Hotel Staff attacked customers in Hyderabad: హైదరాబాద్ : బిర్యానీ బాలేదన్నందుకు, అందులో ముక్కలు తక్కువగా వచ్చాయన్నందుకు అబిడ్స్ గ్రాండ్ హోటల్ (Abids Grand Hotel) లో కస్టమర్లపై వెయిటర్లు దాడి చేశారు. కర్రలు, కుర్చీలతో వెయిటర్లు, హోటల్ సిబ్బంది దాడి చేయగా.. 12 మంది యువతీ యువకులకు గాయాలయ్యాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో భాగంగా బిర్యానీ తినేందుకు వెళితే వారిపై హోటల్ సిబ్బంది దాడి చేయడం నగరంలో సంచలనంగా మారింది. ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. దూల్ పేటకు చెందిన వారిపై దాడి చేశారని.. గ్రాండ్ హోటల్ సిబ్బంది, యాజమాన్యంపై చర్యలు తీసుకోలేదని రాజా సింగ్ అబిడ్స్ పోలీసులను డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే హాటల్ కు నిప్పు పెడతామని సైతం రాజా సింగ్ హెచ్చరించినట్లు సమాచారం.


అసలేం జరిగిందంటే.. 
దూల్ పేటకు చెందిన కొందరు యువతీ యువకులు న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో భాగంగా బయట డిన్నర్ చేద్దామనుకున్నారు. అబిడ్స్ GPO వెనుక ఉన్న గ్రాండ్ హోటల్ కు యువతీ యువకులు వెళ్లారు. అక్కడ మటన్ బిర్యానీ, కొందరికి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే బిర్యానీలో ముక్కలు తక్కువ రావడంతో కస్టమర్లు హోటల్ సిబ్బందిని ప్రశ్నించారు. అందులోనూ బిర్యానీ సరిగా లేదని, ఎందుకు ఇలా సర్వ్ చేస్తున్నారని కాస్త గట్టిగానే అడినట్లు తెలుస్తోంది. బిల్లు మాత్రం పూర్తిగా తీసుకుని కస్టమర్లను మోసం చేస్తున్నారంటూ దూల్ పేటకు చెందిన యువతీ యువకులు గ్రాండ్ హాటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 


కర్రలు, కుర్చీలతో కస్టమర్లపై దాడి.. 
బిర్యానీ అంత బాగాలేదని, మటన్ ముక్కలు తక్కువగా వచ్చాయని, బిల్లు మొత్తం కట్టేది లేదని చెప్పడంతో హోటల్ వెయిటర్లు వారితో గొడవకు దిగారు. ఈ క్రమంలో కస్టమర్లు, హోటల్ సిబ్బంది పరస్పరం దాడులు చేసుకున్నారు. హోటల్ సిబ్బంది అయితే కర్రలు తీసుకొచ్చి మరీ కస్టమర్లను విచక్షణారహితంగా చితకబాదారు. కుర్చీలతో సైతం కస్టమర్లపై దాడి చేయగా పలువురు కస్టమర్లు గాయపడ్డారు. తీవ్రగాయాలైన వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తమ ఏరియాకు చెందిన వారిపై హోటల్ సిబ్బంది అకారణంగా దాడి చేసి గాయపరిచిందని ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. బాధ్యులైన హోటల్ సిబ్బందిపై, యాజమాన్యంపై కేసు నమోదు చేసుకుని చర్యలు తీసుకోవాలని అబిడ్స్ పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే హాటల్ పై దాడి చేసి నిప్పు పెడతామని హెచ్చరించినట్లు తెలుస్తోంది.


సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కస్టమర్లపై దాడికి పాల్పడిన అబిడ్స్ గ్రాండ్ హోటల్ కు చెందిన కొందరు వెయిటర్లను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. కస్టమర్లపై దాడి ఘటనకుగానూ పోలీసులు గ్రాండ్ హోటల్ పై 324, 504, 509 కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మరికొందరు నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని, కేసు దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. మరోవైపు హోటల్ యాజమాన్యం సైతం కస్టమర్లపై ఫిర్యాదు చేసింది. తమ సిబ్బందితో దురుసుగా మాట్లాడి, వారిపై దాడి చేయడం వల్లే గొడవ జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.