తెల్లవారుజామున చేరుకున్న సీఐడీ పోలీసుల బృందం సీఆర్పీసీ సెక్షన్‌ 50(1)(2) కింద నోటీసులు ఇచ్చి అరెస్ట్‌ చేశారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా విజయవాడ కోర్టుకు తరలించి కోర్టు రిమాండ్‌తో వైద్యపరీక్షలు అనంతరం రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఈనేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరసనలు తెలియజేశారు. చంద్రబాబు అరెస్ట్‌తో రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీట్‌ ఎక్కింది..


యువగళం పాదయాత్రకు బ్రేక్‌..
చంద్రబాబు అరెస్ట్‌ నేపధ్యంలోనే అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో యువగళం పాదయాత్రలో ఉన్న లోకేష్‌ తన పాదయాత్రకు తాత్కాలిక విరమణ ఇచ్చి విజయవాడ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో యువగళం పాదయాత్రను విరమించుకుని చంద్రబాబు వద్దకు వెళ్లారు లోకేష్‌.. చంద్రబాబు అరెస్ట్‌ కారణంగా సెప్టెంబర్‌ 10న ఆగిపోయిన యువగళం పాదయాత్ర 79 రోజుల విరామం తరువాత నవంబర్‌ 27న రాజోలు నియోజకవర్గం పొదలాడ ప్రాంతం నుంచి తిరిగి ప్రారంభించారు..


రాజమండ్రి కేంద్రంగా పొత్తును వెల్లడిరచిన టీడీపీ జనసేన
స్కిల్‌ స్కాం కేసులో అరెస్ట్‌ అయ్యి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న చంద్రబాబును ములాఖత్‌లో కలిశారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్‌, బాలకృష్ణతో కలిసి వచ్చిన పవన్‌ కళ్యాన్‌ రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసే వెళ్తాయని ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.. 


చంద్రబాబు విడుదల.. యువగళం పుణప్రారంభం..
స్కిల్‌ స్కాం కేసులో నంధ్యాలలో సెప్టెంబర్‌ 9న టీడీపీ అధినేతను అరెస్ట్‌చేసి సీఐడీ పోలీసులు ఆ సీఐడీ కోర్టు రిమాండ్‌ విధించడంతో రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు చంద్రబాబును తరలించారు.. 97 రోజుల అనంతరం చంద్రబాబు షరతులతో కూడా బైలుపై విడుదల కావడంతో కుటుంబ సభ్యులు, పార్టీ ముఖ్యనాయకులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం మధ్య భారీ ర్యాలీతో ఆయన విజయవాడ వెళ్లారు.. చంద్రబాబు విడుదల  నారాలోకేష్‌ తన యువగళం పాదయాత్రను పునప్రారంభించారు.. చంద్రబాబు అరెస్ట్‌ కారణంతో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ వద్ద ఆగిపోయిన ప్రాంతం నుంచి నవంబర్‌ 27 నుంచి లోకేష్‌ యువగళం పాదయాత్ర పునప్రారంభం అయ్యింది. 


జోష్‌ నింపిన యువగళం పాదయాత్ర..
నవంబర్‌ 27న రాజోలు మండలం పొదలాడ వద్ద పునప్రారంభించిన నారా లోకేష్‌ తన పాదయాత్రను అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో వడివడిగా పూర్తిచేశారు. జగ్గన్నపేట ప్రాంతంలో భారీ బహిరంగ సభలో లోకేష్‌ వైసీపీ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.