Devotees rush to Medaram Jatara : ప్రతి రెండు సంవత్సరాలకోసారి మాగశుద్ధ పౌర్ణమి రోజున గిరిజన కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర (Sammakka Sarakka Jatara) ప్రారంభం అవుతుంది. నాలుగు రోజులపాటు మేడారం జాతర ఘనంగా కొనసాగుతుంది. ఈ ఏడాది మేడారం జాతర (Medaram Jatara) ఫిబ్రవరి 21వ తేదీన మొదలై 24వ తేదీన ముగియనుంది. అయితే జాతర సమయంలో కాకుండా భక్తులు ముందే తరలివచ్చి వనదేవతలకు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
గిరిజన కుంభమేళా మేడారం జాతర..
ములుగు జిల్లా లోని మేడారం అభయారణ్యంలో ప్రతి రెండు సంవత్సరాలకోసారి జరిగే వనదేవతల జాతర ఘనంగా జరుగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 21నుంచి 24వ తేదీ వరకు నాలుగు రోజులపాటు మేడారం కుగ్రామం కాస్త గిరిజన కుంభమేళను తలపించనుంది. నాలుగు రోజుల పాటు జరిగే పనదేవతల జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మహారాష్ట్ర చత్తీస్గడ్ జార్ఖండ్ నుండి గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. సుమారు కోటి మంది భక్తులు తరలిరావడంతో నాలుగు రోజులపాటు మేడారం జనసంద్రంగా మారుతుంది.
ముందస్తుగా మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు..
జాతర సమయంలో గిరిజన దేవతలకు మొక్కులు చెల్లించుకోవడం ఇబ్బంది అనుకున్న భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతర సమయంలో గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకోవడం, మేడారంలో విడిది చేయడం కష్టం అనుకున్న భక్తులు సుమారు రెండు నెలల సమయానికి ముందుగానే తరలివచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతర సమయంలో గద్దల పైకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో పాటు జనం కిక్కిరిసి లైన్లలో గంటలు తరబడి నిలబడాల్సి వస్తుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని భక్తులు ముందుగానే తరలివచ్చి అమ్మవార్ల మొక్కులు చెల్లించుకుంటున్నామని భక్తులు చెప్పారు.
కరోనా భయంతో మేడారానికి అప్పుడే పోటెత్తారు..
వనదేవతల జాతర ఈసారి బుధవారం రోజున ప్రారంభమై నాలుగో రోజు శనివారం వరకు కొనసాగుతుంది. అమ్మవార్లకు బుధవారం, ఆదివారం పవిత్ర రోజులుగా భావించే భక్తులు ముందస్తు మొక్కుల్లో భాగంగా ఆదివారం, బుధవారం రోజుల్లో పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం ఆదివారం, సోమవారం నూతన సంవత్సరం రెండు రోజులు సెలవులు రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో మేడారానికి తరలివస్తున్నారు. జాతర సమయంలో భక్తుల రద్దీతో పాటు కరోనా మరోసారి విజృంభిస్తుండడంతో జాతర సమయంలో కరోనా వ్యాప్తి చెందుతుందనే భయంతో ముందుగానే వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నామని మరి కొంత మంది భక్తులు చెబుతున్నారు. గత 15 రోజులుగా బుధ, ఆదివారాలతో పాటు సెలవు రోజుల్లో రోజుకు లక్ష మంది భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.